పెద్దగోల్కొండ ఔటర్‌ ఎగ్జిట్‌-15 నుంచి రాకపోకలు షురూ

ABN , First Publish Date - 2022-11-30T23:40:07+05:30 IST

మండల పరిధిలోని పెద్దగోల్కొండ ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎగ్జిట్‌ 15 నుంచి వాహనాల రాకపోకలు బుధవారం ప్రారంభమయ్యాయి.

పెద్దగోల్కొండ ఔటర్‌ ఎగ్జిట్‌-15 నుంచి రాకపోకలు షురూ
పెద్దగోల్కొండ ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎగ్జిట్‌ 15ను వెళ్తున్న వాహనాలు

నెలన్నర రోజుల తరువాత తెరుచుకున్న టోల్‌గేట్‌

శంషాబాద్‌రూరల్‌, నవంబర్‌ 30 : మండల పరిధిలోని పెద్దగోల్కొండ ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎగ్జిట్‌ 15 నుంచి వాహనాల రాకపోకలు బుధవారం ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు పెద్దగోల్కొండ ఔటర్‌ రింగ్‌రోడ్డు జంక్షన్‌ నీట మునిగి రాకపోకలు బంద్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో నెలన్నర రోజులుగా 60 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై సమీప గ్రామాల ప్రజలు, పెద్దగోల్కొండ వాసులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల మంత్రి సబితారెడ్డి ఎగ్జిట్‌ 15 వద్ద నిలిచిన నీటిని పరిశీలించారు. వెంటనే నీటిని తొలగించి రాకపోకలు పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ చొరవతో మూడు రోజుల క్రితం చిన్నగోల్కొండ నర్సింహచెరువు తూమును తెరవడంతో నీరు కిందకు వెళ్లిపోయింది. ఔటర్‌ జంక్షన్‌ వద్ద నిలిచిన నీరు పూర్తిగా తొలగిపోయింది. బురద అలాగే ఉండడంతో హెచ్‌ఎండీఏ అధికారులు, స్థానిక పంచాయతీలతో కలిసి తొలగించారు. దీంతో ఎట్టకేలకు నెలన్నర తరువాత పెద్దగోల్కొండ టోల్‌గేట్‌ వద్ద రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అక్కడి గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌ 15 మూతపడినప్పటి నుంచి దాదాపు 3 కిలో మీటర్ల మేర దూరం పెరిగి అవస్థ పడ్డామని వాహనాదారులు వాపోయారు. ఇప్పుడు టోల్‌గేట్‌ ఓపెన్‌ కావడంతో దూరం భారం తప్పిందని సంతోషం వ్యక్తం చేశారు. అధికారులకు, హెచ్‌ఎండీఏ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-11-30T23:40:08+05:30 IST