టెక్నాలజీ కనుసన్నల్లో పోలీసు రిక్రూట్‌మెంట్‌

ABN , First Publish Date - 2022-08-07T08:45:27+05:30 IST

పోలీసు నియామకాల్లో అవకతవకలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరించేందుకు నియామక బోర్డు అధునాతన సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించింది.

టెక్నాలజీ కనుసన్నల్లో పోలీసు రిక్రూట్‌మెంట్‌

రాత పరీక్షలో వేలి ముద్రల పరిశీలన

ఫిజికల్‌ టెస్టుల కోసం గ్రౌండ్‌లో ఎంటర్‌ కాగానే అభ్యర్థి చేతికి ఎలకా్ట్రనిక్‌ బ్యాండ్‌

ఎత్తును కొలిచేందుకు మెర్క్యురీ బ్యాలన్స్‌

పోలీసు నియామకాలపై బోర్డు వెల్లడి

అవకతవకలు జరగకుండా పక్కా చర్యలు


హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): పోలీసు నియామకాల్లో అవకతవకలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరించేందుకు నియామక బోర్డు అధునాతన సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించింది. ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రాథమిక రాత పరీక్ష నుంచి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు వివిధ దశల్లో అభ్యర్థులను పరీక్షించడానికి టెక్నాలజీనే ఉపయోగించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష హాల్‌లోకి వెళ్లగానే వారి నుంచి వేలి ముద్రలు తీసుకుంటారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశలో శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం, రాతపరీక్షలోని వేలిముద్రలతో అభ్యర్థి వివరాలను పోల్చి చూస్తారు. అభ్యర్థి మైదానంలోకి వెళ్లే ముందే అతని చేతికి ఎలకా్ట్రనిక్‌ బ్యాండ్‌ తగిలిస్తారు. దీంతో అభ్యర్థి ప్రతి కదలిక తెలిసిపోతుంది. గత నోటిఫికేషన్‌లో అభ్యర్థి పరుగును కొలిచేందుకు ఆర్‌ఎ్‌ఫఐడీ విధానాన్ని ఉపయోగించారు. అయినా, కొన్ని అభ్యంతరాలు లేవనెత్తడంతో ఈసారి ప్రెజర్‌ ప్యాడ్స్‌ ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. ప్రెజర్‌ ప్యాడ్‌లో అడుగు పడిన వెంటనే అభ్యర్థికి అమర్చిన ప్రత్యేక చిప్‌ ద్వారా అతను ఎంత సమయంలో గమ్యం చేరాడనేది కచ్చితంగా తెలిసిపోతుంది. ఇక మెర్క్యూరీ బ్యాలన్స్‌ను ఉపయోగించి  అభ్యర్థి కచ్చితమైన ఎత్తును నమోదు చేసుకొనేలా చర్యలు తీసుకొంటున్నారు. పోలీస్‌ అధికారులు, రాజకీయ నాయకుల పరిచయాలతో పోలీస్‌ కొలువు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసు నియామక బోర్డు అధికారులు అభ్యర్ధులకు సూచిస్తున్నారు. ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, సాంకేతిక నిఘాలో జరుగుతుందన్నారు. తప్పుడు పద్ధతిలో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించే అభ్యర్థులపైనే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2022-08-07T08:45:27+05:30 IST