29న గూడలూరులో రాహుల్‌ పాదయాత్ర

ABN , First Publish Date - 2022-09-19T18:06:08+05:30 IST

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్రంలో మళ్లీ ఒకరోజు పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 7న కన్నియాకుమారి జిల్లాలో భారత్‌ జోడోయాత్ర

29న గూడలూరులో రాహుల్‌ పాదయాత్ర

చెన్నై: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ  రాష్ట్రంలో మళ్లీ ఒకరోజు పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 7న కన్నియాకుమారి జిల్లాలో భారత్‌ జోడోయాత్ర ప్రారంభించిన రాహుల్‌గాంధీ నాలుగురోజుల పాటు రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఆ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ నెల 28న ఆ రాష్ట్రంలో పాదయాత్రను ముగించుకుని 29న నీలగిరి జిల్లా గూడలూరుకు విచ్చేయనున్నారు. ఆ రోజు ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా గూడలూరులో రాహుల్‌ పాదయాత్ర చేయనున్నారు. అదే రోజు సాయంత్రం ఏర్పాటయ్యే బహిరంగ సభలో ఆయన ప్రసంగించి రాత్రికి గూడలూరులోనే బసచేయనున్నారు. రాహుల్‌ రాక సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు, స్థానిక నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రస్తుతం గూడలూరు కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ పాదయాత్ర మార్గాన్ని ఖరారు చేశారు.


కోళిపాళయం నుంచి గూడలూరు వరకు సుమారు పది కిలోమీటర్ల వరకు ఉదయం, సాయంత్రం రాహుల్‌ పాదయాత్ర  చేయనున్నారు. ఇదే విధంగా రాహుల్‌ బసచేయడానికి అనువైన గెస్ట్‌హౌస్‌ కూడా బుక్‌ చేశారు. ఈ నెల 29 సాయంత్రం జరిగే బహిరంగ సభలో రాహుల్‌తోపాటు టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి తదితర పార్టీ నాయకులు పాల్గొననున్నారు. ఈ నెల 30న ఆయన గూడలూరు నుంచి బయలుదేరి కర్నాటక రాష్ట్రం మైసూరు దిశగా బయలుదేరనున్నారు. రాహుల్‌ రాక సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు తగు చర్యలు చేపడుతున్నారు.

Read more