చిట్‌ఫండ్‌ చీటింగ్‌ నిందితులపై కేసు

ABN , First Publish Date - 2022-09-30T05:28:26+05:30 IST

చిట్‌ఫండ్‌ చీటింగ్‌ నిందితులపై కేసు

చిట్‌ఫండ్‌ చీటింగ్‌ నిందితులపై కేసు
మోసంపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం

  • ఏ-1 అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు
  • నట్టేట ముంచిన చిట్‌ఫండ్‌ కంపెనీ
  • ఆంధ్రజ్యోతి కథనాలతో ఏకమైన బాధితులు

తాండూరు, సెప్టెంబరు 29: తాండూరు, పరిసర ప్రాంతాల్లో చిట్టీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పేరిట కోట్ల రూపాయలు చీటింగ్‌ చే సిన బాలాజీ చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నిందితులను పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేసి ఏ-1నిందితుడు గంగిశెట్టి శ్రీనివా్‌్‌సను గురువారం అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. తాండూరు పట్టణం, చుట్టపక్కల గ్రామాల వారిని చిట్‌ ఫండ్‌ కంపెనీలో లక్షల రూపాయల చిట్టీలను వేయించి ఆ డబ్బులను రేట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ కింద డిపాజిట్‌ కట్టించుకొని చిట్‌ఫండ్‌ మూసేసి మోసం చేసిన నిర్వాహకులపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చిట్‌ఫండ్‌ మోసాలపై ఆంధ్రజ్యోతిలో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. పేదలు, రిటైర్డ్‌ ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఈ చిట్‌ఫండ్‌లో డబ్బు దాచుకున్నారు. అవసరాలకు డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మొత్తమే డబ్బులు రావేమోనని ఏడాదిన్నరగా వేచి చూశారు. ఎంతకూ డబ్బులు ఇవ్వ కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో మంత్రి కేటీఆర్‌కు సైతం ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. కోర్టును ఆశ్రయించి నిందితులపై వారెంట్‌ తెచ్చారు. బాధితుల ఒత్తిడి మేరకు బాలాజీ చిట్‌ఫండ్‌ కంపెనీ లిమిటెడ్‌ లో నిందితులుగా ఉన్న గంగిశెట్టి శ్రీనివాసులు, గంగిశెట్టి గోపాలకృష్ణ, గంగిశెట్టి అనురాధ, గంగిశెట్టి సరితపై కేసు నమోదు చేశారు. నిందితులపై చీటింగ్‌, చిట్‌ఫండ్‌ యాక్ట్‌, ఆర్‌బీఐ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో ఏ-1 నిందితుడైన గంగిశెట్టి శ్రీనివా్‌సను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.


  • మోసాలపై ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు

చిట్‌ ఫండ్‌ మోసాలపై ఆంధ్రజ్యోతిలో జూన్‌ 28న ‘అంతా చీటింగ్‌’ శీర్షికన కథనం ప్రచురితం కాగా, జూన్‌ 30న చిట్‌ఫండ్‌ డబ్బులు చేతికందేనా అనే మరో శీర్షకతో కథనంపై ప్రచురితమైంది. ఈ కథనాలతో చిట్‌ ఫండ్‌ బాధితులు ఆంధ్రజ్యోతితో తమ బాధనను వెళ్లబోసుకున్నారు. బాధితులు కూడా ఆంధ్రజ్యోతి కథనాలతో ఒక్కొక్కరుగా బయటికి వచ్చి ఓ గ్రూపుగా ఏర్పడి చిట్‌ఫండ్‌ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదులు చేయడంతోపాటు ఉమ్మడిగా పోరాటం చేశారు. ఇప్పటి వరకు కూడా ఆస్తులు అమ్మి డబ్బులు చెల్లిస్తామని చిట్‌ఫండ్‌ నిర్వాహకులు బాధితులకు నమ్మబలికారు. నమ్మించి నట్టేట ముంచుతున్న చిట్‌ఫండ్‌ కంపెనీ నిజస్వరూపం గుర్తించి ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంక కదులుతోంది.

Read more