రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ABN , First Publish Date - 2022-12-30T23:49:45+05:30 IST

పట్టణ సమీపంలోని కల్వకుర్తి వెళ్లే రహదారిలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా అతడి తండ్రి తీవ్రగాయాలపాలయ్యాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

  • తండ్రికి తీవ్ర గాయాలు

ఆమనగల్లు, డిసెంబరు 30: పట్టణ సమీపంలోని కల్వకుర్తి వెళ్లే రహదారిలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా అతడి తండ్రి తీవ్రగాయాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం శంకర్‌కొండ తండాకు చెందిన ఇస్లావత్‌ మణిపాల్‌(28), తన తండ్రి దేవుజాతో కలిసి పల్సర్‌ బైక్‌పై ఆమనగల్లు నుంచి తండాకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో పట్టణ సమీపంలోని మేడిగడ్డ ధర్మకాంట శ్రీశైలం హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో మణిపాల్‌ అక్కడికక్కడే మృతిచెందగా అతడి తండ్రి దేవుజా తీవ్రగాయాలపాలయ్యాడు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ గమనించకుండా బైక్‌ ట్రాక్టర్‌ వెనుక భాగంలో ఇరుక్కొని పోవడంతో కొద్ది దూరం వెళ్లి ట్రాక్టర్‌ను డ్రైవర్‌ వదిలిపెట్టి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన తండ్రిని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆమనగల్లు పోలీసులు తెలిపారు.

శంషాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తి..

శంషాబాద్‌ రూరల్‌: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్‌ పరిధిలోని తొండుపల్లి నక్షత్ర హోటల్‌ వద్ద రోడ్డు దాడుతుండగా శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందాడు. ముఖం, కాళ్లు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉంది. మృతుడి జేబులో సరోజిని కంటి ఆసుపత్రి ఔట్‌ పెషెంట్‌ కార్డు ఉంది. అందులో దేవయ్య అనే పేరు ఉంది. ఇప్పటి వరకు మృతుడి సంబంధీకుల ఆచూకీ లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హెడ్‌కానిస్టేబుల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

చికిత్స పొందుతూ మరొకరు..

కందుకూరు: గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్‌ఐ కొండల్‌ తెలిపారు. రెండు రోజుల క్రితం మండలంలోని నేదునూరు గేటు వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9490617237, 833993285 లేదా 7901103284 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Updated Date - 2022-12-30T23:49:45+05:30 IST

Read more