తెలంగాణ సంస్కృతికి ప్రతీక ‘బతుకమ్మ’ పండగ

ABN , First Publish Date - 2022-09-27T05:52:57+05:30 IST

తెలంగాణ సంస్కృతికి ప్రతీక ‘బతుకమ్మ’ పండగ

తెలంగాణ సంస్కృతికి ప్రతీక ‘బతుకమ్మ’ పండగ
రుద్రారంలో బసవ భవన్‌కు శంకుస్థాపన చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే

కొడంగల్‌/నవాబుపేట/తాండూరు, సెప్టెంబరు 26: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని జడ్పీ చైర్‌పర్సన్‌ సునితామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం కొడంగల్‌ మండలం చిట్లపల్లి, అంగడిరైచూర్‌, రుద్రారం గ్రామాల్లో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. రుద్రారంలో జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. మహిళలు, చిన్నారులు బతుకమ్మ ఆటపాటలతో ఆకట్టుకున్నారు. జడ్పీచైర్‌పర్సన్‌ సనీత, సర్పంచ్‌ వెంకటలక్ష్మి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. సునీతారెడ్డి బతు కమ్మను ఎత్తుకున్నారు. అనంతరం రూ.22లక్షలతో నిర్మించిన రైతు వేదిక, రూ.20లక్షలతో నిర్మించిన బసవభవన్‌, సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో వారు పాల్గొన్నారు. చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. కొడంగల్‌ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందన్నారు. రైతులకు సీఎం కేసీఆర్‌ రైతుబంధు, బీమా, సబ్సిడీ విత్తనాలు అందిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి కృషితో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి జరుగుతుందన్నారు. అంగడిరైచూర్‌లో బతుకమ్మ చీరలను పంపిణీ చేయగా, చిట్లపల్లిలో సీసీ రోడ్డు, స్మశాన వాటిక ప్రారంభోత్సవం, ఆసరా పింఛన్‌ కార్డులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. పింఛన్‌లు మంజూర్‌ కాని అర్హులైన వారిందరికీ త్వరలోనే పింఛన్‌లు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.  జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయ్‌కుమార్‌, సర్పంచ్‌లు గోవిందు, వెంకట్‌రెడ్డి, అంజాద్‌, నాయకులు దామోదర్‌రెడ్డి, జి.రాంరెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వెంకటయ్యగౌడ్‌, లక్ష్మీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. పూలను పూజించే ప్రకృతి పండగ బతుకమ్మ అని నవాబుపేట ఎంపీపీ కాలె భవానీ అన్నారు. ఆమె మాట్లాడుతూ దసరా పండగ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలను మండల ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. తాండూరు పట్టణం శ్రీసాయిమేథ విద్యాలయంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మ పాటలతో ఆటలాడారు. కార్యక్రమంలో కరస్పాండెంట్‌ పెరుమాళ్ల వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read more