పార్టీలు మారేవాళ్లను ప్రజలు నమ్మరు

ABN , First Publish Date - 2022-08-25T08:16:33+05:30 IST

పార్టీలు మారే రాజకీయ నాయకులను ప్రజలు నమ్మరని, ఓట్లు వేయరని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు.

పార్టీలు మారేవాళ్లను ప్రజలు నమ్మరు

రాజాసింగ్‌ వ్యాఖ్యలు బీజేపీ వ్యూహంలో భాగమే: గుత్తా 

హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): పార్టీలు మారే రాజకీయ నాయకులను ప్రజలు నమ్మరని, ఓట్లు వేయరని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. మునుగోడులో సర్వే ఫలితాలు కూసుకుంట్లకు అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు. శాసనమండలిలోని తన చాంబర్‌లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. మునుగోడులో కొత్త వ్యక్తిని బరిలోకి దించే ఆలోచన లేదన్న సమాచారం మాత్రమే తనకు తెలుసని, అభ్యర్థి ఎంపిక విషయం కేసీఆర్‌ చూసుకుంటారని చెప్పారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కమ్యూనిస్టు భావాలు ఎక్కువని, అక్కడ మతతత్వ పార్టీలకు స్థానం లేదని పేర్కొన్నారు. రాజాసింగ్‌ మంగళవారం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా చేసినవేనని, అది బీజేపీ స్ట్రాటజీ అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మతకలహాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని గుత్తా  పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు, తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎమ్మెల్సీ కవిత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2022-08-25T08:16:33+05:30 IST