‘పంచాయతీ’ ఉప పోరు ఎప్పుడు..?

ABN , First Publish Date - 2022-03-17T05:16:18+05:30 IST

‘పంచాయతీ’ ఉప పోరు ఎప్పుడు..?

‘పంచాయతీ’ ఉప పోరు ఎప్పుడు..?

రెండేళ్లుగా జాడలేని ఉపఎన్నికలు

జాప్యం లేకుండా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలు

ఇప్పటికే మూడేళ్ల కాలం పూర్తి

ఇన్‌చార్జ్‌లతో కాలం వెల్లదీస్తున్న ప్రభుత్వం


మహబూబాబాద్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామపంచాయతీ స్థానాలకు ఉప ఎన్నికలు  నిర్వహించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఇప్పటికైనా పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం మూడేళ్లకాలం పూర్తయి మరో రెండేళ్లే మిగిలి ఉన్నాయి. ఖాళీలు ఏర్పడి ఏడాదికిపైగా అవుతున్నప్పటికీ ఉప ఎన్నికలు నిర్వహించడాన్ని ప్రభుత్వం విస్మరించిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏడాదిన్నర క్రితమే ఓటరు జాబితా సవరణలు పూర్తి చేసుకొని ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రాగానే నిర్వహించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీ అయిన 6 సర్పంచ్‌లు, 20 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సిఉంది. 2020లో ఖాళీగా ఉన్న సర్పంచ్‌, వార్డు స్థానాల్లో ఫొటోలతో కూడిన ఓటరు జాబితాను ఆయా గ్రామపంచాయతీల్లో కార్యదర్శులు ప్రదర్శించారు. అప్పట్లోనే జిల్లా, మండల స్థాయిల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఉప ఎన్నికలపై అవగాహన కోసం సమావేశం ఏర్పాటు చేశారు. ఖాళీగా ఉన్న స్థానాల్లో ఓటర్ల జాబితాను సైతం సిద్ధం చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపించినట్లు జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు. కమిషన్‌ నుంచి ఆదేశాలు రాగానే వెంటనే ఎన్నికలు నిర్వహించే విధంగా సన్నద్ధమైనట్లు సమాచారం. జాబితా పంపి ఏడాది అవుతున్నప్పటికీ ఉప ఎన్నికల ఊసే లేకుండా పోయింది. ఆయా గ్రామాల్లో ఉపసర్పంచ్‌లను ఇన్‌చార్జ్‌ సర్పంచులుగా, వార్డు సభ్యుల్లో ఒకరిని తాత్కాలిక ఉపసర్పంచులుగా నియమించి గ్రామపంచాయతీల్లో పాలన కొనసాగిస్తున్నారు.


ఖాళీగా ఉన్న సర్పంచ్‌ స్థానాలివే...

మహబూబాబాద్‌ జిల్లాలో కురవి మండలం గుండ్రాతిమడుగు సర్పంచ్‌ బండి వెంకట్‌రెడ్డి కురవి జడ్పీటీసీగా గెలుపొందడంతో సర్పంచ్‌ పదవికి రాజీనామా చేశారు. కేసముద్రం మండలం ఉప్పరపల్లి సర్పంచ్‌ శ్రీరామోజు మహేశ్వరాచారికి విద్యుత్‌ శాఖలో ఉద్యోగం రావడంతో 2019, అక్టోబర్‌లో రాజీనామా సమర్పించారు. బయ్యారం మండలం ఇర్సులాపురం సర్పంచ్‌ ఈసం రవికుమార్‌కు రెండేళ్ల క్రితం పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం రావడంతో ఆయన రాజీనామా చేశారు. ఇదే మండలంలో గత ఏడాది జగత్‌రావుపేట సర్పంచ్‌ వాంకుడోత్‌ అనిత, గూడూరు మండలం లైన్‌తండా సర్పంచ్‌ మూడు వీరన్నలు అనారోగ్యంతో  మృతి చెందారు. ఈ ఐదు జీపీల్లో ఉపసర్పంచులను ఇన్‌చార్జ్‌ సర్పంచులుగా నియమించారు. నెల్లికుదురు మండలం నైనాలలో సర్పంచ్‌, 10 వార్డు సభ్యుల స్థానాలన్నీంటికి వివాదంతో ఎన్నిక నిర్వహించకపోవడంతో మూడేళ్లుగా గ్రామంలో ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతోంది. ఏడాది క్రితం వివాదం తొలగిపోవడంతో ఇక్కడ జీపీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 


20 వార్డు సభ్యుల స్థానాలు ఖాళీ...

నెల్లికుదురు మండలం నైనాలలో 10 వార్డులతోపాటు వివిధ కారణాలతో కేసముద్రం మండలం అయ్యగారిపల్లిలో 7వ వార్డు ఖాళీగా ఉండగా కేసముద్రం విలేజిలో 5వ వార్డు, డోర్నకల్‌ మండలం అందనాలపాడులో 6వ వార్డు, గార్ల మండలం రాజుతండాలో 3వ వార్డు, కొత్తగూడ మండలం దుర్గారంలో 7వ వార్డు, ఎదుళ్లపల్లిలో 6వ వార్డు, కోనాపురంలో 4వ వార్డు, మహబూబాబాద్‌ మండలం మల్యాలలో 4వ, 2వ వార్డులు, మరిపెడలో బీచరాజ్‌పల్లిలో 7వ వార్డు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఈ స్థానాల్లో పంచాయతీ రాజ్‌ నిబంధనల ప్రకారం రాజీనామా చేసిన, చనిపోయిన ఆరునెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలకు వెనువెంటనే ఆఘమేఘాలపై ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రభుత్వం స్థానిక సంస్థల విషయానికి వచ్చే సరికి నిర్లక్ష్యం వహిస్తోందని ఆయా గ్రామాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే ఆయా సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. 

Read more