ఎదురు చూపులు

ABN , First Publish Date - 2022-09-12T05:12:44+05:30 IST

ఎదురు చూపులు

ఎదురు చూపులు
కరన్‌కోట్‌లో పేదల ఇళ్ల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలం

  •  కరన్‌కోట్‌లో 450 మంది పేదలకు  ఇంటి స్థలాల పట్టాలు మంజూరు
  •  11ఏళ్లుగా పొజిషన్‌ చూపని ప్రభుత్వం
  •  డబుల్‌ బెడ్‌రూం ఇళ్లయినా కట్టించాలని వేడుకోలు

తాండూరు రూరల్‌, సెప్టెంబరు 11: కరన్‌కోట్‌లో పేదల ఇళ్ల సమస్య ఏళ్లుగా పరిష్కారం కాలేదు. ఏళ్ల తరబడి  ఇంటి స్థలం కోసం నిరీక్షణే మిగిలింది. ధర్నాలు, నిరసనలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితంగా ఏళ్ల తరబడి స్థలాల కోసం నిరుపేద కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇళ్ల స్థలానికి కాలయాపనే తప్ప పొజిషన్‌ చూడంప లేదని వాపోతున్నారు. 450 మంది లబ్ధిదారులకు కొన్ని సంవత్సరాల క్రితం పట్టాలు పంపిణీ చేశారు. అయితే వారికి స్థలాలు కేటాయించి పొజిషన్‌ చూపించకపోవడంతో లబ్ధిదారులు ఇళ్లులేక ఇబ్బందులకు గురవుతున్నారు. తాండూరు మండలం కరన్‌కోట్‌ గ్రామంలోని సర్వేనె ంబర్‌-2లో(ప్రభుత్వ భూమి) ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. పట్టాలు పంపిణీ చేసి 11ఏళ్లు గడిచినా స్థలాలు మాత్రం చూపించలేదు. ఇదే గ్రామంలో సర్వేనెంబర్‌-163లో రైతుల నుంచి రూ.90వేలకు ఎకరా చొప్పున రూ.54లక్షల ఖర్చు పెట్టి 6ఎకరాల భూమి కొని వదిలేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు అప్పగించకపోవడంతో ప్రభుత్వ ధనం వృథా కాగా, పేదలు ఇంటి స్థలం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిరుపేదలకు ఇల్లు కట్టుకునేందకు జాగా కరువైంది. పట్టాలు పొందిన వారు అద్దె ఇళ్లలో ఉంటున్నారు. కరన్‌కోట్‌లో పేదలంతా నాపరాతిగనుల్లో పనిచేసే కూలీలు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వం కేటాయించిన చోట తమకు ఇళ్ల స్థలాల పొజిషన్‌ చూపాలని పట్టాలు పొందిన పేదలు కోరుతున్నారు.

30 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే:- రేఖసదానందం, కరన్‌కోట్‌

ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడంతో మేము గత 30ఏళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాము. సీసీఐ కర్మాగారంలో కూలీ పనులు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాం. 11ఏళ్ల క్రితం కొంతమందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇప్పటి వరకు స్థలాన్ని చూపలేదు. స్థలం ఇవ్వకుంటే మాకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లయినా కేటాయించాలి. 

అప్పుడే స్థలం కేటాయించామన్నారు: - వడ్డె కనకప్ప, కరన్‌కోట్‌

పదేళ్ల క్రితం మీకు స్థలం కేటాయించామని అధికారులు, ప్రజా ప్రతినిధులు చెప్పారు. కానీ ఇప్పటి వరకూ స్థలం చూపించలేదు, పట్టాలు ఇవ్వలేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులు మారుతున్నారు కానీ మాకు ఇళ్ల స్థలాలు చూపించడం లేదు. అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేస్తే వచ్చిన డబ్బులు ఇంటి అద్దెకే పెడుతున్నాం. ఇళ్ల స్థలాలు చూపిస్తే నిర్మాణాలు చేసుకుంటాం. అద్దె క ట్టే ఇబ్బందులు తప్పుతాయి.


Read more