అంగన్‌వాడీల్లో అన్నీ సమస్యలే!

ABN , First Publish Date - 2022-09-29T05:19:44+05:30 IST

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక చిన్నారులు

అంగన్‌వాడీల్లో అన్నీ సమస్యలే!
చేవెళ్ల హౌజింగ్‌ బోర్డు కాలనీలోని అరుబయటే అక్షర్యాభ్యాసం(ఫైల్‌)

  • జిల్లాలో సొంత భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు
  • ఇరుకు గదుల్లో ఇక్కట్లు, అద్దె భవనాల్లో అవస్థలు
  • ఆరుబయటే ఇమ్యూనైజేషన్‌, పౌష్టికాహారం అందజేత
  • జిల్లాలో 87 పోస్టులు ఖాళీ..
  • మీటింగ్‌ హాల్స్‌లేక చెట్ల కిందనే ప్రాజెక్టు సమావేశాలు


జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక చిన్నారులు  విలవిల్లాడుతున్నారు. ఇరుకైన సెంటర్లలో అవస్థలు పడుతున్నారు. పక్కా భవనాలు లేక అనేక కేంద్రాలు అద్దె రూముల్లో కొనసాగుతున్నాయి.  కరెంటు, మరుగుదొడ్ల సౌకర్యం లేక టీచర్లు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. చోటులేక ఆరుబయటే ఇమ్యూనైజేషన్‌, పౌష్టికాహారం అందిస్తున్నారు. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిఅర్బన్‌, సెప్టెంబరు 28) : జిల్లాలో అంగన్‌వాడి కేంద్రాల్లో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి. పలు కేంద్రాలు అధ్వానంగా మారాయి. అద్దెగృహాలు, సౌకర్యవం తం లేని గదులు, ఇరుకుగదుల్లో అవస్థలు పడుతున్నారు. ఇబ్బందుల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నారులను పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. ప్రభుత్వం పాఠశాలలకు దీటుగా గ్రామీ, పట్టణ ప్రాంతాల్లో చిన్నారుల యోగక్షేమాలు చూస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు రోజురోజుకూ నిర్వీర్యమవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువశాతం అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనూ కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లో సరైన వసతులు లేక చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 


అద్దె భవనాల్లో 217 కేంద్రాలు

జిల్లాలో 1600 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 719 కేంద్రాలకు సొంత భవనాలున్నాయి. 217 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పరిధిలోని భవనాల్లో 664కేంద్రాలు కొనసాగుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు మంజూరు కావడం లేదు. తక్కువ అద్దె ఇస్తుండటంతో ఇరుకుగదుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రభుత్వం ఒక్కో కేంద్రానికి నెలకు రూ.750 చొప్పున అద్దె చెల్లిస్తోంది. కనీసం సింగిల్‌ బెడ్‌రూం ఉన్న ఇల్లుకు రూ.5వేల నుంచి రూ.7 వేలు వరకు అద్దె ఉంటుంది. ప్రభుత్వం ఇస్తున్న అద్దె ఏ మూలకు సరిపోవడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలని 60 కేంద్రాలకు స్థలాలు గుర్తించారు. కానీ.. ఇప్పటివరకు ఒక్క భవన నిర్మాణానికీ నిధులు మంజూరు కాలేదని తెలుస్తోంది. 


