చిన్నారి ఉసురు తీసిన దండన

ABN , First Publish Date - 2022-09-07T08:56:10+05:30 IST

పాఠశాలలో ఇచ్చిన హోం వర్క్‌ చేయకపోవడం అభంశుభం తెలియని ఆ చిన్నారి ఉసురు తీసింది.

చిన్నారి ఉసురు తీసిన దండన

  • హోం వర్క్‌ చేయలేదని రెండో తరగతి బాలికను కొట్టిన టీచర్‌..
  • ఆస్పత్రి పాలై మరణించిన విద్యార్థిని
  • నిజామాబాద్‌లో ఘటన.. 
  • ఫిర్యాదు చేయని బాధిత కుటుంబం
  • పాఠశాల సీజ్‌కు డీఈవో ఆదేశం  

నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 6 : పాఠశాలలో ఇచ్చిన హోం వర్క్‌ చేయకపోవడం అభంశుభం తెలియని ఆ చిన్నారి ఉసురు తీసింది. తానిచ్చిన హోం వర్క్‌ చేయలేదని ఆగ్రహం తెచ్చుకున్న ఓ ఉపాధ్యాయురాలు.. రెండో తరగతి చదువుతున్న బాలికపై తన ప్రతాపం చూపెట్టింది. ఆ టీచర్‌ విచక్షణారహితంగా కొట్టిన దెబ్బలకు ఆస్పత్రి పాలైన చిన్నారి.. చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది. నిజామాబాద్‌లో జరిగిన ఈ ఘటన మంగళవారం బయటకొచ్చింది. నిజామాబాద్‌, అర్సపల్లిలోని ఫుడ్‌ బ్రిడ్జి పాఠశాలలో మంతాష (7) అలియాస్‌ ఫాతిమా రెండో తరగతి చదువుతోంది. ఫాతిమా హోం వర్క్‌ చేయకపోవడంతో గత శుక్రవారం ఓ టీచర్‌ విపరీతంగా కొట్టింది. పాఠశాల నుంచి ఇంటికి తిరిగివచ్చాకా ఫాతిమా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్ప్రతికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు ఫాతిమాను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫాతిమా సోమవారం రాత్రి కన్నుమూసింది. ఫాతిమా అంత్యక్రియలను మంగళవారం నిజామాబాద్‌లో పూర్తి చేశారు. అయితే, ఫాతిమా మరణం గురించి తెలుసుకున్న ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు పాఠశాల వద్దకు చేరి ఆందోళనకు దిగారు. బాధ్యురాలైన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే, ఫాతిమా మరణంతో తమకు సంబంధం లేదని స్కూలు యజమాన్యం చెబుతోందని వారు ఆరోపించారు. ఫాతిమా మరణంపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అధికార పార్టీకి చెందిన కొందరు చేసిన ఒత్తిడే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా, చిన్నారి మృతి ఘటనపై విద్యాశాఖాధికారులు స్పందించారు. ఫుడ్‌ బ్రిడ్జి పాఠశాలను సీజ్‌ చేయాలని డీఈవో ఎన్వీ దుర్గాప్రసాద్‌ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.   

Updated Date - 2022-09-07T08:56:10+05:30 IST