నిరీక్షణ!

ABN , First Publish Date - 2022-08-22T04:41:14+05:30 IST

ఉపాధికోసం నిరుద్యోగులకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలిస్తామన్న

నిరీక్షణ!

  • ‘బీసీ’రుణాల కోసం ఐదేళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపులు 
  • వంద శాతం రాయితీతో 1,238 మందికే రూ. 50 వేల చొప్పున పంపిణీ
  • మిగిలిన 26,751 మంది లబ్ధిదారులకు ఇంకెప్పుడిస్తారు? 
  • బీసీ రుణాలు ఇస్తారా? ఇవ్వరా..? అని ప్రశ్నిస్తున్న లబ్ధిదారులు 

ఉపాధికోసం నిరుద్యోగులకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కేసింది. రుణాలిస్తే తమకాళ్ల మీద తాము నిలబడదామనుకున్న యువత ఆశ ఆవిరి చేసింది. ఐదేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ, వారి ఆశలు ఇప్పట్లో ఫలించేలా కనిపించడం లేదు. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : బీసీ రుణాల కోసం ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదేళ్లుగా నిరీక్షించాల్సి వస్తుంది. యువతకు ఉపాధి కల్పించేందుకు సర్కారు బీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందించాలని సంకల్పించింది. అందులోభాగంగా కొంతమందికి రూ.50 వేల చొప్పున వందశాతం సబ్సిడీతో పంపిణీ చేసింది. మిగతా రూ.లక్షపైబడి ఉన్న యూనిట్లను ఇప్పటివరకు ఏ ఒక్కరికీ అందజేయలేదు. దీంతో నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2016లో దరఖాస్తు చేసుకున్నవారికి నేటికీ రుణాలు అందక పోవడంతో యువత తీవ్ర నిరాశతో ఉన్నారు. ఆశావహుల్లో నిరుద్యోగులు, వ్యాపారాభివృద్ధికి దరఖాస్తు చేసుకున్నవారు, కొత్తగా వ్యాపారాలు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నవారున్నారు. ఐదేళ్లుగా రుణాల ఎప్పుడెప్పుడిస్తారా అని ఎదురుచూస్తున్నారు. రుణాల మంజూరులో కేటగిరీలు ఉండగా.. అందులో మొదటి కేటగిరి (రూ.లక్ష) వారికి మాత్రమే వంద శాతం రాయితీతో రూ.50 వేలు చొప్పున 1,238 మందికి రాయితీ రుణాలు అందాయి. మిగతా 26,751 మంది రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. 

ప్రభుత్వం వెనకబడిన తరగతులకు సంబంధించిన సబ్సిడీ రుణాలను ఇవ్వటంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. ఐదేళ్లుగా యువతకు స్వయం ఉపాధి కల్పించడంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటంతో ఈ పథకం నిర్వీర్యమవుతోంది. 2015- 2019 వరకు ఒక్కరికీ కూడా రుణం ఇవ్వలేదు. బీసీ రుణాల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు ఊహించని తీరులో వెల్లువెత్తాయి. రెండుసార్లు దరఖాస్తులకు అవకాశమిచ్చారు. దీంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. బ్యాంకు అంగీకారం లేకున్నా.. దరఖాస్తులు చేసుకున్న అర్హులైనవారికి రుణాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యక్తిగత రుణాలతోపాటు ఫెడరేషన్‌ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 


ఏళ్లతరబడి ఎదురుచూపులు

13 రకాల స్కీమ్‌లను అమలు చేస్తూ ఈ పథకాన్ని మొదలు పెట్టారు. ఫెడరేషన్‌, సొసైటీలు, ఎంబీసీలు, బీసీ కార్పొరేషన్‌కు సంబంధించి వివిధ రకాల రుణాలను అందించాలని నిర్ణయం తీసుకున్నారు. 2015-16 సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న వారికి నేటికీ రుణాలు  అందకపోవడం గమనార్హం. జిల్లాలో 28,775 మంది దరఖాస్తులు చేసుకోగా 27,809 మందిని అర్హులుగా గుర్తించి ఇందులో 1,238 మందికి వంద శాతం రాయితీపై రూ. 50 వేల చొప్పున రూ.6.19 కోట్లు రుణాలిచ్చారు. ఇంకా 27,751 మంది స్వయం ఉపాధి రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. వరుసగా ఎన్నికలు రావటం, కోడ్‌ అమలులో ఉండటంతో ఈ పథకం అటకెక్కింది. 2017-18లో వరుసగా ఎన్నికలు రావడంతో ఈ పథకం అమలుకు బ్రేక్‌ పడింది. ఎన్నికల తర్వాత రుణాలు ఇస్తారని లబ్ధిదారులు ఎదురు చూసినా ప్రయోజనం లేకుండా పోతుంది. 


