-
-
Home » Telangana » Rangareddy » All set for Independence Day celebrations-NGTS-Telangana
-
స్వాతంత్య్ర దిన వేడుకలకు సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2022-08-15T05:37:31+05:30 IST
స్వాతంత్య్ర దిన వేడుకలకు సర్వం సిద్ధం

- పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబు
- జాతీయ జెండాను ఆవిష్కరించనున్న సబిత
రంగారెడ్డి అర్బన్, ఆగస్టు 14 : స్వాతంత్య్ర దిన వేడుకలకు గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. జిల్లా కలెక్టరేట్ పరిధిలో గ్రౌండ్ లేక పోవడంతో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు హాజరయ్యే అధికారులకు, మీడియాకు, వీక్షకులకు ప్రత్యేకంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా లక్డీకాపూల్‌లోని జిల్లా కలెక్టరేట్‌ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జిల్లాలో ముఖ్య కార్యాలయాలు, భవనాలు విద్యుద్ధీపాల కాంతులతో వెలిగిపోతున్నాయి. సోమవారం నిర్వహించే స్వాతంత్ర దినోత్సవానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై ఉదయం 10.30గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఉదయం 10.35 గంటలకు పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. అనంతరం 10.45 గంటలకు ప్రసంగిస్తారు. అనంతరం విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన ఉంటుంది. ఉదయం 11.30గంటలకు స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించనున్నారు. అనంతరం ఉత్తమ సేవా సర్టిఫికెట్లను మంత్రి పంపిణీ చేయనున్నారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 12-45 గంటలకు వందన సమర్పణతో ఉత్సవాలు ముగుస్తామని జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అధికారులు, ప్రజలు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే వారంతా తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు.