ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి

ABN , First Publish Date - 2022-09-28T09:48:26+05:30 IST

‘‘ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి. ఎమ్మెల్యే, ఎంపీ.. ఏ పదవి కావాలో అప్పుడే కొట్లాడుకోవచ్చు.

ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి

  • మంచి పనులతో ప్రజల మనసు గెలుచుకోవాలి..
  • మతం పేరిట రాజకీయాలు వద్దు: కేటీఆర్‌
  • సిరిసిల్లలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహావిష్కరణ 

సిరిసిల్ల/కవాడిగూడ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి. ఎమ్మెల్యే, ఎంపీ.. ఏ పదవి కావాలో అప్పుడే కొట్లాడుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజలే బాస్‌లు. ప్రజలు ఏది డిసైడ్‌ చేస్తే అదే అవుతుంది. దానిని మార్చే అధికారం ఎవరికీ లేదు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడే యుద్ధాలు చేయాల్సిన పని లేదు’’ అని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండాలక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. లక్ష్మణ్‌ బాపూజీ 107వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను ఒక మంచిపని చేస్తే, ఒక ప్రాజెక్ట్‌ తెస్తే, మిగతావారు రెండు మంచి పనులు, రెండు ప్రాజెక్ట్‌లు తెచ్చి ప్రజల మనస్సు గెలుచుకోవాలన్నారు. అంతేగానీ కులం పేరుతో పంచాయితీ, మతం పేరుతో రాజకీయాలు వంటి చిల్లర పనులు చేయవద్దని సూచించారు. స్వాతంత్రోద్యమంలోనూ, తెలంగాణ ఉద్యమంలోనూ పోరాటం చేసిన మహానీయుడు అచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని కొనియాడా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


జలదృశ్యంలోనూ విగ్రహావిష్కరణ

 ట్యాంక్‌బండ్‌ జలదృశ్యంలో ఏర్పాటు చేసిన కొండాలక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు గం గుల కమలాకర్‌, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్‌, దానం నాగేందర్‌,  చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌. రమణ, కొండా లక్ష్మణ్‌ బాపూజీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ‘‘ఏ జలదృశ్యంలో అయితే ఉద్యమ నా యకుడు కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ఉద్భవించిందో.. ఏ జలదృశ్యాన్ని అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిం దో.. ఈ రోజు అక్కడే బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించుకొని తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశాం’’ అని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.


ఆరోగ్యరంగంలో మూడోస్థానం మనదే 

వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్రం దేశంలో మూడోస్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గత ఎనిమిదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రమూ సాధించ ని విధంగా తెలంగాణ ప్రస్థానం ఉందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి కేవలం 4 వైద్య కాలేజీల్లో 700 ఎంబీబీఎస్‌ సీట్లు మాత్రమే ఉండగా, మొద టి విడతలో కొత్తగా 4 కాలేజీల్లో 1640 సీట్లు అందుబాటులో వచ్చాయని పేర్కొన్నారు. రెండో విడతలో 8 కాలేజీలు ఏర్పాటయ్యాయని, దీనిద్వారా 1200 సీట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 2023-24 విద్యాసంవత్సరానికి కొత్తగా మరో 8 కాలేజీలు సిద్ధం అవుతున్నాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-28T09:48:26+05:30 IST