నిధులు మంజూరు చేయని ప్రభుత్వం

అట్టహాసంగా ఎన్నికల ముందు పెద్దఎత్తున ప్రచారం చేసినప్పటికీ ఈ స్కీమ్‌ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తుండటంతో బీసీ లబ్ధిదారులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల్లో ఓటు కోసమే ప్రకటించినట్లుగా ఉందని.. చిత్తశుద్ధితో ఈ పథకాన్ని అమలు చేయడం లేదని బీసీ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఐదేళ్లుగా ఈ స్కీమ్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాక.. ఇటు పెట్టుబడి లేక నిరుద్యోగ యువత నిరాశ, నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నికల మూలంగా ఆగిపోయిన రుణాల ప్రక్రియ ప్రస్తుతం కూడా అదేవిధంగా ఉండటంతో లబ్ధిదారులకు ఎటూ పాలుపోవడం లేదు. స్వయం ఉపాధి పథకం కోసం రుణాలివ్వాల్సిన ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. ప్రభుత్వం స్పందించి రుణాలివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. 


బీసీ రాయితీ రుణాలు అందడం లేదు

వెనుకబడిన తరగతుల వారికి ప్రభుత్వం ద్వారా రాయితీ రుణాలు అందడం లేదు. దాదాపు 8 సంవత్సరాల కింద సెల్‌ఫోన్‌ షాపుకోసం బీసీ రాయితీ రుణాలకోసం ధరఖాస్తు చేసుకున్న ఇప్పటి వరకు రుణం రాలేదు. ప్రైవేట్‌ వ్యక్తులతో వడ్డీకి రుణం తీసుకుని సెల్‌ఫోన్‌ షాపు పెటుకున్నాను. కానీ వడ్డీలకే ఆదాయం సరిపోతుంది. అధికారులు స్పందించి బీసీ రుణాలు ఇవ్వాలి.

- మనోహర్‌ గౌడ్‌, వేముల్‌నర్వ, కేశంపేట మండలం.


నిధులు మంజూరు కాగానే అందరికీ రుణాలు 

నిధులు మంజూరు కాగానే అర్హులైన వారందరికీ రుణాలను అందజేస్తాం. ఇప్పటివరకు జిల్లాలో 1,238 మంది లబ్ధిదారులకు రూ.6.19 కోట్ల రుణాలు అందించాము. లక్ష వరకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వంద శాతం రాయితీపై ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున అందజేయడం జరిగింది. లక్షకు పైగా ఉన్న లబ్ధిదారులకు ఇంకా రుణాలు ఇవ్వలేము.

- విద్య, జిల్లా బీసీ సంక్షేమాధికారి 


ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుంది

ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుంది. ఐదేళ్ల నుంచి బీసీ  కార్పొరేషన్‌ రుణాలు లేవు. చదువుకున్న నిరుద్యోగ యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకునేందుకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న సీఎం కేసీఆర్‌ బీసీలకు అన్యాయమే చేస్తుంది. 

- రాపోల్‌ నర్సింహులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి 


రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ సర్కార్‌కు బుద్ది చెప్పేందుకు బీసీ యువత సిద్ధంగా ఉంది

బీసీలకు రుణాలు ఇవ్వడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైంది. 2016లో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులంతా ఆశ వదులుకున్నారు. నిధులు మంజూరు చేయడంలో సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. చదివిన చదువులకు ఇటు ఉద్యోగం రాక.. అటు స్వయం ఉపాధి రుణాలు అందక నిరుద్యోగుల పరిస్థితి ఆగమ్యం గోచరంగా తయారైంది. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు సరైన బుద్దిచెప్పేందుకు బీసీ యువత సిద్ధంగా ఉంది.

- చల్లా నర్సింహారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు 


Read more