కోతల్లో శ్రద్ధ.. ధాన్యంలో నాణ్యత

ABN , First Publish Date - 2022-11-16T00:18:40+05:30 IST

ఆరు నెలలు కష్టించి పండించిన పంటలను కోసే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి.

కోతల్లో శ్రద్ధ.. ధాన్యంలో నాణ్యత
మేడ్చల్‌ మండలంలో వరి కోస్తున్న హార్వెస్టర్‌

సరైన సమయంలో కోత పనులు చేపట్టాలి

పూర్తిగా ఎండిపోతే పంటనష్టం జరిగే ఆస్కారం

ఆరు నెలలు కష్టించి పండించిన పంటలను కోసే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి. వరి కోతల సమయంలో విత్తులో తేమ శాతం చూసుకోవడం, హార్వెస్టింగ్‌లో విత్తనాలు కల్తీ కాకుండా జాగ్రత్తపడాలి. ఈ అంశాలపై శ్రద్ధ పెడితేనే నాణ్యమైన పంట ఉత్పత్తిని మార్కెట్లోకి తరలించగలుగుతారు.

మేడ్చల్‌ నవంబరు 15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వరి కోతలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. పంట చేతికొచ్చిన సమయంలో కోతలు చేపట్టకపోతే రైతులు నష్టపోయే ఆస్కారం ఉంది. చేను పూర్తిగా ఎండినా, పండువారినా కోత సమయంలో గింజలు రాలు తాయి. పంట చేతికొచ్చినప్పటి నుంచి కోతలు, ధాన్యం నిల్వ చేయడం వంటి వాటిపై రైతులు అవగాహన పెంచుకోవాలి. వరికోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచనలు, సలహాలు ఇస్తూనే ఉన్నారు. పంట నాణ్యంగా ఉంటేనే రేటు వస్తుంది. కొన్ని నెలల పాటు ధాన్యం నిల్వ ఉంటుంది. చేను పండువారిన తరువాత కోతకు 15రోజుల ముందే నీటి తడులు నిలిపేయాలి. గెలకున్న చివరి గింజ పాలుతాగి పసు పెక్కే వరకూ పంట కోయొద్దు. ముందే కోస్తే తాలు గింజలవుతాయి. అలాగే మంచు కురిసే సమయాల్లో కోస్తే గింజలు మెత్తబడి ధాన్యం నలుపెక్కుతుంది. ఇ లా అని కోతలు ఆలస్యమైతే ఎండకు గింజ పగుళ్లు వచ్చి వడ్లు నూక అవుతాయి. 80 నుంచి 90శాతం వరి వెన్ను ల పసుపు రంగుకు మారుతున్న సమయంలో పంట కోయాలి. ఆకులు పూర్తిగా ఎండిపోయే వరకు చేనును ఉంచకూడదు. ఈ దశలో వడ్లలో సాధారణంగా 18-20శాతం తేమ ఉంటుంది. తేమ శాతాన్ని తగ్గించేందుకు రెండు మూడు రోజులు మెద ఎండపెట్టాలి. హార్వెస్టర్‌తో కోస్తే వెంటనే కల్లంలో ఆరబోయాలి. రాత్రిళ్లు మంచు తగలకుండా కుప్పచేసి కవర్‌ కప్పాలి. ఒక వేళ వర్షం వస్తే 5శాతం ఉప్పు కలిపిన నీటిని చేనుపై పిచికారి చేయాలి. హార్వెస్టర్లలో దుమ్ముధూళి, మట్టిపెల్లలు ఉండకుండా చూసుకోవాలి. కోత సమయాల్లో వేర్వేరు రకాల ధాన్యం కలవకుండా చూసుకోవాలి. కోతల తర్వాత వడ్లను తూర్పారబట్టి శుద్ధి చేయాలి. ధాన్యంలో తేమ 12 నుంచి 14 శాతం తగ్గే వరకు ఎండబోయాలి. ఇలా చేస్తే ధాన్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నిల్వ సమయంలో అధిక తేమ లేకుండా చూసుకోవాలి. ధాన్యాన్ని ఆశించే కీటకాల నుంచి రక్షణకు పరిసరాల్లో పొగబెట్టాలి. గోనె సంచులు, గుమ్మిళ్లలో ధాన్యాన్ని నిల్వ చేయాలి. నిల్వ చేసే చోట తడి లేకుండా, బస్తాలకు చిల్లులు లేకుండా చూసుకోవాలి.

పొలంలో గింజలతో పంటలో కల్తీ

మడుల్లో ధాన్యం గింజలు పడకుండా చూసుకోవాలి. లేకుంటే వచ్చే సంవత్సరం ఈ గింజలే మొలిచి ఇతర పంట ఉత్పత్తులు కల్తీ అవుతాయి. వరి పొలంలో కంకులు మొత్తం ఎండే వరకు ఆగాలి. దీంతో రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి. పొలం కోసిన తర్వాత కలుపు, ఇతర మొక్కలు ఏమైనా ఉంటే తీసివేయాలి. ఇలా చేస్తే పంటసాగులో కలుపు నివారణ సులువవుతుంది.

రైతులు అధికారుల సూచనలు పాటించాలి : అర్చన, మండల వ్యవసాయ అధికారి, మేడ్చల్‌

వరి కోతల సమయంలో రైతులు వ్యవసాయాధికారుల సూచనలు తప్పక పాటించాలి. ధాన్యం కోతలో అలాగే పొలంలో పలు జాగ్రత్తలు తీసు కుంటే తరువాత వేసే పంటలకు మేలు జరుగుతుంది. ధాన్యాన్ని ప్రభుత్వ కొనగోలు కేంద్రాలకు తరలించాలి. దళారులను ఆశ్రయించి తక్కువ ధర పొంది మోసపోవద్దు.

Updated Date - 2022-11-16T00:18:40+05:30 IST

Read more