ఓఎంసీ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డికి శిక్ష

ABN , First Publish Date - 2022-05-21T09:01:20+05:30 IST

ఓఎంసీ డైరెక్టర్‌ బీవీ శ్రీనివాసరెడ్డికి రాయదుర్గం జూనియర్‌ సివిల్‌ కోర్టు జైలు శిక్ష విధించింది.

ఓఎంసీ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డికి శిక్ష

49 నెలలు జైలు, 8,500 జరిమానా

రాయదుర్గం, మే 20: ఓఎంసీ డైరెక్టర్‌ బీవీ శ్రీనివాసరెడ్డికి రాయదుర్గం జూనియర్‌ సివిల్‌ కోర్టు జైలు శిక్ష విధించింది. అనంతపురం జిల్లా ఫారెస్టు అధికారి కల్లోల్‌ బిశ్వాస్‌ విధులను అడ్డుకుని, దాడికి యత్నించిన కేసులో నేరం రుజువు అయింది. దీంతో ఆయనకు జైలు శిక్షతో పాటు జరిమానాను కోర్టు విధించింది. డీ హీరేహాళ్‌ పోలీస్‌ స్టేషన్‌లో అటవీ శాఖ జిల్లా అధికారి కల్లోల్‌ బిశ్వాస్‌ ఫిర్యాదు మేరకు 2009 నవంబరు 1న కేసు నమోదు అయింది. క్రైం నంబర్‌ 75/2009, ఐపీసీ సెక్షన్లు 186, 188, 341, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎ-1గా రఘునాథరెడ్డి, ఎ-2గా బీవీ శ్రీనివాసరెడ్డిని పేర్కొన్నారు. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీలో అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు రావడంతో కల్లోల్‌ బిశ్వాస్‌ తనిఖీకి వెళ్లారు. ఆ సమయంలో ఎ-2 నిందితుడు బీవీ శ్రీనివాసరెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారని అటవీశాఖ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ నేరం రుజువు కావడంతో కోర్టు నాలుగు సంవత్సరాల ఒక నెల జైలు శిక్ష (49 నెలలు), రూ.8,500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

Updated Date - 2022-05-21T09:01:20+05:30 IST