PM Modi: నేడే మోదీ రాక

ABN , First Publish Date - 2022-11-12T04:33:15+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ శనివారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతోపాటు రూ.9500 కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను ఈ సందర్భంగా జాతికి అంకితం చేయనున్నారు.

PM Modi: నేడే మోదీ రాక

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని

రూ.6338 కోట్ల వ్యయంతో పరిశ్రమ పునరుద్ధరణ

ఎల్కతుర్తి-సిద్దిపేట-మెదక్‌ జాతీయ రహదారి,

భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైలు మార్గం ప్రారంభం

బేగంపేట, రామగుండం సభలకు హాజరు

ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం

హాజరు కానున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

ప్రధాని గో బ్యాక్‌.. గోదావరిఖనిలో కార్మిక సంఘాల నిరసన

ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం

హాజరు కానున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌

ప్రధాని పర్యటన షెడ్యూలు ఇదీ..

మధ్యాహ్నం 1.30కి బేగంపేట విమానాశ్రయానికి రాక

1.40 నుంచి 2 గంటల వరకు బహిరంగసభకు హాజరు

2.15 గంటలకు బేగంపేట-రామగుండం బయలుదేరుతారు

3.20కి రామగుండం చేరుకుంటారు

3.30-4 గంటల వరకు రామగుండం ప్లాంటు సందర్శన

4.15 గంటలకు బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు

సభ అనంతరం 5.30కు రామగుండం నుంచి బయలుదేరి

6.30 కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు

6.40కి బేగంపేట నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు

హైదరాబాద్‌/పెద్దపల్లి/సత్తుపల్లి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ శనివారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతోపాటు రూ.9500 కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను ఈ సందర్భంగా జాతికి అంకితం చేయనున్నారు. మొత్తంగా ఆరు గంటలపాటు రాష్ట్రంలో ప్రధాని పర్యటన కొనసాగనుంది. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చిన మోదీ.. శనివారం విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం ఆవరణలో బీజేపీ నగరశాఖ తరఫున స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఈ వేదిక నుంచి పార్టీ కార్యకర్తలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 3.20 గంటలకు రామగుండం చేరుకుంటారు. అక్కడి నుంచి 3:30 గంటలకు రోడ్డు మార్గంలో రామగుండం ఫర్టిలైజర్స్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎ్‌ఫసీఎల్‌)కు చేరుకుని, రూ.6338 కోట్ల వ్యయంతో పునరుద్ధరించిన ప్లాంట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అరగంటపాటు ఫ్యాక్టరీని సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 4:15 గంటలకు ఎన్టీపీసీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారు.

రూ.2,200 కోట్లతో చేపట్టనున్న మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి, బోధన్‌-బాసర-భైంసా రహదారి, సిరొంచా-మహదేవ్‌పూర్‌ రహదారులకు వీడియో లింక్‌ ద్వారా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు భద్రాచలం రోడ్డు నుంచి సత్తుపల్లి వరకు రూ.1000 కోట్లతో నిర్మించిన నిర్మించిన రైల్వేలైన్‌ను ప్రారంభించి, బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. 6.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి 6.40గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీ వెళతారు.

వారం రోజులుగా ముమ్మర ఏర్పాట్లు..

ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న నేపథ్యంలో వారం రోజుల నుంచి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ప్రధానమంత్రి ఎన్టీపీసీ టౌన్‌షి్‌పలో గల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. భద్రతా కారణాల దృష్ట్యా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ ఆవరణలో కొత్త హెలిప్యాడ్‌ను నిర్మించారు. అక్కడి నుంచి ప్రధాని రోడ్డు గుండా ఎన్టీపీసీ టౌన్‌షి్‌ప నుంచి ఆర్‌ఎ్‌ఫసీఎల్‌లోకి వెళ్లనున్నారు. ఆ తర్వాత ఎన్టీపీసీ స్టేడియానికి చేరుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా లక్ష మందితో, ఆ తర్వాత 50 వేల మందితో సభ నిర్వహిస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. కానీ, ఎన్టీసీపీ స్టేడియంలో వీఐపీలు, ప్రజలు కూర్చునేందుకు వీలుగా మూడు ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. ఇందులో 10 వేల కుర్చీలకు మించి లేకపోవడం గమనార్హం. మరో రెండు వేల మంది చుట్టు పక్కల నిల్చుని సభను తిలకించే అవకాశాలున్నాయి.

