మొట్టికాయలేస్తే కానీ మాట వినరా ?

ABN , First Publish Date - 2022-05-30T05:48:46+05:30 IST

మొట్టికాయలేస్తే కానీ మాట వినరా ?

మొట్టికాయలేస్తే కానీ మాట వినరా ?
తాండూరు పోలీసుస్టేషన్‌ సమీపంలోని సాయిపూర్‌ రోడ్డులో తవ్వి వదిలేసిన గుంత

  • మేజిస్ట్రేట్‌ నోటీసులతో 24గంటల్లో గుంత పూడ్చివేత
  • తాండూరు పట్టణంలో ఇతర గుంతల మాటేమిటి?
  • బల్దియా ఇంజనీరింగ్‌ అధికారుల.. నిండా నిర్లక్ష్యం!

తాండూరు, మే 29 : తాండూరు పట్టణంలో ప్రధాన రోడ్లలో తాగునీటి పైప్‌లైన్ల మరమ్మతుల పేరిట గుంతలు తవ్వి వదిలేశారు. నెలల తరబడి వాటికి మరమ్మతులు చేయకుండా వదిలేయడంతో వాహనదారులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. తవ్వి వదిలేయడమే కానీ, మరమ్మతులు చేసి వెంటనే పూడ్చివేయాలనే ఆలోచన లేకుండా.. బల్దియా ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు నిండా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. తాండూరు మున్సిఫ్‌ కోర్టు నుంచి బస్టాండ్‌ వెళ్లే ప్రధాన మార్గం టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ సమీపంలో పెద్ద గోతిని తవ్వి వదిలేశారు. తాండూరు బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు రాతపూర్వకంగా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేస్తే స్వయంగా మెజిస్ట్రేట్‌ స్వప్న శనివారం పరిశీలించి మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆగమేఘాల మీద కోర్టుకు వచ్చిన ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు రెండు రోజుల్లో గుంతను పూడ్చి వేస్తామని చెప్పి 24 గంటల్లోనే గుంతను పూడ్చివేయించి సిమెంటు బెడ్డు వేయించారు. మెజిస్ట్రేట్‌ నోటీసులు ఇస్తే కానీ స్పందించని అధికారులు.. మరికొన్ని చోట్ల వదిలేసిన గుంతలను ఎప్పుడు పూడుస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాండూరు పట్టణం ఇందిరాచౌక్‌ నుంచి సాయిపూర్‌ వెళ్లే ప్రధాన రోడ్డులో పోలీసుస్టేషన్‌ పక్కనే ఉన్న తవ్వి వదిలేసిన గోతిని నెలల తరబడి పూడ్చకుండా వదిలేశారు. అదేవిధంగా కాళికాదేవి మందిరం నుంచి మార్వాడీ బజార్‌ వెళ్లే ప్రధాన గల్లీలో పైప్‌లైన్‌ మరమ్మతుల పేరిట రెండు నెలలక్రితం తవ్విన గోతిని పూడ్చకుండా వదిలేశారు. నెలల తరబడి వాటిని వదిలేయడం వల్ల ప్రమాదాలకు నిలయంగా మారాయి. కనీసం తవ్విన గోతి వద్ద మరమ్మతులు జరుగుతున్నట్లు బోర్డులు పెట్టకపోవడం, చుట్టూ రక్షణ ఏర్పాటు చేయకపోవడంతో రాత్రివేళల్లో కరెంటు లేని సమయంలో పాదచారులు, వాహనదారుల గుంతలో పడి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా బల్దియా అధికారులు మరమ్మతుల పేరిట కాలయాపన చేయకుండా గుంతులను వెంటనే పూడ్చివేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

Read more