పంట నాశనం

ABN , First Publish Date - 2022-09-11T05:24:33+05:30 IST

పెద్దేముల్‌ మండలం గొట్లపల్లి, కందనెల్లితండా శివారులో ఏర్పాటైన జిప్సం కర్మాగారంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలతో 12ఎకరాల మేర వరి నాటిన కొన్ని రోజుల్లోనే బూడిద రంగులోకి మారి ఎండుతోంది.

పంట నాశనం
గొట్లపల్లిలో పొలంలోకి రసాయన నీరు చేరడంతో మాడిపోయిన వరిపంట

  • జిప్సం కర్మాగారం నుంచి పొలాల్లోకి రసాయన వ్యర్థాలు 
  • కాలుష్యంతో నాలుగు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు
  •  12ఎకరాల్లో ఎండుతున్న పంటలు 
  •  సహజ స్వభావాన్ని కోల్పోతున్న నేల
  •  ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
  •  న్యాయం చేయాలని రైతుల వేడుకోలు

పెద్దేముల్‌ మండలం గొట్లపల్లి, కందనెల్లితండా శివారులో ఏర్పాటైన జిప్సం కర్మాగారంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలతో 12ఎకరాల మేర వరి నాటిన కొన్ని రోజుల్లోనే బూడిద రంగులోకి మారి ఎండుతోంది. కలుషిత నీరు పారి నేల స్వభావాన్నీ కోల్పోతోంది. దీంతో ఏటా రెండు పంటలకు పెట్టుబడి పెడుతున్న రైతులు దిగుబడితో పాటు పెట్టుబడీ నష్టపోతున్నారు. భూమి సైతం దేనికీ పనికిరాకుండా పోతోంది.

పెద్దేముల్‌/తాండూరురూరల్‌, సెప్టెంబరు10: పెద్దేముల్‌ మండలం గొట్లపల్లి, కందనెల్లితండా శివారులో జిప్సం కర్మాగారంతో స్థానిక రైతులకు పంటనష్టం కలుగుతోంది. భూమిలో పారుతున్న రసాయన వ్యర్థాలతో నేల స్వభావాన్ని కోల్పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిప్సం కర్మాగారం నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలతో పంటలు పాడవుతున్నాయి. 12 ఎకరాల్లో వరిపంట ఎండి బూడిద రూపంలోకి మారింది. పచ్చని పొలాల్లో జిప్సం ఫ్యాక్టరీ నుంచి వచ్చే రసాయనాలతో పంటలు పండడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో భూమి కూడా దేనికీ పనికిరాకుండా పోతోందని పేర్కొంటున్నారు. జిప్సం తయారీకి వాడుతున్న రసాయన వ్యర్థాలు తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన రైతుల పొలాల్లోకి చేరుతున్నాయి. రసాయన వ్యర్థాలు పొలాల్లోకి రావడంతో పంటలు ఎండిపోతున్నాయి. ప్రతి యేడు పంటలు సాగుచేయడం... కెమికల్‌ వ్యర్థాలు పంట పొలాల్లోకి చేరి ఎండిపోవడం సర్వసాధారణమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మూడేళ్ల నుంచి  రైతులు పంటలు నష్టపోతున్నారు. జిప్సం ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలని తాండూరు మండల సర్వసభ్య సమావేశంలో తీర్మానమూ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఫలితం కనిపించలేదు. జిప్సం ఫ్యాక్టరీ అంతారానికి చెందిన రైతులకు శాపంగా మారింది. ఈ కర్మాగారం వల్ల తమకు ఇబ్బందులు వస్తున్నాయని అంతారం వాసులు అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేశారు.  అయినా ఎవరూ పట్టించుకోలేదు. మూడేళ్లుగా రైతులకు ఇవే కష్టాలు తప్పడం లేదు. పంట పండకపోగా పెట్టిన పెట్టుబడీ మునుగుతున్నారు. జిప్సం ఫ్యాక్టరీ నుంచి వచ్చే రసాయన వ్యర్థాలతో పూర్తిగా నష్టపోతున్నారు. సమస్యను పరిష్కరించాలని  ప్రజావాణిలో రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిప్సం కర్మాగారం మూసివేయాలని, కర్మాగారంతో తాము నష్టపోయిన పంటలకు పరిహారం ఇప్పించాలని కోరారు.  

