రణరంగంగా రామన్నగూడెం

ABN , First Publish Date - 2022-06-28T07:56:38+05:30 IST

సమస్యల పరిష్కారం కోసం గిరిజనులు చేపట్టిన ‘ప్రగతి భవన్‌ కు పాదయాత్ర’ను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర...

రణరంగంగా రామన్నగూడెం

పోడు, పరిహారం సమస్యలపై గిరిజనుల కన్నెర్ర

సర్పంచ్‌ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌కు పాదయాత్ర

భగ్నం చేసిన పోలీసులు.. గంట పాటు ఉద్రిక్తత

మహిళలనూ చితకబాది వ్యాన్లలో ఎక్కించిన వైనం

రహదారిపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే తాటి


అశ్వారావుపేట/ములకలపల్లి, జూన్‌ 27: సమస్యల పరిష్కారం కోసం గిరిజనులు చేపట్టిన ‘ప్రగతి భవన్‌ కు పాదయాత్ర’ను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పాదయాత్రను అడ్డుకునే సమయంలో పోలీసులు, గిరిజనుల మధ్య గంటసేపు తోపులాట జరిగింది. అరుపులు, కేకలతో రామన్నగూడెం శివారు ప్రాంతం దద్దరిల్లిపోయింది. తమను అడ్డుకుంటున్న పోలీసులను గిరిజనులు చాలా సేపు ప్రతిఘటించడంతో ఏ నిమిషంలో ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మం డలం రామన్నగూడెం శివారులో సోమవారం ఈ సం ఘటన చోటు చేసుకుంది. రామన్నగూడెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 30, 36, 39లో ఉన్న 500 ఎకరా ల భూమికి సంబంధించి అటవీశాఖ, గిరిజనుల మధ్య కొన్ని దశాబ్దాలుగా పోరు సాగుతోంది. దీంతో పాటు అంకమ్మ చెరువు ప్రత్యామ్నాయ కాలువల్లో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం, ఇతర సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్లతో అధికార పార్టీ సర్పంచ్‌ ఆధ్వర్యంలో ‘ప్రగతి భవన్‌కు పాదయాత్ర’ చేపట్టాలని గిరిజనులు నిర్ణయించారు. ఈ సమాచారం తెలుసుకు న్న ఎమ్మెల్యే, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధు లు పలు దఫాలుగా చర్చలు జరిపి, సమస్యలు పరిష్క రిస్తామని హామీ ఇచ్చినా.. పాదయాత్ర కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కారమైతే పాదయాత్రను మధ్యలోనే విరమిస్తామని తేల్చి చెప్పా రు. లేదంటే సీఎం కేసీఆర్‌ను కలిసి తమ సమస్యలను విన్నవిస్తామని చెప్పారు. అయితే, పాదయాత్రను భగ్నం చేసేందుకు పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత సర్పంచ్‌ మడకం స్వరూప సహా మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలోనే గ్రామస్తులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వా దం జరిగింది. సర్పంచ్‌ చంటి బిడ్డ తల్లి కావడంతో తెల్లవారు జామున ఆమెను వదిలేశారు. సోమవారం ఉదయమే బయలుదేరిన గిరిజనులు.. జై కేసీఆర్‌, జై టీఆర్‌ఎస్‌ నినాదాలు చేస్తూ పాదాయాత్రగా ముందు కు సాగతా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దశాబ్దాలుగా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటే పరిష్కరించకుండా పోలీసులతో కొట్టిస్తున్నారని గిరిజనులు బోరున విలపించారు. అదుపులోకి తీసుకున్న గిరిజనుల్లో కొందరిని ములకలపల్లి పోలీ్‌సస్టేషన్‌కు, మరికొందరిని కిన్నెరసాని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. కొందరు మహిళలు, చిన్న పిల్లలు అని చూడకుండా పోలీసులు అమానుషంగా దాడి చేయడంపై సర్పంచ్‌ స్వరూప, మడకం నాగేశ్వరరావు ఆగ్ర హం వ్యక్తం చేశారు. గిరిజనుల సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యే, ఎంపీపీలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.


గిరిజనులకు మద్దతుగా బైఠాయించిన తాటి 

విషయం తెలుసుకున్న  మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ములకలపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకొని గిరిజనులతో కలిసి స్టేషన్‌ ఎదుట రోడ్డుపైనే బైఠాయించారు. పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని, కలెక్టర్‌ వచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. రామన్నగూడెం సర్పంచ్‌ మడకం స్వరూప చంటి బిడ్డతో ధర్నాలో కూర్చొన్నారు. తన భర్త నాగేశ్వరరావును పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదంటూ విలపించడం, అక్కడున్న వారందరినీ కలిచివేసింది.  ఎట్టకేలకు భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి వచ్చి వచ్చే శనివారంలోగా సమస్యలు పరిష్కరిస్తామని, అదుపులోకి తీసుకున్నవారందరినీ వదిలేస్తామని ప్రకటించడంతో గిరిజనులు ఆందోళన విరమించారు.

Read more