మునుగోడులో రాజకీయ ‘గణపతులు’!
ABN , First Publish Date - 2022-08-31T08:16:15+05:30 IST
మునుగోడుకు ఉప ఎన్నిక జరగనుండడం, ఇదే సమయంలో వినాయక చవితి రావడంతో..

విగ్రహాలు, డబ్బు పంపిణీ చేస్తున్న అధికార పార్టీ!
మండపాలకు రూ.10 వేల చొప్పున పంపిణీ?
టీఆర్‌ఎస్ దారిలోనే కాంగ్రెస్, బీజేపీ నేతలు
నల్లగొండ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): మునుగోడుకు ఉప ఎన్నిక జరగనుండడం, ఇదే సమయంలో వినాయక చవితి రావడంతో.. నియోజకవర్గ వ్యాప్తంగా ఈసారి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గణేశ్ ఉత్సవాలు ప్రత్యేకించి యువత ఆధ్వర్యంలోనే ఎక్కువగా నిర్వహిస్తుండడంతో.. ఉప ఎన్నిక దృష్ట్యా రాజకీయ పార్టీలు వారిని ఆకట్టుకునేందుకు భారీగా ఖర్చు చేస్తున్నాయి. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే కమిటీలకు.. విగ్రహం కొనుగోలుకు అయ్యే మొత్తంతోపాటు నవరాత్రులు ముగిసేంత వరకు మండపాల నిర్వహణకు అయ్యే ఖర్చునూ అధికార టీఆర్‌ఎస్ నేత ఒకరు అందజేస్తున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం ఆయా మండపాల నిర్వహణ కోసం డబ్బులు ఇస్తున్నారు. నియోజకవర్గంలోని చౌటుప్పల్ మునిసిపాలిటీ పరిధిలో 150 వినాయక విగ్రహాల ఏర్పాటుకుగాను ఒక్కో కమిటీకి రూ.10 వేల చొప్పున టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ జరిగినట్లు తెలిసింది. మంగళవారం చౌటుప్పల్ మార్కెట్ యార్డులో వీటిని పంపిణీ చేసినట్లు సమాచారం. దీంతోపాటు చౌటుప్పల్ మండలంలోని గ్రామాల్లోనూ 300 విగ్రహాలు, ఉత్సవాల నిర్వహణకు సైతం రూ.10 వేల చొప్పున అందజేసినట్లు తెలిసింది. ఇక మర్రిగూడ, నాంపల్లి, చండూరు, గట్టుప్పల్, మునుగోడు, నారాయణపురం మండలాల్లో టీఆర్‌ఎ్‌సతోపాటు బీజేపీ, కాంగ్రెస్ కూడా వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి కూడా మునుగోడు మండలంతోపాటు నియోజకవర్గంలోని పలు మండలాల్లో పెద్దఎత్తున వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈయన కూడా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఇక బీజేపీ నేత రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నేత చల్లమల్ల కృష్ణారెడ్డి కూడా తమను కలిసిన గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు ఇస్తున్నట్లు సమాచారం.