వైద్య పరికరాలకు సత్వర చికిత్స!

ABN , First Publish Date - 2022-02-19T07:01:56+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరమ్మతులులేక మూలుగుతున్న

వైద్య పరికరాలకు సత్వర చికిత్స!

  •  గంటల్లోనే మరమ్మతు చేసేలా ప్రణాళిక
  •  నిర్వహణ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి
  •  కొత్త పాలసీ అమలుకు సర్కార్‌ నిర్ణయం
  •  నేడో, రేపో జీవో జారీ చేసే అవకాశం


హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంఽధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరమ్మతులులేక మూలుగుతున్న యంత్రాలకు శాశ్వత చికిత్స చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వైద్య పరికరాల మరమ్మతుకు జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు స్పష్టమైన విధానం తీసుకురావాలని నిర్ణయించింది. పరికరాలకు ఎలాంటి సమస్య వచ్చినా గంటల్లోనే మరమ్మతు చేసేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకోసం టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడంతోపాటు సమన్వయం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన జీవో నేడో, రేపో జారీ చేసే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్య రంగంలో వైద్య పరికరాలు, రోగనిర్ధారణ యంత్రాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి.


దీనిని గుర్తించిన ప్రభుత్వం అన్ని స్థాయిల ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. వాటి నిర్వహణకు ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం చాలా లోపభూయిష్టంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ఫైబర్‌ సింధూరీ ఏజెన్సీ అనే సంస్థతో టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఒప్పందం చేసుకున్నా.. మరమ్మతులు చేయడంలో ఆ సంస్థ విఫలమైంది. ఫలితంగా పరికరాలు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కరోనా సమయంలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీన్ని సంస్కరించాలని, వైద్యపరికరాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఇటీవలే ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైద్య పరికరాల నిర్వహణకు కొత్త పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. 


నాలుగు కేటగిరీలుగా యంతాల్రు 

నూతన విధానంలో భాగంగా ప్రభుత్వ దవాఖానల్లో ఉన్న వైద్య పరికరాలను నాలుగు కేటగిరీలుగా విభజించనున్నారు. రూ.5లక్షలకుపైగా విలువ ఉండి వారంటీ కలిగి ఉన్న పరికరాలు, సమగ్ర వార్షిక నిర్వహణ ఒప్పందం(సీఎఎంసీ) ఇంకా ప్రారంభం కాని వాటిని కేటగీరీ-ఏలో, రూ.5లక్షలకు పైగా విలువ ఉండి, కంపెనీ మెయింటెనెన్స్‌ అవసరం ఉన్నవి, వారంటీ పీరియడ్‌ తర్వాత సీఏఎంసీ చేసుకోవాల్సిన పరికరాలను కేటగిరీ-బీలో, రూ.5 లక్షలకుపైగా విలువ ఉండి ఏడేళ్లు దాటిన పరికరాలు, వారంటీ, సీఏఎంసీ పూర్తయినా ఇంకా పని చేస్తున్న వాటిని కేటగీరీ-సీలో, రూ.5 లక్షల కన్నా తక్కువ విలువ ఉన్న పరికరాలను కేటగీరీ-డీలో చేర్చనున్నారు.


వీటిలో ఏ, బీ, సీ కేటగీరీ పరికరాల నిర్వహణ బాధ్యతను టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ, డీ-కేటగిరీలోని పరికరాల నిర్వహణను ఆయా ఆస్పత్రులు చూసుకుంటాయి. పరికరాల నిర్వహణను పర్యవేక్షించేందుకు టీఎ్‌సఎంఎ్‌సఐడీసీలో ప్రోగ్రామ్‌ మేనేజ్‌ంట్‌ యూనిట్‌ (పీఎంయూ) పేరుతో ప్రత్యేక వ్యవస్థ నెలకొల్పుతారు. ఇందులో ఒక ప్రాజెక్టు మేనేజర్‌, ఒక బయోమెడికల్‌ ఇంజినీర్‌, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉంటారు. 


నిర్వహణ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ 

పరికరాల నిర్వహణ సజావుగా సాగేందుకు టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఎండీ ఆధ్వర్యంలో మెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌ మెయింటెనెన్స్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఎంఈఎంఐఎస్‌) పేరుతో ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తారు.   దవాఖానల సూపరింటెండెంట్లు ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మరమ్మతుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపుతారు. పీఎంయూ యూనిట్‌  నిర్ణీత గడువులోగా సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుంది.  కేటగీరీ-సీలోని పరికరాల  మరమ్మతుల ధరలను ఖరారు చేసేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నారు. 


టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఎండీ మెంబర్‌ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో కాళోజీ వర్సిటీ వీసీ, డీఎంఈ, టీవీవీపీ కమిషనర్‌, వైద్యారోగ్య శాఖ సాంకేతిక సలహాదారు సభ్యులుగా ఉంటారు. డీ కేటగిరీ పరికరాల నిర్వహణను సైతం ఈ కమిటీ  పర్యవేక్షిస్తుంది. ఈ పరికరాల నిర్వహణకు ప్రభుత్వం టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ లేదా డీఎంఈకి నిధులు కేటాయిస్తుంది. అక్కడి నుంచి  దవాఖానలకు  నిధు లు విడుదలవుతాయి. ఏడాదికి ప్రతి పడకకు పీహెచ్‌సీలకు రూ.వెయ్యి, సీహెచ్‌సీలకు రూ.1500, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రూ.2వేలు, బోధనా, స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ.2,500 చొప్పున విడుదల చేస్తారు.


Updated Date - 2022-02-19T07:01:56+05:30 IST