ఐదు నెలలుగా అందని అద్దె డబ్బులు

ఈ ఏడాది మార్చి వరకు అంగన్‌వాడీల అద్దె చెల్లించిన ప్రభుత్వం... ఐదు నెలలుగా అద్దె చెల్లించపోవడంతో ఇంటి యజమానులు అంగన్‌వాడీ టీచర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జిల్లాలో కొన్నిచోట్ల ఇంటి యజమానులు అద్దె కోసం అంగన్‌వాడీ కేంద్రాలకు తాళాలు వేసిన సంఘటనలూ ఉన్నాయి. ఇదిలాఉండగా వంట గ్యాస్‌ ధర పెరిగిపోయింది. సిలిండర్‌ ధర రూ.1,150కాగా.. రెండు నెలలకు ఒకసారి బిల్లులు చెల్లిస్తున్నారు. కొందరు టీచర్లకు బిల్లులు రావడం లేదంటున్నారు. అలాగే ఇంతకుముందు ప్రతీ సెంటర్‌కు నెలకు రెండుసార్లు గుడ్లు సరఫరా చేసేవారు. ఏప్రిల్‌ నెల నుంచి మూడు విడతల్లో గుడ్లు సరఫరా చేయడంతో ఇబ్బందులు నెలకొంటున్నాయని అంగన్‌వాడీలు పేర్కొంటున్నారు. 


చెట్ల కింద సమావేశాలు

జిల్లాలోని ఏడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ప్రతినెలా మీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీటింగ్‌కు అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు విచ్చేస్తున్నారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రాజెక్టు మీటింగ్‌కు హాజరవుతున్నారు. సమావేశాలు నిర్వహించుకునేందుకు మీటింగ్‌ హాల్స్‌ లేవు. చెట్లకింద సమావేశాలను నిర్వహించుకుంటున్నారు. వర్షం పడితే చాలు.. మండల పరిషత్‌ భవానాల్లోకి పరుగులు పెడుతున్నారు. జిల్లాలోని ఏడు ప్రాజెక్టుల కింద మీటింగ్‌ హాల్స్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. 


మరుగుదొడ్లు కరువు

అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారులు, గర్బిణులు, బాలింతలకు కనీసం బాత్‌రూం సౌకర్యం కూడా లేదు. కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక బాలింతలు, గర్భిణులు మళ్లీ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. గఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. చిన్నారులు బాత్‌రూంకు వెళితే కేంద్ర బయటకు తీసుకు వచ్చి శుభ్రం చేస్తున్నారు. ఈ విషయం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో మహిళా సభ్యులు ప్రస్తావించినా ప్రయోజనం లేకుండా పోయింది. 


జిల్లాలో 87 పోస్టులు ఖాళీ

జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 7 ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల కింద 1,600 అంగన్‌వాడీ సెంటర్లు, అందులో 1,380 మెయిన్‌ అంగన్‌వాడీ, 220 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో ఒక టీచర్‌, ఒక ఆయా పనిచేయాల్సి ఉండగా జిల్లాలో 15 అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు, 4 మినీ అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులతోపాటు 68 అంగన్‌వాడీ ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 1,600 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు 69,546, మూడు నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు 27,958, గర్భవతులు, బాలింతలు 20,584 మంది లబ్ధి పొదుతున్నారు. 


అంగన్‌వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సమస్యలు పేరుకుపోయాయి. కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కరెంట్‌, వాటర్‌, మరుగుదొడ్ల సౌకర్యం లేదు. చాలా వరకు కేంద్రాలు అద్ధెభనాల్లో కొనసాగుతున్నాయి. ప్రతీ నెలా అద్దె కూడా సరిగ్గా చెల్లించడం లేదు. అంగన్‌వాడీ టీచర్లకు 2014 నుంచి టీఏ, డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పనిభారం పెరిగింది. బీఎల్‌వో విధులు అప్పగించారు. చేయకుంటే మెమోలు జారీ చేస్తున్నారు. 

- జి.కవిత, సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ 

------------------------------------------------------------------

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు

ప్రాజెక్టు టీచర్లు ఆయాలు

ఆమనగల్లు 05 08

చేవెళ్ల 03 15

హయత్‌నగర్‌ 02 11

ఇబ్రహీంపట్నం 02 05

మహేశ్వరం 02 11

శేరిలింగంపల్లి 02 11

షాద్‌నగర్‌ 03 17

మొత్తం 19 68


------------------------------------------------------------------




Updated Date - 2022-09-29T05:19:44+05:30 IST