సిగ్నల్‌ సమస్యలకు చెక్‌!

ABN , First Publish Date - 2022-07-06T05:15:23+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్‌ అందక రేషన్‌ పంపిణీలో తీవ్ర జాప్యం జరిగేది. దీంతో లబ్ధిదారులు రేషన్‌ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. అయితే సిగ్నల్స్‌ అందక రేషన్‌ డీలర్లు, లబ్ధ్దిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ 4జీ ఆధారిత అధునాతన ఈ-పాస్‌, తూకం యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

సిగ్నల్‌ సమస్యలకు చెక్‌!


  •  రేషన్‌ డీలర్లకు 4జీ నెట్‌వర్క్‌ ఈ-పాస్‌ యంత్రాలు
  •  సిగ్నల్‌ సమస్యలు ఉన్న చోట ఇక ఇబ్బందులు దూరం 
  •  కొత్త ఈ-పాస్‌ యంత్రాలతో రేషన్‌ పంపిణీ ప్రారంభం
  •  సరుకుల పంపిణీలో పెరగనున్న వేగం


వికారాబాద్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్‌ అందక రేషన్‌ పంపిణీలో తీవ్ర జాప్యం జరిగేది. దీంతో లబ్ధిదారులు రేషన్‌ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. అయితే  సిగ్నల్స్‌ అందక రేషన్‌ డీలర్లు, లబ్ధ్దిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ 4జీ ఆధారిత అధునాతన ఈ-పాస్‌, తూకం యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తూకం సక్రమంగా ఉంటేనే  పంపిణీ ప్రక్రియ పూర్తయ్యేలా ఈ-పాస్‌ పరికరాలను  రూపొందించింది.

వికారాబాద్‌, జూలై5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ సరుకుల పంపిణీలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి పౌర సరఫరాల శాఖ అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. రేషన్‌ సరుకుల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేందుకు ఈ-పాస్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చినా సిగ్నల్‌ సమస్యల కారణంగా ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయి. వేలి ముద్రలు వేయడానికి, ఐరి్‌షకు 2జీ పీవోఎస్‌ యంత్రాలు వినియోగిస్తుండడంతో తరచూ సమస్యలు ఎదురవుతున్నాయి. సిగ్నల్స్‌ సమస్యతో సర్వర్‌ మొరాయిస్తూ రేషన్‌ సరుకుల పంపిణీలో జాప్యం జరిగేది. లబ్ధిదారులు రేషన్‌ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. సిగ్నల్స్‌ కోసం ఇళ్లు, చెట్లపైకి ఎక్కిన సందర్భాలూ ఉన్నాయి. సిగ్నల్స్‌ అందక రేషన్‌ డీలర్లు, లబ్దిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ 4జీ నెట్‌వర్క్‌తో పనిచేసే 4జీ ఆధారిత అధునాతన ఈ-పాస్‌, తూకం యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కడైనా జియో నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇతర నెట్‌వర్క్‌ సిమ్‌ ఉపయోగించుకునే విధంగా దాంట్లో అవకాశం కల్పించారు. కొత్త ఈ-పాస్‌ పరికరం, ఐరి్‌షతో పాటు తూకం యంత్రాలను ఉపయోగించే విధానంపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్‌ డీలర్లకు అవగాహన కల్పించారు. జిల్లాలో 588 మంది రేషన్‌ డీలర్లు ఉండగా, వారందరికీ ఈ -పాస్‌, ఐరీష్‌ పంపిణీ చేశారు. జిల్లాకు తూకం యంత్రాలు 200 మాత్రమే సరఫరా కావడంతో వాటిని కొన్ని మండలాలకు మాత్రమే అందజేశారు. మిగిలిన మండలాలకు ఈనెలాఖరులోగా పంపిణీ చేసే విధంగా పౌర సరఫరాల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

త్వరలో టీ-వ్యాలెట్‌ సేవలు 

రేషన్‌ దుకాణాల్లో త్వరలో  టీ-వ్యాలెట్‌ సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. టీ-వ్యాలెట్‌ సేవలు వినియోగించుకునేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసిన నెట్‌వర్క్‌ సంబంధిత సమస్యల కారణంగా ఉపయోగించుకునేందుకు డీలర్లు ముందుకు రాలేదు. 4జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి రావడంతో సరుకుల పంపిణీతో పాటు టీవ్యాలెట్‌ వంటి ఇతర సేవలను లబ్ధ్దిదారులు వినియోగించుకునే అవకాశం ఏర్పడనుంది. విద్యుత్‌,  మొబైల్‌ చెల్లింపులు, రైళ్లు, బస్సుల రిజర్వేషన్‌, ఖాతాల్లో నగదు జమ, డ్రా చేయడం వంటి డిజిటల్‌ లావాదేవీలకు అవకాశం ఏర్పడనుంది.

 రేషన్‌ సరుకుల పంపిణీ ప్రారంభం

పౌర సరఫరాల శాఖ అందజేసిన కొత్త ఈ-పాస్‌ పరికరంతో రేషన్‌ సరుకుల పంపిణీ ప్రారంభించారు. మంగళవారం నుంచి రేషన్‌ దుకాణాల్లో  కొత్త ఈ-పాస్‌, ఐరిష్‌, తూకం యంత్రం వినియోగిస్తూ రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తున్నారు.  తూకం సక్రమంగా ఉంటేనే  పంపిణీ ప్రక్రియ పూర్తయ్యేలా ఈ-పాస్‌ పరికరాలు రూపొందించారు. రసీదు కూడా లబ్ధ్దిదారులకు అందే విధంగా అవకాశం కల్పించారు. ఈ-పాస్‌, ఐరిష్‌, తూకం యంత్రాల వినియోగంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కరించేందుకు ఐదుగురు ఫీల్డ్‌ ఇంజనీర్లను నియమించారు. ఒక్కో ఫీల్డ్‌ ఇంజనీర్‌కు  మూడు, నాలుగు మండలాలు కేటాయించారు. తమకు కేటాయించిన మండలాల్లో తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారానికి వారు చర్యలు తీసుకుంటారు. జిల్లాకు సరఫరా చేసిన ఈ-పాస్‌, ఐరీష్‌, తూకం యంత్రాలకు సంబంధించిన నిర్వహణ బాధ్యతలను విజన్‌ టెక్‌ సంస్థ పర్యవేక్షించనుంది. 

సిగ్నల్స్‌ సమస్య ఉండదు:  రాజేశ్వర్‌, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, వికారాబాద్‌ 

జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్‌ అందక రేషన్‌ పంపిణీలో తీవ్ర జాప్యం జరిగేది. రేషన్‌ దుకాణాల్లో 4జీ నెట్‌వర్క్‌ ఈ-పాస్‌ యంత్రాలు, ఐరిష్‌, కొత్త తూకం యంత్రాలు అందుబాటులోకి రావడంతో ఇక సమస్య ఉత్పన్నం కాదు. వాటిని ఏ విధంగా వినియోగించాలనే విషయమై రేషన్‌ డీలర్లకు అవగాహన కల్పించాం. ఏవైనా సాంకేతిక సమస్యలు నెలకొంటే పరిష్కరించేందుకు ఫీల్డ్‌ ఇంజనీర్లు అందుబాటులో ఉంటారు.

Read more