పార్టీ మారడం చారిత్రక అవసరం

ABN , First Publish Date - 2022-07-25T09:51:49+05:30 IST

సమయం వచ్చినప్పుడు పార్టీ మారడం చారిత్రక అవసరమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

పార్టీ మారడం చారిత్రక అవసరం

  • భయపడి కూర్చుంటే చరిత్ర హీనుడినవుతా
  • మునుగోడు ఉప ఎన్నిక.. కేసీఆర్‌ డ్రామా
  • అమిత్‌షా నాతో మాట్లాడితే కేసీఆర్‌ గుండెల్లో రైళ్లు 
  • మునుగోడు తీర్పుతోనే ఆయన పతనం ప్రారంభం
  • జైలుకు వెళ్లొచ్చిన వారితో నీతులు 
  • చెప్పించుకోవాలా?: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
  • ఎన్నిక రావాలని నేను  కోరుకోవడంలేదు
  • అమిత్‌షా నాతో మాట్లాడితే కేసీఆర్‌ గుండెల్లో రైళ్లు  పరుగెడుతున్నాయి
  • తప్పుడు నిర్ణయాలతో కాంగ్రెస్‌ బలహీనం

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): సమయం వచ్చినప్పుడు పార్టీ మారడం చారిత్రక అవసరమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. భయపడి ఇంట్లో కూర్చుంటే చరిత్ర హీనుడిగా మిగులుతానన్నారు. అయితే మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందన్నది సీఎం కేసీఆర్‌ ఆడుతున్న డ్రామా, దుష్ప్రచారం అని ఆరోపించారు. తాను మాత్రం ఉప ఎన్నికను కోరుకోవడంలేదని, రాజీనామా చేయాలనుకోవడంలేదని తెలిపారు. మునుగోడు ప్రజలు తలచుకుంటే, తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బుద్ది చెప్పాలనుకుంటే మాత్రం ఉప ఎన్నిక వస్తుందని వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తనతో 45 నిమిషాలపాటు మాట్లాడినట్లు తెలియడంతోనే కేసీఆర్‌ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపై వివరణ ఇచ్చేందుకు రాజగోపాల్‌రెడ్డి ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సను ఓడించడం చారిత్రక అవసరమని, ఆ పనిని తాను చేసి చూపిస్తానని అన్నారు. తాను పార్టీ మారాలనుకున్నప్పుడు కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసే వెళ్లిపోతానని చెప్పారు. కేసీఆర్‌పై యుద్ధానికి వెళుతున్నానంటూ సోనియాగాంధీకి, రాహుల్‌గాంధీకి చెప్పి.. వారికి క్షమాపణలు చెప్పి మరీ పోతానని స్పష్టం చేశారు. 


అమిత్‌షాను కలిసింది వాస్తవమే..

తాను అమిత్‌షాను కలిసిన మాట వాస్తవమేనని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కానీ తమ మధ్య ఉప ఎన్నిక అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను పోషించిన పాత్ర, ప్రస్తుతం కేసీఆర్‌ పాలన సాగుతున్న తీరు, మిగులు రాష్ట్రం రూ.4 లక్షల కోట్ల మేరకు అప్పులపాలై జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఎలా చేరుకుందన్న దానిపైనే మాట్లాడానని చెప్పారు. తాను అమిత్‌షాను కలిశానని తెలియగానే కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీపై తనకు గౌరవం ఉందని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తుల నాయకత్వంలో పనిచేయడం ఇష్టంలేక ఇంట్లో కూర్చున్నానని తెలిపారు. జైలుకు వెళ్లివచ్చిన వారితో తాను నీతులు చెప్పించుకోవాలా? అని ప్రశ్నించారు. మునుగోడులో ఉప ఎన్నిక తీసుకురావాలనే కేసీఆర్‌ ప్రయత్నంలో తాను పావును కాబోనని, ఆయన రెచ్చగొడితే రాజీనామా చేయనని అన్నారు. తనను గెలిపించిన మునుగోడు ప్రజలు చెబితే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుందంటే తన సీటునూ త్యాగం చేస్తానన్నారు. కేసీఆర్‌ ఇంకా విర్రవీగితే మునుగోడు నియోజకవర్గం తీర్పుతోనే ఆయన పతనం ప్రారంభమవుతుందని హెచ్చరించారు. కేసీఆర్‌ను రాజకీయంగా బొంద పెట్టాల్సిన సమయం ఆసన్నమెనందునే అమిత్‌షాను కలిశానని పేర్కొన్నారు. ‘‘అధిష్టానం తప్పుడు నిర్ణయాలతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ బలహీనపడింది. మోదీ, అమిత్‌షా తలచుకుంటే టీఆర్‌ఎ్‌సను బొంద పెట్టవచ్చని గతంలో చాలాసార్లు చెప్పాను. తెలంగాణ ప్రజలు కూడా దీనిని విశ్వసిస్తున్నారు. నా జీవిత లక్ష్యం టీఆర్‌ఎ్‌సను ఓడించడం’’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. 

Read more