అన్ని హంగులతో కొత్త కలెక్టరేట్‌ సిద్ధం

ABN , First Publish Date - 2022-08-18T05:00:15+05:30 IST

కొంగరకలాన్‌లో కొత్త కలెక్టరేట్‌ అన్నిహంగులతో

అన్ని హంగులతో కొత్త కలెక్టరేట్‌ సిద్ధం
కలెక్టరేట్‌ భవనాన్ని పరిశీలిస్తున్న మంత్రి, కలెక్టర్‌

  • ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు సన్నాహాలు
  • నూతన కలెక్టరేట్‌ను పరిశీలించిన మంత్రి సబితారెడ్డి
  • త్వరలోనే సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నట్లు వెల్లడి


రంగారెడ్డి అర్బన్‌ / ఆదిభట్ల, ఆగస్టు 17 : కొంగరకలాన్‌లో కొత్త కలెక్టరేట్‌ అన్నిహంగులతో సిద్ధమైంది. 42ఎకరాల విస్తీర్ణంలో రూ.58 కోట్లతో పనులు పూర్తిచేశారు. ఉమ్మడి జిల్లాలోని వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల కలెక్టరేట్లను ఇప్పటికే ప్రారంభించారు. త్వరలో రంగారెడ్డిజిల్లా నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈనెలాఖరు వరకు ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. కలెక్టరేట్‌ ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్‌ విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాట్లు వేగిరం చేస్తున్నారు. హెలీప్యాడ్‌ వంటి పనులు తుదిదశలో ఉన్నందున ఆ పనులను వేగవంతంగా చేపట్టి పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితోపాటు జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, ఆయా శాఖల అధికారులు కలెక్టరేట్‌లోని ఆయా విభాగాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. విద్యుత్‌ వినియోగానికి సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సువిశాలమైన ఆవరణంలో ఖాళీ ప్రదేశాల్లో మరిన్ని మొక్కలను నాటాలని సూచించారు. ప్రారంభోత్సవం నాటికి ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా నూతన కలెక్టరేట్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియ, ఉద్యానవనశాఖ అధికారి సునంద, జిల్లా అటవీశాఖ అధికారి జానకీరామ్‌, ఆదిభట్ల మున్సిపల్‌ కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రవణ్‌ ప్రకాష్‌, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. 


రంగారెడ్డి కలెక్టరేట్‌ రెడీ.. త్వరలో ప్రారంభిస్తాం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కొంగరకలాన్‌లో కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని, అతి త్వరలోనే సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌ సందర్శనలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాల నుంచి 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ఉమ్మడిగా ఉన్న రంగారెడ్డి జిల్లాను పరిపాలన సౌలభ్యం కోసం వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలతో పాటు రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌లను ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలో రంగారెడ్డి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి అన్నిశాఖలు ఒకే దగ్గర ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. హైదరాబాద్‌లో రంగారెడ్డి కార్యాలయం ఉండటంతోపాటు, వివిధ కార్యాలయాలు అనేక ప్రాంతాల్లో ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడేవారని, దీంతో కొత్తగా కలెక్టరేట్‌ కార్యాలయం నిర్మించినట్లు చెప్పారు. కొత్త కలెక్టరేట్‌ ప్రారంభంతో ప్రజలకు అధికారులు మరింత చేరువ కానున్నట్లు చెప్పారు. కలెక్టరేట్‌ కోసం సుమారు 44ఎకరాలు కేటాయించగా అందులో రెండు ఎకరాల విస్తీర్ణంలో కార్యాలయాన్ని నిర్మించినట్లు వివరించారు.



Updated Date - 2022-08-18T05:00:15+05:30 IST