ప్రతిష్ఠాత్మక యుద్ధం.. అజెండాలు సిద్ధం

ABN , First Publish Date - 2022-10-04T09:08:40+05:30 IST

ఉప ఎన్నికకు నగారా మోగిన నేపథ్యంలో..

ప్రతిష్ఠాత్మక యుద్ధం.. అజెండాలు సిద్ధం

  • అభివృద్ధి, సంక్షేమం.. కొనసాగింపూ మాతోనే: టీఆర్‌ఎస్‌
  • రాష్ట్రంలో మార్పునకు మునుగోడు దారి చూపాలి: బీజేపీ
  • ప్రజాస్వామ్యం గెలవాలి.. ఆడబిడ్డను ఆశీర్వదించాలి: కాంగ్రెస్‌
  • మునుగోడులో మూడు పార్టీల ప్రధాన నినాదాలివే

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఉప ఎన్నికకు నగారా మోగిన నేపథ్యంలో.. మునుగోడులో ప్రచార హోరు పదునెక్కనుంది. పోలింగ్‌ తేదీకి నెలరోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అక్కడే మోహరించనున్నాయి. ప్రతి పార్టీకీ ఈ ఎన్నికలో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారడంతో.. అర్థ, అంగబలాలతోపాటు శక్తియుక్తులన్నింటినీ ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గంలో బహిరంగసభలను ఏర్పాటుచేయాలని టీఆర్‌ఎస్‌, బీజేపీ ఇప్పటికే నిర్ణయించాయి. టీఆర్‌ఎస్‌ బహిరంగసభలో కేసీఆర్‌.. బీజేపీ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొనే అవకాశాలున్నాయని సమాచారం. సమయం తక్కువగా ఉండడంతో ఓటర్లకు తమ ప్రధాన అజెండా.. ప్రధాన నినాదాలు ఏమిటన్న అంశంపైనా పోటీలో ఉన్న పార్టీలు స్పష్టత ఇవ్వనున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధిపైనే దృష్టిపెట్టింది. ఇప్పటి వరకూ తాము చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పి.. ఇకపైనా అది కొనసాగాలంటే తమకే మద్దతివ్వాలని ప్రజలను ఆ పార్టీ అడగనుంది. రైతు బంధు, దళితబంధు, ఫించన్లు తదితర సంక్షే మ పథకాలతో పాటు.. ఫ్లోరైడ్‌ సమస్య లేకుండా తాగునీరు అందించామని, నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని ప్రజల దృష్టికి తేవాలని నిర్ణయించింది. 


ఒక్క మునుగోడు ఎన్నికలను ఉద్దేశించే అని చెప్పలేం కానీ.. ఈ ఎన్నికకు కొద్దికాలం ముందే దళితబంధు లబ్ధిదారులను పెంచాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి 100 మందికి ఇవ్వగా.. ఇప్పుడు నియోజకవర్గానికి 500 మందికి ఇస్తామన్నారు. దళితబంధుతో పాటు గిరిజన బంధును రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించింది. దళితబంధులో ఇస్తున్నట్లే గిరిజనబంధులో కూడా ఒక్కో గిరిజన కుటుంబానికీ రూ.10లక్షల చొప్పున ఇస్తామంది. ఇది ఇటీవల కాలంలోనే ప్రకటించిన పథకం. అంతేకాకుండా గిరిజన రిజర్వేషన్లను 10శాతానికి పెంచుతూ జీవోను కూడా కొద్దిరోజుల క్రితమే జారీచేశారు. మునుగోడులో గిరిజన ఓటర్లు 12,933 మంది ఉన్నారు. ఈ పనులు వారి ఓట్లను తమవైపు ఆకట్టుకునేందుకు ఉపకరిస్తాయని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఇటీవలే ఆ పార్టీ.. ఒకే రోజు రైతు బంధు లబ్దిదారులందరినీ కలిసి తమకు మద్దతివ్వాలని అడిగింది. అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాల లబ్దిదారులను కూడా అడుగుతోంది.


