వికారాబాద్‌ జిల్లాలో తొలిరోజు 326 మందికి వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2022-03-17T05:17:05+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో తొలిరోజు 326 మందికి వ్యాక్సిన్‌

వికారాబాద్‌ జిల్లాలో తొలిరోజు 326 మందికి వ్యాక్సిన్‌
రామయ్యగూడ పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్న డాక్టర్‌ జీవరాజ్‌

  • 12-14 వయస్సు వారికి ప్రారంభం

వికారాబాద్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో 12నుంచి14 మధ్య వయస్సు కలిగిన పిల్లలకు వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. బుధవారం ప్రారంభించిన ఈ వ్యాక్సినేషన్‌లో తొలిరోజు 326 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. జిల్లాలో 12-14 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలు 25,713 ఉన్నట్లు గుర్తించగా, వీరికి కోర్బివాక్స్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు 25 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా, తొలిరోజు వ్యాక్సినేషన్‌లో భాగంగా 11 కేంద్రాల్లో 326 మంది పిల్లలకు వ్యాక్సిన్‌ ఇచ్చారు. అంగడి రాయిచూర్‌ పీహెచ్‌సీలో 78 మంది పిల్లలకు వ్యాక్సిన్‌ ఇవ్వగా, బషీరాబాద్‌లో 50, ధారూరులో 10, దోమలో 18, జిన్‌గుర్తిలో 21, కులకచర్లలో 20, మోమిన్‌పేట్‌లో 13, నవాల్గలో 66, పెద్దేముల్‌లో 12, పూడూరులో 18, రామయ్యగూడ పీహెచ్‌సీలో 20మంది పిల్లలకు వ్యాక్సిన్‌ వేశారు. తొలిడోస్‌ తీసుకున్న 28 రోజుల తరువాత 2వ డోస్‌ తీసుకోవాల్సి ఉంటుంది. 

వ్యాక్సినేషన్‌ విజయవంతం చేయాలి : డాక్టర్‌ జీవరాజ్‌

కొవిడ్‌ బారిన పడకుండా ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ జీవరాజ్‌ కోరారు. జాతీయ వ్యాక్సినేషన్‌ రోజు పురస్కరించుకుని బుధవారం ఆయన రామయ్యగూడ పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ బారిన పిల్లలు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్‌ను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ వినోద్‌రెడ్డి, పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

మేడ్చల్‌ జిల్లాలో  1,824 మందికి..

మేడ్చల్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌ జిల్లాలో మొదటిరోజు 1,820 మంది పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ వేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మల్లికార్జున్‌రావు తెలిపారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని ఆయన చెప్పారు. పిల్లలకు వ్యాక్సిన్‌ వేయించేందుకు తల్లిదండ్రులు చొరవచూపాలని మల్లికార్జున్‌రావు విజ్ఞప్తి చేశారు.

Read more