100% పదో తరగతిలో ఉత్తీర్ణత లక్ష్యం

ABN , First Publish Date - 2022-11-28T00:17:49+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యా శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.

100%  పదో తరగతిలో ఉత్తీర్ణత లక్ష్యం

  • నేటి నుంచి టెన్త్‌ క్లాస్‌ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభం

  • కార్యాచరణ సిద్ధం చేసిన జిల్లా విద్యాశాఖ

  • వచ్చే నెలాఖరు కల్లా సిలబస్‌ పూర్తి

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యా శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఉత్తీర్ణత పెంచడానికి ఉపాధ్యాయులువిద్యార్థులను సన్నద్ధం చేసే దిశగా ప్రణాళిక రూపొందించారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు కొనసాగనున్నాయి.

వికారాబాద్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): విద్యార్థుల జీవితంలో పదో తరగతి వారి భవిష్యత్తుకు తొలిమెట్టుగా భావిస్తారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యా శాఖ ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రకటించింది. పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు డిసెంబరు 31వ తేదీ వరకు అన్ని సబ్జెక్టుల్లో సిలబస్‌ ప్రకారం పాఠ్యాంశాలు బోధించడం పూర్తి చేయాలని విద్యా శాఖ ఇది వరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పదో తరగతి విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ఉపాధ్యాయుల కొరత ఉన్న ఉన్నత పాఠశాలలకు ఇతర పాఠశాలల నుంచి సర్దుబాటు చేసి విద్యా బోధన సాగేలా విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఇంకా ప్రత్యేక తరగతులు ప్రారంభించలేదు. అదే ప్రత్యేక ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇది వరకే ప్రత్యేక తరగతులు ప్రారంభించడమే కాకుండా వారం వారం పరీక్షలు నిర్వహిస్తూ.. విద్యార్థుల చదువులకు పదును పెడుతున్నారు. డిసెంబరు నెలాఖరు వరకు అన్ని సబ్జెక్టుల్లో సిలబస్‌ పూర్తి చేసి జనవరి ఒకటో తేదీ నుంచి పునశ్చరణ తరగతులు ప్రారంభించాల్సి ఉంది. షెడ్యూల్‌ ప్రకారం స్లిప్‌ పరీక్షలు నిర్వహించడమే కాకుండా చదువుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారి చదువులపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది.

ఉదయం.. సాయంత్రం ప్రత్యేక తరగతులు

ప్రతిరోజూ ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రత్యేక తరగతులు కొనసాగనున్నాయి. ప్రత్యేక తరగతులు పకడ్బందీగా కొనసాగేలా సంబంధిత పాఠశాలల జీహెచ్‌ఎంలతో పాటు ఎంఈవోలు, సెక్టోరియల్‌ అధికారులు పర్యవేక్షించనున్నారు. జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన ఉన్నత పాఠశాలలు 320 ఉండగా, వాటి నుంచి 13,353 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. ఈ పాఠశాలల్లో 175 ప్రభుత్వ, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, 18 కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలు, 9 ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలు ఉండగా, ఈ పాఠశాలల నుంచి 8,491 మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. 2022లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో జిల్లా 90.42 ఉత్తీర్ణత సాధించినా రాష్ట్రంలో 24వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణతాశాతం మరింత పెంచడమే కాకుండా రాష్ట్రంలో మొదటి పది స్థానాల్లో నిలిచేలా జిల్లా విద్యా శాఖ అధికారులు కృషి చేస్తున్నారు.

సన్నద్ధ సమావేశాలు ఎప్పుడో..?

విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే సమావేశాల జాడ లేకుండా పోయింది. పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి, ఎక్కువ మార్కులు సాధించేందుకు ఏ విధంగా చదవాలి, పదో తరగతి తరువాత ఎలాంటి చదువులు ఉంటాయనేది వివరిస్తూ విద్యార్థులతో ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహించేవారు. విద్యార్థుల్లో ఉత్సాహం, స్పూర్తి నింపే విధంగా వ్యక్తిత్వ వికాస నిపుణులు, ప్రముఖ వక్తలు, ఉపాధ్యాయులతో ప్రసంగాలు ఇప్పించేవారు. కరోనా ప్రభావంతో ఇలాంటి సమావేశాలు జాడ లేకుండాపోయాయి. విద్యార్థులను పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం చేయడం ఎంత ముఖ్య మో.. వారికి పదో తరగతి తరువాత ఎలాంటి చదువులు ఉంటాయి, ఏ చదువులు చదివితే ఎలాంటి అవకాశాలు వస్తాయనేది విద్యార్థులకు తెలియకుండా పోతోంది. విద్యార్థులకు అవగాహన కల్పించే ందుకు ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే వారిని సన్నద్ధం చేయడంతో పాటు వారిలో స్పూర్తినింపినట్లవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నేటి నుంచి ప్రత్యేక తరగతులు : రేణుకాదేవి, జిల్లా విద్యా శాఖ అధికారి, వికారాబాద్‌

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. సోమవారం నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యేలా ఆదేశాలు జారీ చేశాం. గత ఏడాది ఫలితాల కంటే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నాం. ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలి.

Updated Date - 2022-11-28T00:17:56+05:30 IST