రైతులకు కల్పతరువుగా కిసాన్‌ యూరియా..

ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ కిసాన్‌ పేరిట ఉత్పత్తి చేస్తున్న యూరియా.. తెలంగాణ రైతులకు కల్పతరువుగా మారింది. రెండు దశాబ్దాల క్రితం మూతపడిన ఎఫ్‌సీఐని ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ పేరిట పునరుద్ధరించడంతో ఈ అవకాశం కలిగింది. రూ.6,338 కోట్ల వ్యయంతో రోజుకు 2,200 టన్నుల అమ్మోనియా, 3,850 టన్నుల యూరియాను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో వెయ్యి ఎకరాల స్థలంలో ఈ ప్లాంట్‌ను నిర్మించారు. దీనికి 2015 ఫిబ్రవరి 17న శ్రీకారం చుట్టగా, 2016 ఆగస్టు 7న గజ్వేల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పనులకు శంకుస్థాపన చేశారు. గత ఏడాది ఫిబ్రవరి 28న ట్రయల్‌ రన్‌ చేశారు. వాణిజ్యపరమైన ఉత్పత్తిని 2021 మార్చి 22న ప్రారంభించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 4,97,512 టన్నులు, ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు 5.2 లక్షలు, మొత్తం 10,17,512 టన్నుల యూరియాను ఉత్పత్తి చేశారు. అయితే, సెప్టెంబరు నెలాఖరు నుంచి పరిశ్రమను మరమ్మతుల పేరిట 20రోజులు షట్‌ డౌన్‌ చేశారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత మూడు రోజుల క్రితం తిరిగి యూరియా ఉత్పత్తిని ప్రారంభించారు. గ్యాస్‌ లీకేజీ సమస్యలతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రధాని మోదీ వచ్చేలోపు మరమ్మతులు పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించేందుకు పరిశ్రమ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే శుక్రవారం సాయంత్రం వరకు మరమ్మతులు పూర్తికాలేదని సమాచారం. ప్రధాని వచ్చేవరకు మరమ్మతులు పూర్తి కాకపోతే.. యూరియాను బ్యాగ్‌ ఫిల్లింగ్‌ పాయింట్‌ వద్దకు తీసుకువచ్చి ఫిల్లింగ్‌ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు.

ప్రధాని టూర్‌కు కేసీఆర్‌ దూరం!

ప్రధాని మోదీ హాజరయ్యే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరు కావడం లేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రొటోకాల్‌ పాటించకుండా కార్యక్రమంలో పాల్గొనాలని మాత్రమే లేఖ పంపారని టీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి. ఈ కారణంగానే సీఎం రావడం లేదని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ హాజరవుతున్నారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవంత్‌ ఖుబా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ తదితరులు హాజరవుతున్నారు.

బొగ్గు రవాణా కోసం సత్తుపల్లి రైల్వేలైన్‌

సత్తుపల్లి /కొత్తగూడెం పోస్టాఫీ్‌ససెంటర్‌: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనుల నుంచి బొగ్గును రవాణా చేసేందుకు వీలుగా నిర్మించిన భద్రాచలం రోడ్‌-సత్తుపల్లి రైల్వేలైన్‌ను ప్రధాని నరేంద్రమోదీ శనివారం జాతికి అంకితం చేయనున్నారు. రామగుండంలో జరిగే కార్యక్రమం నుంచే వర్చువల్‌ రిమోట్‌ ద్వారా దీనిని ప్రారంభించనున్నారు. సత్తుపల్లిలోని జేవీఆర్‌, కిష్టారం సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గనుల్లో ఉత్పత్తి అయిన బొగ్గును తరలించే లక్ష్యంతో 54.10 కిలోమీటర్ల పొడవున ఈ రైల్వేలైన్‌ను నిర్మించారు. ఇందుకు అయిన ఖర్చులో రూ.619 కోట్లు సింగరేణి సంస్థ భరించగా, మిగిలిన మొత్తాన్ని రైల్వేశాఖ మంజూరు చేసింది. దీని నిర్మాణం కోసం860 ఎకరాల భూమిని సేకరించారు. రైల్వేలైన్‌ ప్రారంభ కార్యక్రమం కోసం కొత్తగూడెంలోని భద్రాచలం రోడ్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో సౌత్‌సెంట్రల్‌ రైల్వే ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2022-11-12T06:17:40+05:30 IST