వీఆర్‌ఏల భిక్షాటన

ABN , First Publish Date - 2022-10-12T04:14:27+05:30 IST

వీఆర్‌ఏల భిక్షాటన

వీఆర్‌ఏల భిక్షాటన
పెద్దేముల్‌ మండల కేంద్రంలో భిక్షాటన చేస్తున్న వీఆర్‌ఏలు

  • జిల్లాలో 80 మంది  వీఆర్‌ఏల ముందస్తు అరెస్టు

పెద్దేముల్‌/వికారాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తమవి భిక్షగాళ్ల బతుకులయ్యాయని వీఆర్‌ఏల జేఏసీ జిల్లా కోకన్వీనర్‌ జనార్ధన్‌ పేర్కొన్నారు. పెద్దేముల్‌ మండల కేంద్రంలో వీఆర్‌ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారంతో 79రోజులకు చేరింది. ఈసందర్భంగా వారు మండల కేంద్రంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. తాము 79 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.  కాగా తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన చలో ఇందిరాపార్క్‌ కార్యక్రమానికి జిల్లా నుంచి వీఆర్‌ఏలు హాజరు కాకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో 80 మంది వీఆర్‌ఏలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలించి సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుతో వదిలేశారు. కాగా, పోలీసుల మందస్తు అరెస్టులను ముందుగానే ఊహించిన వీఆర్‌ఏలు వంద మందికి పైగానే పోలీసుల కళ్లుగప్పి హైదరాబాద్‌కు వెళ్లారు. ఇదిలా ఉంటే, వీఆర్‌ఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ వీఆర్‌ఏలు ఈ రోజు కూడా వివిధ మండల కేంద్రాల్లో తమ నిరసన దీక్షలు కొనసాగించారు. పెద్దేముల్‌, మోమిన్‌పేట్‌, కులకచర్ల తదితర మండలాల్లో వీఆర్‌ఏలు బిక్షాటన నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. 

 మేడ్చల్‌ జిల్లాలో...

మేడ్చల్‌ అక్టోబర్‌ 11(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏలు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 79వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా నగరంలోని  ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాకు జిల్లాలోని వీఆర్‌ఏలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. జిల్లాలో పలు చోట్ల వీఆర్‌ఏలను పోలీసులు వెళ్లకుండా అడ్డుకుని అరెస్టులు చేశారు. 

Updated Date - 2022-10-12T04:14:27+05:30 IST