23న తెలంగాణకు రాహుల్‌ పాదయాత్ర

ABN , First Publish Date - 2022-10-14T08:55:18+05:30 IST

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు.

23న తెలంగాణకు రాహుల్‌ పాదయాత్ర

 మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ వద్ద రాష్ట్రంలోకి ప్రవేశం


31న హైదరాబాద్‌కు... చార్మినార్‌ నుంచి పాదయాత్ర

నెక్లెస్‌ రోడ్‌లో భారీ బహిరంగ సభ: రేవంత్‌ రెడ్డి

రాష్ట్రంలో 375 కిలోమీటర్ల మేర భారత్‌ జోడో యాత్ర


హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఆ రోజు కర్ణాటక నుంచి కృష్ణా నదిపై బ్రిడ్జి మీదుగా మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌కు చేరుకుంటుందని చెప్పారు. 31న హైదరాబాద్‌కు వస్తుందన్నారు. చార్మినార్‌ నుంచి యాత్ర ప్రారంభమై గాంధీ భవన్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటుందన్నారు. అదే రోజు ఆమె వర్థంతి సందర్భంగా నెక్లెస్‌ రోడ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గురువారం టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌, రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో రాహుల్‌ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ను ఖరారు చేశారు. తెలంగాణలో సుమారు 375 కిలోమీటర్ల మేర రాహుల్‌ పాదయాత్ర కొనసాగుతుందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. నెక్లెస్‌ రోడ్‌ నుంచి బోయిన్‌పల్లి, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, సంగారెడ్డి ఎక్స్‌రోడ్‌, జోగిపేట (ఆందోల్‌), శంకరంపేట్‌ (నారాయణ్‌ ఖేడ్‌), మద్నూర్‌ (జెక్కల్‌) మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందన్నారు. పాదయాత్ర కార్యక్రమాల సమన్వయానికి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిలను నియమించినట్టు తెలిపారు.

Read more