ధర్నాలు చేసిన కందనెల్లితండా వాసులు

కందనెల్లితండాకు జిప్సం కర్మాగారం దగ్గరే కావడంతో  పంటపొలాలకు వ్యర్థాలు పారినపుడు రైతులు ఆందోళనలు చేశారు. వ్యర్థాలు పంట పొలాలను నాశనం చేయడంతో పాటు రాత్రిపూట తండా మొత్తం దుర్గంధం వస్తోందని ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న దుర్వాసనతో ప్రజలు శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారని, అలాగే  మహిళలు గర్భస్రావాలకు గురవుతున్నారని ఆందోళన చేశారు. అప్పుడు అధికారులు చేరుకొని వారం రోజుల్లో విచారణ జరిపి ప్రజలకు నష్టం కలిగినట్లయితే ఫ్యాక్టరీని మూసేయిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకూ కర్మాగారాన్ని మూసివేయించలేదు. ఇన్ని గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పరిశ్రమను అధికారులు వెంటనే మూసి వేయించాలని,  లేనిపక్షంలో బాధిత గ్రామాల ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

అంతారం చెరువు నీరు కలుషితం

జిప్సం కర్మాగారం నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలతో తాండూరు మండలం అంతారం పెద్దచెరువు నీరు కూడా కలుషితమవుతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. నీరు కలుషితమై చెరువులోని చేపలు మృత్యువాత పడుతున్నాయని, చెరువులో నీటిని పశువులు కూడా తాగడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. నీటి వనరులకూ హాని చేస్తున్న ఈ పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

కర్మాగారం మూసివేయాలిర - శాంతయ్య (శాంత్‌కుమార్‌), ఎంపీటీసీ 

జిప్సం కర్మాగారం నుంచి వచ్చే రసాయన వ్యర్థాలతో పంటలు పాడవుతున్నాయి. చెరువు నీరు కలుషితమై ఆ నీటిని పశువులు తాగడం లేదు. రసాయన వ్యర్థాలు పారిన పొలాల్లో పనులు చేసే రైతులు, కూలీలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో పొలాల్లో పనిచేయడానికి కూలీలు రావడం లేదు. కర్మాగారం యజమాని ఓ నేత కావడం వల్ల  అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు.

కెమికల్‌ నీటితో పంటలు పోయాయి :- వడ్డె చంద్రయ్య, రైతు

జిప్సం కర్మాగారం నుంచి వెలువడుతున్న రసాయన నీటి కారణంగా  పొలాల్లో పంటలు పూర్తిగా పాడవుతున్నాయి. వరినాట్లు వేసిన కొద్ది రోజులకే మాడిపోతున్నాయి. మూడు సంవత్సరాలు గా పంటలు పండక నష్టపోయాం. అప్పులపాలయ్యాం. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. మొన్ననే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.

కలుషిత నీటితో దుర్వాసన :- వడ్డె దేవమ్మ, మహిళా రైతు

 జిప్సం కర్మాగారం నుంచి వస్తున్న నీరు కంపు కొడుతోంది. ఇంటిపెద్ద లేకపోవడంతో నేను వ్యవసాయం చేసుకుంటున్నా. మా భూమిలో పంటలు వేసుకుంటే ఫ్యాక్టరీ నీటితో మాడిపోతున్నాయి. పొలంలో పనులు  చేస్తుంటే ఆనీటికి మా కాళ్లు మండుతున్నాయి. పనులు చేయడానికి కూడా కూలీలు రావడం లేదు. కర్మాగారం మూసివేయించాలి. పంటలు నష్టపోయిన వారిరి పరిహారం ఇవ్వాలి.

Read more