పోటెత్తిన జనం.. హోరెత్తిన వనం

ABN , First Publish Date - 2022-02-19T06:53:57+05:30 IST

అదే జోరు.. అదే జనహోరు! ఎటు చూసినా జన

పోటెత్తిన జనం..  హోరెత్తిన వనం

  • ముగింపు దశకు మేడారం మహా జాతర.. నేడు తల్లుల వనప్రవేశం
  • మూడో రోజూ అదే ప్రభం‘జనం’
  • మరింత పెరిగిన వీఐపీల తాకిడి
  • కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు,
  • ఎమ్మెల్సీలు, పార్టీల నేతల సందడి
  • సీఎం పర్యటన రద్దు.. నేడు వెళ్లే చాన్స్‌
  • అమ్మల దర్శనానికి గవర్నర్‌ తమిళిసై
  • 200 వాహనాలతో రేవంత్‌ రాక


హనుమకొండ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): అదే జోరు.. అదే జనహోరు! ఎటు చూసినా జన ప్రభంజనం!! మేడారం జాతరలో మూడో రోజు కూడా అదే జోరు కొనసాగింది. సమ్మక్క గురువారం రాత్రి గద్దెపైకి చేరిన తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది. శుక్రవారం భక్తులు మేడారానికి పోటెత్తారు. రెండు రోజులుగా 75 లక్షల మంది రాగా.. శుక్రవారం 25 లక్షల మందికిపైగా వచ్చినట్టు అధికారులు తెలిపారు. లక్షలాదిగా భక్తులు రావడంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అమ్మల దర్శనానికి రెండు గంటలు పడుతోంది. శనివారం సాయంత్రం తల్లుల వనప్రవేశంలోగా మరో 10 నుంచి 15 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.


సమ్మక్క, సారలమ్మతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై వేంచేసినాకే మొక్కులు చెల్లించాలనే సెంటిమెంట్‌తో వేచి ఉన్న భక్తులంతా సమ్మక్క గద్దెపైకి వచ్చిన తర్వాత దర్శనానికి ఒక్కసారిగా కదిలారు. దీంతో క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఒత్తిడి పెరిగింది. దీంతో క్యూలో నిల్చున్నవారిలో కొందరు ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఇద్దరు స్పృహ తప్పిపడిపోయారు. అప్రమత్తమైన పోలీసులు భక్తులను నియంత్రించి వీలైనంత త్వరగా దర్శనాలు జరిగేలా చూశారు. ఇందులో భాగంగా అప్పటి వరకు వీఐపీ, వీవీఐపీల కోసమే ప్రత్యేకంగా నిర్దేశించిన ప్రవేశమార్గాల్లో కొంత సడలింపులు ఇచ్చారు. భక్తులు వెళ్లేందుకు అనుమతిచ్చారు.


కాగా.. తల్లులు శనివారం సాయంత్రం వన ప్రవేశం చేయనున్నారు. సాయంత్రం సుమారు 6 గంటలకు వడ్డెలు గద్దెలపై ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజులను వారి నిజస్థానాలకు తిరిగి తోడ్కోని వెళతారు. సమ్మక్కను చిలకల గుట్టపైకి తిరిగి తీసుకువెళ్లడం ద్వారా వనప్రవేశం చేయిస్తారు. కాగా.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ జాతరలో అంతా తానై వ్యవహరిస్తున్నారు. మూడు రోజులుగా ఇక్కడే బస చేసి భక్తులకు కల్పించిన సదుపాయాలను స్వయంగా పర్యవేక్షిస్తూ, వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి కూడా జాతరలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.



వీఐపీల తాకిడి

జాతరకు శుక్రవారం ప్రముఖుల తాకిడి పెరిగింది. పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరై తల్లులను దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నారు. శుక్రవారం సీఎం కేసీఆర్‌ జాతరకు రావలసి ఉన్నా చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయింది. అయితే.. సీఎం వస్తున్నారనుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జాతరకు వచ్చారు. కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, రేఖా సింగ్‌, ఎంపీలు బండి సంజయ్‌, పసునూరి దయాకర్‌, మాలోతు కవిత, రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, ఆరూరి రమేశ్‌, నన్నపునేని నరేందర్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, శంకర్‌నాయక్‌, గండ్ర వెంకటరమణా రెడ్డి, డాక్టర్‌ రాజయ్య, కృష్ణారావు, వివేకానంద, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్‌, సిరికొండ మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, నవీన్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్‌ ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి తదితరులు తల్లులను దర్శనం చేసుకున్నవారిలో ఉన్నారు.


