అట్టహాసంగా పూల పండుగ

ABN , First Publish Date - 2022-10-02T05:48:10+05:30 IST

అట్టహాసంగా పూల పండుగ

అట్టహాసంగా పూల పండుగ
మేడ్చల్‌లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

  •  మేడ్చల్‌ మండలం, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీల పరిధిలో   ఏడో రోజు సద్దుల సంబురాలు 
  •  మిగతా చోట్ల వేపకాయ బతుకమ్మ వేడుకలు

మేడ్చల్‌/ఘట్‌కేసర్‌, అక్టోబరు1: పూల పండుగను పురస్కరించుకుని  మేడ్చల్‌- మల్కాజ్‌గిరి వికారాబాద్‌ జిల్లాల్లో బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా  కొనసాగుతున్నాయి. ఏడోరోజు శనివారం  వేపకాయల బతుకమ్మ పండుగను  నిర్వహించగా, మేడ్చల్‌ మండలం, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిఽధిలో ఏడో రోజు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సద్దుల బతుకమ్మను 9 రోజులకు నిర్వహించనుండగా మేడ్చల్‌ పట్టణంలో మాత్రం 7 రోజులకే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.  బతుకమ్మ ఉత్సవాలకు పుట్టింటికి వచ్చిన ఆడపడుచులు 7వ రోజు సద్దుల బతుకమ్మ నిర్వహించి తిరిగి 9వ రోజు నిర్వహించే సద్దుల బతుకమ్మకు వారి మెట్టినింటికి చేరుకుంటారు. ఈ సందర్భంగా మేడ్చల్‌ పెద్దచెరువు కట్టతో పాటు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద, తుమ్మచెరువు వద్ద పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ వేడుకలు  నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రంగు రంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించి బతుకమ్మ ఆడిపాడారు. అనంతరం సమీపంలోని చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మేడ్చల్‌ పెద్ద చెరువు కట్టపై నిర్వహించిన సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.  ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఘట్‌కేసర్‌, చందుపట్లగూడ, బొక్కోనిగూడల్లో సద్దుల బతుకమ్మను జరుపుకున్నారు. ఈసందర్బంగా ఘట్‌కేసర్‌లోని నాగులమ్మగుడి, మున్సిపల్‌ కార్యాలయంవద్ద అంబేద్కర్‌ నగర్‌లో, బాలాజీనగర్‌లో గురుకుల్‌ కళాశాల మైదానంలో మహిళలు బతుకమ్మ ఆడిపాడారు. అనంతరం చెరువుల్లోల బతుకమ్మలను నిమజ్జనం చేశారు. 

వేడుకగా వేపకాయ బతుకమ్మ

మేడ్చల్‌అర్బన్‌ : బతుకమ్మ సంబురాల్లో భాగంగా ఏడోరోజు మేడ్యల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌ వద్ద వేపకాయల బతుకమ్మ వేడుక వైభవంగా జరుపుకున్నారు. జిల్లా పంచాయతీ, కో-ఆపరేటీవ్‌, యువజన, క్రీడలు, భూగర్భజలవనరుల శాఖలఆధ్వర్యంలో వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒకచోట చేర్చి బతుకమ్మ ఆడారు. జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, యువజన, క్రీడల అధికారి బలరామారావు, కలెక్టరేట్‌ ఏవో వెంకటేశ్వర్లు, ఆయా శాఖల ఉద్యోగులు, మహిళలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-02T05:48:10+05:30 IST