ఆస్పత్రుల దోపిడీకి ముకుతాడు!

ABN , First Publish Date - 2022-05-18T07:56:32+05:30 IST

కేంద్రం రూపొందించిన క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టా న్ని ‘స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం’ పేరిట రాష్ట్రంలో అమలు చేయడానికి వైద్యశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి.

ఆస్పత్రుల దోపిడీకి ముకుతాడు!

  • కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రుల ధరలకు కళ్లెం.. 
  • రాష్ట్రంలోనూ కౌన్సిల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం’
  • అమలుకు మార్గదర్శకాలు ఖరారు.. న్యాయ శాఖ వద్ద ఫైలు
  • ఒకటి రెండు రోజుల్లో సీఎం వద్దకు!
  • తర్వాత రాష్ట్ర స్థాయిలో కౌన్సిల్‌.. జిల్లాల్లో రిజిస్టరింగ్‌ అథారిటీ


కొవిడ్‌ సమయంలో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల దోపిడీ అంతా ఇంతా కాదు! నిర్ణీత ధరలను వసూలు చేయాలని సర్కారు నిర్దేశించినా వాటి అరాచకాలు ఆగలేదు. సాధారణ సమయాల్లోనూ కొన్ని ఆస్పత్రులు చెప్పిందే ధర! కానీ, క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం అమల్లోకి వస్తే.. ఇకపై అలా కుదరదు! ఆస్పత్రుల్లో విధిగా చార్జీల పట్టిక ప్రదర్శించాలి. ఏ శస్త్ర చికిత్సకు ఎంతవుతుందో అందులో స్పష్టం చేయాలి. అది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే అమలు చేయాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన క్లినికల్‌ ఎఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టాన్ని ‘స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం’ పేరిట రాష్ట్రంలో అమలు చేయడానికి వైద్య శాఖ రంగం సిద్ధం చేస్తోంది.హైదరాబాద్‌, మే 17 (ఆంఽధ్రజ్యోతి): కేంద్రం రూపొందించిన క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టా న్ని ‘స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం’ పేరిట రాష్ట్రంలో అమలు చేయడానికి వైద్యశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. సంబంధిత ఫైలు న్యాయ శాఖ పరిశీలనలో ఉంది. చట్టం అమలుకు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా అధ్యయనం చేస్తోంది. ఆ తర్వాత, ఒకటి రెండు రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆ వెంటనే సీఎం కేసీఆర్‌కు ఫైలు వెళ్లనుందని సచివాలయ ఉన్నతాధికారులు వెల్లడించారు. దానిపై సీఎం సంతకం చేయగానే జీవో విడుదల చేయనున్నారు. ఈ చట్టం అమలుకు రాష్ట్ర స్థాయిలో కౌన్సిల్‌ ఉంటుంది. దీనికి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. స్టేట్‌ మెడికల్‌ కౌ న్సిల్‌, ఫార్మసీ కౌన్సిల్‌, పారా మెడికల్‌ కౌన్సిల్‌, డెంటల్‌ కౌన్సిల్‌తోపాటు వైద్య విద్య సంచాలకులు, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు, ఆయుష్‌ కమిషనర్‌ దీనిలో సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో జిల్లా రిజిస్టరింగ్‌ అథారిటీ ఉంటుంది. అందులో ఐదుగురు సభ్యులుంటారు. జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మెంబ ర్‌ కన్వీనర్‌గా డీఎంహెచ్‌వో, అదనపు జిల్లా కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌ (లేదా ఎస్పీ), ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మెంబరు ఒకరు సభ్యులుగా ఉంటారు.


ఐదేళ్లుగా పెండింగ్‌

దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో సేవలు, సౌకర్యాలు, ప్రమాణాలు కనీస స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతో 2010 ఆగస్టులో కేంద్రం క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆరోగ్య సంరక్షణ సరిగా లేకపోవడంతో తొలుత అక్కడ అమలు చేసింది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని సూచించింది. అయితే, వైద్య ఆరోగ్యం రాష్ట్ర జాబితాలో ఉంటుంది కనక.. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టాన్ని అడాప్ట్‌ చేసుకుని నియమ నిబంధనలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. అడాప్ట్‌ చేసుకోని రాష్ట్రాలు కేంద్ర చట్టాన్నే అమలు చేయాలి. నిజానికి, 2017లోనే తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టాన్ని అడాప్ట్‌ చేసుకుంది. ఈ చట్టం ఒకసారి అమల్లోకి వస్తే కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. అందు కే, దీనిని కార్పొరేట్‌ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఫలితంగా, చట్టం అమల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది కూడా. ఈ చట్టం అమల్లోకి వచ్చి ఉంటే, కొవి డ్‌ సమయంలో ప్రజల జేబులు గుల్ల అయ్యేవి కాదు.  కార్పొరేట్‌ దోపిడీపై నిలదీసినప్పుడు క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టాన్ని రాష్ట్రంలోనూ అమలు చేస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హరీశ్‌ రావు వైద్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి.


చట్టం అమలు చేస్తే ఏమవుతుంది!?

క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రులు దాని పరిధిలోకి వస్తాయి. కార్పొరేట్‌ ఆస్పత్రుల దగ్గర్నించి గల్లీల్లో ఉండే నర్సింగ్‌ హోమ్‌ వరకూ అంతా ఈ చట్టం కింద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అలాగే, జాతీయ గుర్తింపు పొందిన సంస్థలైన ఎన్‌ఏబీహెచ్‌ నుంచీ గుర్తింపు పొందాలి. ప్రధానంగా తాము అందించే సేవ లు, వాటికయ్యే చార్జీల వివరాలను ఆస్పత్రులు విధిగా ప్రదర్శించాలి. ఏ ఆపరేషన్‌కు ఎంతవుతుందో అందులో తెలపాలి. ఏ ఆపరేషన్‌కు ఎంత తీసుకోవాలో కూడా కేంద్రమే చెబుతుంది. అది నిర్ణయించిన ధరలను ఆస్పత్రులన్నీ తప్పనిసరిగా అమలు చేయాలి. చికిత్స, శస్త్ర చికిత్సల సమయంలో బాఽధ్యతారహితంగా వ్యవహరిస్తే వైద్యులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది కూడా. 

Read more