‘పబ్‌.. డ్రగ్‌ హబ్‌’.. నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్‌

ABN , First Publish Date - 2022-04-05T08:06:54+05:30 IST

పబ్‌లో డ్రగ్స్‌ సంచలన కేసులో బంజారాహిల్స్‌ పోలీసులు రాడిసన్‌-బ్లూ హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

‘పబ్‌.. డ్రగ్‌ హబ్‌’.. నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్‌

  • పబ్‌ లైసెన్స్‌ను రద్దు చేసిన ఎక్సైజ్‌ శాఖ
  • ఇద్దరికి రిమాండ్‌.. పరారీలో మరో ఇద్దరు
  • మరో ఇద్దరి పాత్రపై పోలీసుల విచారణ
  • ఆరుగురు మైనర్లకూ మద్యం సరఫరా?
  • గతంలోనూ డ్రగ్స్‌ విక్రయాలు?
  • నిందితులను కస్టడీకి కోరుతూ పిటిషన్‌


హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): పబ్‌లో డ్రగ్స్‌ సంచలన కేసులో బంజారాహిల్స్‌ పోలీసులు రాడిసన్‌-బ్లూ హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పబ్‌ మేనేజర్‌ అనిల్‌కుమార్‌, భాగస్వాములు అభిషేక్‌ వుప్పల, అర్జున్‌ వీరమాచినేని, కిరణ్‌రాజ్‌ను నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో అనిల్‌, అభిషేక్‌ను ఆదివారమే అరెస్టు చేశారు. కోర్టు వీరికి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దాంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరో ఇద్దరు నిందితులు-- అర్జున్‌, కిరణ్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈవెంట్‌ మేనేజర్‌ కునాల్‌, డీజే శశిధర్‌రావుల పాత్రపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసుల దాడి సమయంలో ఆరు పార్టీలు జరుగుతున్నాయని, ఆయా పార్టీలను వీరే నిర్వహించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున మొత్తం 148 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారించి, వదిలిపెట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఆరు పార్టీలకు హాజరైన వారిని మరోమారు ప్రశ్నించి, ఎవరు ఆహ్వానించారు? ఓ పార్టీలో డ్రగ్స్‌ వినియోగం జరిగినట్లు ఆధారాలు సేకరించడంతో.. ఎవరెవరు మత్తుపదార్థాలను తీసుకున్నారు? అనే వివరాలను సేకరించనున్నారు. 


పబ్‌లో పార్టీలు జరిగిన టేబుళ్లపై లభించిన ప్యాకెట్లు, స్ట్రాలు, టూత్‌పిక్‌లను సీజ్‌ చేశామని, వాటిని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపినట్లు క్లూస్‌టీం అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చాక.. ఏ పార్టీలో డ్రగ్స్‌ వినియోగం జరిగిందో తేటతెల్లమవుతుందన్నారు. పోలీసుల దాడి సమయంలో.. మేనేజర్‌ అనిల్‌కుమార్‌ వద్ద టేబుల్‌పై ఐదు ప్యాకెట్లలో 4.64 గ్రాముల మేర కొకైన్‌ లభించింది. దీన్ని బట్టి.. గతంలో కూడా ఇక్కడ డ్రగ్స్‌ వినియోగం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హోటల్‌కు ఉన్న 24 గంటల అనుమతిని అడ్డుపెట్టుకుని, అతను కస్టమర్లను ఆకర్షించేవాడని భావిస్తున్నారు. నమ్మకస్తులతో వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. అనిల్‌కుమార్‌ ఫోన్‌ను విశ్లేషిస్తే డ్రగ్స్‌ డొంక కదులుతుందని చెబుతున్నారు. కాగా.. చంచల్‌గూడ జైలుకు తరలించిన అనిల్‌కుమార్‌, అభిషేక్‌ కస్టడీ కోసం పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పబ్‌కు డ్రగ్స్‌ తెచ్చిందెవరు? ఎవరెవరికి విక్రయించారు? అనే కోణాల్లో వారిని విచారించాల్సి ఉందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ మాదిరిగా నగరంలో ఇంకెన్ని పబ్‌లలో డ్రగ్స్‌ దందా నడుస్తోందనే కోణంపైనా పోలీసులు దృష్టిసారించారు.


మైనర్లకూ మద్యం సరఫరా?

ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో పోలీసులకు చిక్కిన వారిలో ఆరుగురు మైనర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. వీరు కూడా మద్యం సేవించినట్లు సమాచారం. మైనర్లకు మద్యం అందజేయడం చట్టరీత్యా నేరం. గతంలోనూ ఎక్సైజ్‌ శాఖ ఈ అంశంపై నగరంలోని పబ్‌లు, బార్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనుమానాలుంటే ఆధార్‌, ఇతర వయసు నిర్ధారణ చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో పబ్‌పై మరో కేసు నమోదయ్యే అవకాశాలున్నాయి.


ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ లైసెన్సు సస్పెండ్‌

రాడిసన్‌ బ్లూ హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ లైసెన్స్‌ను ఎక్సైజ్‌ శాఖ సస్పెండ్‌ చేసింది. పబ్‌లో డ్రగ్స్‌ను వినియోగించడంతో పాటు తెల్లవారుజాము వరకు బయటి వ్యక్తులకు మద్యం సరఫరా చేశారనే కారణాలతో లైసెన్స్‌ను సస్పెండ్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. లైసెన్సును పూర్తిగా ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసు ఆదివారమే జారీ చేసినట్లు వివరించారు. కాసిభట్ల అశోక్‌ పేరిట లైసెన్సు ఉందని, రెండు వారాల క్రితమే దాన్ని పునరుద్ధరించుకున్నారని(రెన్యూవల్‌) తెలిపారు.

Updated Date - 2022-04-05T08:06:54+05:30 IST