ఆడబిడ్డను ఆశీర్వదించండి

ఒకరకంగా చూస్తే మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ బలం ఎక్కువ. ఆ పార్టీ గతంలో ఇక్కడ ఆరుసార్లు గెలుపొందింది. అయితే ఇతర పార్టీలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న ఆర్థిక బలం ఇప్పుడు తక్కువ. అందుకే ఆ పార్టీ.. ‘‘ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి.. మునుగోడు ఆడబిడ్డను ఆశీర్వదించండి’’ అనే భావోద్వేగ నినాదాన్ని ఎంచుకుంది. మునుగోడు గడ్డ ప్రజాస్వామ్యం వైపు నిలబడాలని పిలుపునిస్తోంది. ఈమేరకు.. యువజన కాంగ్రెస్‌ శాఖ మునుగోడులో లక్షమంది కాళ్లకు నమస్కరించి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. అలాగే.. ‘‘సోనియాగాంధీ కష్టకాలంలో ఉంటే ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తారా? తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా కాంగ్రె్‌సకు ఓటేయండి’’ అని కూడా కోరనుంది.


ఇతర పార్టీలూ..

మూడు ప్రధాన పార్టీలతోపాటు.. కొన్ని ఇతర పార్టీలు, సంఘాల తరఫున కూడా ఈ నియోజకవర్గంలో అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. బీఎస్పీ రాష్ట్ర శాఖ అధినేత ప్రవీణ్‌కుమార్‌.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం వహించేలా తాము ఒక అభ్యర్థిని పార్టీ తరఫున రంగంలోకి దించుతామని ప్రకటించారు. ఆయన ఇప్పటికే పార్టీ తరఫున మునుగోడులో పర్యటిస్తున్నారు. అలాగే.. గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన సుప్రీంకోర్టు న్యాయవాది శేషగిరిరావు గౌడ్‌ కూడా మునుగోడులో పోటీకి దిగనున్నారు. కొన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు కలిసి ఈయనను అభ్యర్థిగా పెడతామని ప్రకటించాయి. నియోజకవర్గంలో 60శాతం మంది బీసీలే ఉన్నా.. అన్ని ప్రధాన పార్టీలూ అగ్రవర్ణాలకు చెందినవారికే టికెట్‌ ఇచ్చిన అంశాన్ని వీరు ప్రస్తావించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల ఐక్యత.. వారి ప్రాధాన్యం తెలియాలంటే తమ అభ్యర్థులకే ఓటేయాలని బీఎస్పీ, ఈ సంఘాల నేతలు కోరనున్నారు.


మునుగోడుతోనే మార్పు

తెలంగాణలో మార్పురావాలి.. మునుగోడు దారి చూపాలి అనే ప్రధాన నినాదాన్ని బీజేపీ వినిపిస్తోంది. తెలంగాణలో కుటుంబ, అవినీతి పాలనను సాగనంపేందుకు మునుగోడు నాంది కావాలనే ప్రచారాన్ని ఆ పార్టీ ఎక్కువగా చేయనుంది. తెలంగాణ అంటే కేసీఆర్‌ కుటుంబమే అన్నట్లుగా తయారైందని.. దానికి చర మగీతం పాడాలని కమలనాథులు ఓటర్లను కోరనున్నారు. అంతేకాక.. టీఆర్‌ఎస్‌ చెప్తున్న అభివృద్ది, సంక్షేమ నినాదాన్ని కూడా తిప్పికొట్టే వ్యూహాన్ని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ప్రచార కమిటీ నేత వివేక్‌ రచిస్తున్నారు. తన రాజీనామా వల్లే సంక్షేమం, అభివృద్ధి నియోజకవర్గానికి వచ్చాయని.. అంతకుముందు ఈ కార్యక్రమాలు ఎందుకు చేయలేదని కోమటిరెడ్డి ప్రశ్నించనున్నారు. 


అలాగే.. గిరిజన బంధు, గిరిజన రిజర్వేషన్లు ఇప్పుడే ప్రకటించడానికి కారణం రాజగోపాల్‌రెడ్డి రాజీనామానే అని చెప్పనున్నారు. దళితబంధు హామీ గత హుజూరాబాద్‌ ఎన్నికల నాటిదని, ఇప్పటివరకూ ఇచ్చింది నియోజకవర్గానికి 100మందికేనని.. మునుగోడు ఉప ఎన్నికలు వచ్చాకే దళితబంధు రెండో దశ గుర్తుకు వచ్చిందని ప్రజలకు చెప్పాలని నిర్ణయించారు. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు సంక్షేమం, అభివృద్ది గుర్తుకొస్తాయని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత మరింత బలం పుంజుకోవాలన్నా..టీఆర్‌ఎస్‌ కుటుంబపాలన పోవాలన్నా తమకే మద్దతివ్వాలని అడగనున్నారు.

Read more