మునుగోడులోనే మకాం వేయండి

ABN , First Publish Date - 2022-10-05T08:31:24+05:30 IST

‘‘ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు బీజేపీ నేతలు, కార్యకర్తలంతా మునుగోడులోనే మకాం వేయండి.

మునుగోడులోనే మకాం వేయండి

  • ప్రతి ఓటరును ఒకటికి నాలుగుసార్లు కలవండి
  • ఓటుకు రూ.30 వేలిచ్చి గెలవాలని కేసీఆర్‌ కుట్ర
  • బీజేపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌లో  సంజయ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ‘‘ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు బీజేపీ నేతలు, కార్యకర్తలంతా మునుగోడులోనే మకాం వేయండి. నియోజకవర్గం మొత్తం జల్లెడ పట్టండి. ప్రతి ఓటరును ఒకటికి నాలుగుసార్లు కలవండి. అందరినీ పోలింగ్‌ బూత్‌కు తీసుకొచ్చి పువ్వు గుర్తుకు ఓటేయించండి ఉప ఎన్నిక ఫలితం తర్వా త టీఆర్‌ఎస్‌ కనుమరుగు కాబోతోంది. మునుగోడులో బీజేపీ గెలుపు ఎప్పుడో ఖాయమైంది. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికపై చర్చ జరుగుతోంది. ఓటుకు రూ.30 వేలు పంచి గెలవాలని కేసీఆర్‌ చూస్తున్నారు. బీజేపీ దమ్ము ఏంటో చూపించే అవకాశం ఈ ఎన్నిక ద్వారా మనకు మరోసారి వచ్చింది. మీరంతా కష్టపడి పని చేయండి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మంగళవారం రాత్రి బండి సంజయ్‌ పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


మునుగోడు ఎన్నికల స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ వివేక్‌ వెంకటస్వామి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్‌ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడారు. మునుగోడులో పార్టీ గెలుపు కోసం మనోహర్‌ రెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు. అక్కడ సర్వేలన్నీ బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయన్నారు. ప్రభు త్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి టీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తోందని, అందులో భాగంగా కాంగ్రెస్‌కు నిధులిస్తోందని ఆరోపించారు. కమ్యూనిస్టు పారీలకూ టీఆర్‌ఎస్‌ ఆర్థిక సాయం చేస్తోందన్నారు. కేసీఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా.. ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రజల ఆశీర్వాదం, అమ్మవారి కృప బీజేపీపై ఉందన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల సమయంలో వచ్చిన ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనని తెలిపారు. మునుగోడు ఫలితం తర్వాతే బీజేపీ కార్యకర్తలకు అసలైన దసరా, దీపావళి రాబోతున్నాయన్నారు.

Read more