పాలకవర్గం లేక పరేషాన్‌

ABN , First Publish Date - 2022-09-24T05:21:52+05:30 IST

పాలకవర్గం లేక పరేషాన్‌

పాలకవర్గం లేక పరేషాన్‌

గతనెలలో ముగిసిన ఏనుమాముల మార్కెట్‌ కమిటీ పదవీకాలం

పాత కమిటీ రెన్యూవల్‌ లేదు.. కొత్త కమిటీ లేదు.. 

పర్సన్‌ ఇన్‌చార్జికి బాధ్యతలూ అప్పగించని వైనం 

జీతాల చెల్లింపు కోసం అప్పుల కోసం పరుగులు


వరంగల్‌టౌన్‌,  సెప్టెంబరు 23: మార్కెట్‌కు పాలకవర్గం లేకపోవడంతో   ఉద్యోగులు జీతాల కోసం, గుత్తేదార్లు బిల్లుల కోసం  పరేషాన్‌ అవుతున్నారు. దిడ్డి భాగ్యలక్ష్మి మార్కెట్‌ కమిటీ  చైర్‌పర్సన్‌గా ఉన్న పాలకవర్గానికి ఏడాది పదవీకాలం గత నెల 19తో ముగిసిపోయింది. ఆ కమిటీకి మరో రెండు మార్లు ఆరు నెలల చొప్పున రినివల్‌ చేసే అవకాశం ఉన్నా ఇప్పటి వరకు రెన్యూవల్‌ చేయకుండా హోల్డ్‌లో పెట్టారు. కొత్త కమిటీని సైతం నియమించలేదు. కనీసం పర్సన్‌ ఇన్‌చార్జికి కూడా బాధ్యతలు అప్పగించలేదు. దీంతో మార్కెట్‌ చెల్లింపుల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చొరువ తీసుకుని రైతులకు, వ్యాపారులకు, ఉద్యోగులకు, కార్మికులకు, గుత్తేదార్లకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలాఉంటే చైర్‌పర్సన్‌ భర్త  దిడ్డి కుమారస్వామి కమిటీ రెన్యూవల్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.


నెలకు సుమారు రూ.2 కోట్ల చెల్లింపులు

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, శానిటేషన్‌ తదితర గుత్తేదార్లకు చెల్లింపులు, సెక్యూరిటీ, అవుట్‌ సోర్సింగ్‌, మార్కెట్లో రోజు వారి ఖర్చులు ఇలా అన్ని కలుపుతే నెలకు సుమారు రెండు కోట్ల రూపాయల వరకు చెల్లింపులుంటాయి. గతంలో మార్క్‌ఫెడ్‌ వంటి డిపార్టుమెంట్లకు అప్పు ఇచ్చిన మార్కెట్‌,  నేడు పాలకుల తీరుతో అప్పులు తీసుకునే సాయ్థికి  దిగజారింది. నెల జీతాల చెల్లింపుల కోసం నర్సంపేట మార్కెట్‌ కమిటీ నుంచి అప్పు తీసుకున్నారు. మళ్లీ అక్టోబరు మొదటి వారంలో జీతాల చెల్లింపుల కోసం  ఆ స్థాయిలో అప్పు ఇచ్చే మార్కెట్‌ కమిటీ కోసం అధికారులు వెతుకుతున్నారు. గతంలో చింతం సదానందం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఇలానే రెండు నెలల పాటు హోల్డ్‌లో పెట్టారు. దీంతో ఖమ్మం మార్కెట్‌ నుంచి అప్పు తీసుకు వచ్చి జీతాల వగైరా చెల్లింపులు చేశారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించాలని మార్కెటల్‌ వర్గాలు కోరుతున్నాయి.


ఎస్సీ మహిళకే....

జిల్లాకు చెందిన మంత్రి అనుచరుడికి మార్కెట్‌ చైర్మన్‌ పదవీ కట్టబెట్టడానికి చేసిన ప్రయత్నాలు రిజర్వేషన్‌ పుణ్యమాని బెడిసి కొట్టాయి. ప్రస్తుతం వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన ఎస్సీ మహిళకు మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పదవిని అప్పగించేందుకు ఎమ్మెల్యే అరూరి రమేష్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 


ఉన్నతాధికారుల చొరవ అవసరం

మార్కెట్‌ కమిటీ పాలకవర్గం గత నెల 19 తో ముగిసిపోయిందని మారె ్కటింగ్‌శాఖ  ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఫైల్‌ పంపించి చేతులు దులుపుకున్నారు. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని చెబుతున్నారు. మార్కెట్‌ కమిటీ పరిధిలో కార్యకలాపాలు సజావుగా సాగాలంటే అప్పటి వరకు ఓ ఉన్నతాధికారికి పర్సన్‌ ఇన్‌చార్జి గా బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. 

Read more