ఇక శనివారంనాడు.. గవర్నర్‌ తమిళిసై జాతరకు రానున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో మేడారానికి చేరుకోనున్నారు. టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా మేడారం రానున్నారు. గట్టమ్మ వద్ద నుంచి ర్యాలీగా మేడారం వచ్చేందుకు 200 వాహనాలను కార్యకర్తలు సిద్ధం చేస్తున్నారు.  



సీఎం వస్తారనుకుంటే..

భూపాలపల్లి, జగదేవపూర్‌, ఫిబ్రవరి 18: (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ మేడారం పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు. ఆయన వస్తారని హెలీప్యాడ్‌ను సిద్ధం చేయడంతోపాటు రోప్‌ పార్టీతో మాక్‌డ్రిల్‌ నిర్వహించి సీఎం కోసం నిరీక్షించారు. అయినప్పటికీ సీఎంవో నుంచి సమాచారం రాకపోవడంతో.. ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులంతా సాయంత్రం 4 గంటల వరకు ఎదురుచూసి నిరాశతో తిరుగుముఖం పట్టారు.


20న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ఠాక్రేతో కేసీఆర్‌ భేటీఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కీలకనేతలు, సలహాదారులతో కేసీఆర్‌ సమీక్షిస్తున్నారని, అందుకే ఆయన పర్యటన రద్దయిందని.. ఆరోగ్యం సహకరించనందునే రాలేదని.. ఇలా సీఎం పర్యటన రద్దుపై వివిధ కథనాలు వినిపిస్తున్నాయి. సీఎం మాత్రం శుక్రవారమంతా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలోనే ఉన్నారు. శనివారం ఆయన మేడారానికి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.




సీతక్క పాట

మేడారం, ఫిబ్రవ రి 18: మేడారం గద్దెల ప్రాంగణంలో ఎమ్మెల్యే సీతక్క సందడి చేశారు. ‘పచ్చని ఆడవుల్లో.. విచ్చుకున్న కొమ్ముల్లో.. కొలువు దీరిన సమ్మక్క సారలమ్మ తల్లీ’ అంటూ పాడి ఆమె అందరినీ ఆశ్చర్యపరిచారు. సారలమ్మ వచ్చే రోజు పాడాలని అనుకున్నప్పటికీ సమయం అనుకూలించలేదని, అందుకే ఈ రోజు పాడానని తెలిపారు. 




పారిశుధ్యం, వైద్యసేవలు భేష్‌: ఎర్రబెల్లి

హనుమకొండ/భూపాలపల్లి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మేడారం జాతర విజయవంతంగా జరుగుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పారిశుధ్యం, వైద్యసేవలు బాగున్నాయని కొనియాడారు. మూడు రోజులుగా మేడారంలోనే బస చేసిన మంత్రి శుక్రవారం కూడా జాతరలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు వరంగల్‌ నుంచి జాతరకు రావడానికి 6 నుంచి 10 గంటల సమయం పట్టేదని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశాలమైన రోడ్లతో త్వరితగతిన భక్తులు మేడారం చేరుకుంటున్నారని చెప్పారు.



కేసీఆర్‌ ప్రధాని కావాలి: మల్లారెడ్డి 

 ఆ అర్హతలు కేసీఆర్‌కే ఉన్నాయి: గంగుల


సీఎం కేసీఆర్‌ ప్రధాని కావాలని కోరుతూ సమ్మక్క, సారలమ్మ తల్లులకు మొక్కులు చెల్లించుకున్నామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ప్రధాని అయ్యేందుకు కేసీఆర్‌కు అన్ని అర్హతలున్నాయని చెప్పారు. మేడారం జాతర అభివృద్ధిపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించడం వల్లనే భారీ సంఖ్యలో భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా పాలిస్తున్న కేసీఆర్‌కు  ప్రధాని అయ్యే అర్హతలన్నీ ఉన్నాయని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. జాతరలో తులాభారం వేసి వనదేవతలకు బంగారం మొక్కు లు చెల్లించుకున్నారు. మేడారం అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ నిధులు కేటాయించడంతోనే జాతర ప్రశాంతంగా జరుగుతోందన్నారు. కాగా, మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-02-19T06:53:57+05:30 IST