సర్కారీ దవాఖానాలో కార్పొరేట్‌ వైద్యం

ABN , First Publish Date - 2022-02-23T09:31:25+05:30 IST

ల్యాప్రోస్కోపిక్‌ కీ హోల్‌ సర్జరీ.. వ్యయంతో కూడుకున్న వైద్య చికిత్సల్లో..

సర్కారీ దవాఖానాలో కార్పొరేట్‌ వైద్యం

ఉస్మానియా వైద్యులతో కలిసి మాట్లాడుతున్న వాణి

పేదరాలికి ఉస్మానియాలో ఉచితంగా ‘ల్యాప్రోస్కోపిక్‌ కీ హోల్‌ సర్జరీ’

ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదే మొదటిసారి  


హైదరాబాద్‌ సిటీ/మంగళ్‌హాట్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ల్యాప్రోస్కోపిక్‌ కీ హోల్‌ సర్జరీ.. వ్యయంతో కూడుకున్న వైద్య చికిత్సల్లో ఒకటి. ఈ రకం శస్త్రచికిత్సలు మనదేశంలో 1990వ దశకం నుంచే ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. అయితే ఈ నెల 4న హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో తొలి ల్యాప్రోస్కోపిక్‌ కీ హోల్‌ సర్జరీ జరిగింది. క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా పూర్తిచేసి.. ఓ పేదరాలి ప్రాణాలను నిలబెట్టారు. హైదరాబాద్‌కు చెందిన మల్లెల వాణి (31)కి లక్షలు విలువ చేసే ల్యాప్రోస్కోపిక్‌ కీ హోల్‌ సర్జరీని ఉచితంగా నిర్వహించారు. ఇంత ఖరీదైన శస్త్రచికిత్సను ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించడం ఇదే తొలిసారి. వివరాల్లోకి వెళితే.. మల్లెల వాణికి కాలేయంలో పెద్ద పరిమాణం((14/11 సెంటీమీటర్ల)లో కణితి ఏర్పడింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించగా లక్షల్లో ఖర్చవుతుందని తేల్చి చెప్పారు. అంత ఖర్చు పెట్టే స్థోమత లేకపోవడంతో వారు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులను కలిశారు. ఆమెను పరీక్షించిన వైద్య బృందం ఫిబ్రవరి 4న ల్యాప్రోస్కోపీ నిర్వహించి కణితిని తొలగించారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌, డాక్టర్‌ మధుసూదన్‌ ఈ వివరాలను వెల్లడించారు. రూ.75 లక్షలతో ‘కుసా’ పరికరం, తెలుగు రాష్ట్రాల పరిధిలో సర్జికల్‌ గ్యాస్ట్రో, లివర్‌ రెండు విభాగాలున్న ఆస్పత్రి ఉస్మానియా ఒక్కటే. కాలేయంలోని కణితులను తొలగించే శస్త్రచికిత్సల నిర్వహణ కోసం ఇక్కడ రూ.75 లక్షల విలువైన ‘క్యావిండ్రాన్‌ అలా్ట్రసోనిక్‌ ఆస్పిరేటా (కుసా)’ పరికరం అందుబాటులోకి వచ్చింది. దీన్ని ‘లివర్‌ కటింగ్‌ మిషన్‌’ అని కూడా పిలుస్తారు. దెబ్బతిన్న కాలేయాన్ని కత్తిరించేందుకు ఈ యంత్రాన్ని వినియోగిస్తారు. కాలేయం ఓపెన్‌ సర్జరీలో వినియోగించేందుకు ‘థాంప్సన్‌ లివర్‌ రిట్రాక్టర్‌’ అనే మరో పరికరం కూడా ఉంది. రూ.35 లక్షలు వెచ్చించి ప్రభుత్వం దీన్ని ఉస్మానియా ఆస్పత్రికి సమకూర్చింది. మరో రూ.18 లక్షలతో లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వాస్క్యులర్‌ ఇంట్రిమేషన్‌ యంత్రాన్నీ ఏర్పాటు చేశారు. ఉస్మానియాలో ఆపరేషన్‌ థియేటర్లను కూడా ఆధునికీకరించారు. ఈనేపథ్యంలో మల్లెల వాణికి అధునాతన పరికరాలను వినియోగించి శస్త్రచికిత్సను నిర్వహించినట్లు నాగేందర్‌ తెలిపారు.

Updated Date - 2022-02-23T09:31:25+05:30 IST