మా వాదన వినకుండా ఆదేశాలా?

ABN , First Publish Date - 2022-08-31T08:40:31+05:30 IST

విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు రూ.6756 కోట్లు చెల్లించాలంటూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయపోరాటం చేయాలని తెలంగాణ డిస్కమ్‌లు నిర్ణయించాయి.

మా వాదన వినకుండా ఆదేశాలా?

కేంద్ర ప్రభుత్వానివి ఏకపక్ష ఉత్తర్వులు.. 30 రోజుల్లో బకాయిలు కట్టాలనడం సరికాదు

కేంద్ర విద్యుత్తు శాఖ ఆదేశాలపై న్యాయపోరాటం!.. హైకోర్టులో పిటిషన్‌ వేయాలని యోచన

న్యాయపోరాటానికి సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌.. ప్రకటించిన విద్యుత్తు మంత్రి జగదీశ్‌రెడ్డి 


హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు రూ.6756 కోట్లు చెల్లించాలంటూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయపోరాటం చేయాలని తెలంగాణ డిస్కమ్‌లు నిర్ణయించాయి. 30 రోజుల్లోగా బకాయిలు కట్టాలన్న కేంద్ర ఆదేశాలను న్యాయపోరాటం ద్వారానే అడ్డుకోవాలని భావిస్తున్నాయి. కేంద్ర విద్యుత్తుశాఖ ఇచ్చిన ఆదేశాలపై డిస్కమ్‌లు మంగళవారం న్యాయనిపుణులతో చర్చించా యి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్‌-92 ప్రకారం నిర్ణయం తీసుకునేముందు ఇరు రాష్ట్రాల వాదన వినాలని, అలాకాకుండా కేంద్రం ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. విభజనకు సంబంధించిన అన్ని అంశాలను కేంద్ర హోంశాఖ బాధ్యత తీసుకుంటున్నప్పుడు విద్యుత్తుశాఖకు ఏం పని? అని నిలదీస్తున్నారు. వేధించే ప్రక్రియలో భాగంగానే ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయని అంటున్నారు. కేంద్రప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని సర్కారు యోచిస్తోంది. రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఉత్తర్వులు ఇచ్చారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. కేవలం ఏపీ ప్రభుత్వ వాదనలు విని, కేంద్రం ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపించారు. ఈ వివాదంపై సీఎం కేసీఆర్‌ కూడా ఆరా తీశారు. తదుపరి కార్యాచరణపై సెప్టెంబరు 3న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి.. నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. న్యాయపోరాటానికి సిద్ధం కావాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం గ్రీన్‌సిగ్నల్‌తో అధికారులు కూడా అందుకు సిద్ధమవుతున్నారు.


రుణ వాయిదాల నిలుపుదల నుంచి..

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ)లు కూడా రుణ ఒప్పందాలకు విరుద్ధంగా తదుపరి రుణాలకు త్రైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలని, గత ఏప్రిల్‌ (5 నెలలుగా) రుణ వాయిదాల విడుదలను ఆపేసిన విషయం తెలిసిందే. ఒక్క యాదాద్రికే రూ.862 కోట్ల దాకా జెన్‌కోకు విడుదల కావాల్సి ఉండగా.. డిస్కమ్‌లకు రూ.1000 కోట్ల దాకా రావాల్సి ఉంది. వ్యవసాయ కనెక్షన్లతో పాటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి వీలుగా ఆర్‌ఈసీ రుణ సహాయం చేస్తోంది. ఎస్పీడీసీఎల్‌కు రూ.600 కోట్లు, ఎన్పీడీసీఎల్‌కు రూ.400 కోట్లు ఆర్‌ఈసీ నుంచి ఆగిపోయాయి. పనులన్నీ చేసి, యూసీలు సమర్పించినా నిధులు విడుదల చేయకపోవడం కేంద్రం ఉద్దేశపూర్వకంగా తీసుకుంటున్న నిర్ణయాలేనని అధికారులు గుర్తుచేస్తున్నారు. 


అంతుచిక్కని వివాదాలు

రాష్ట్ర విభజన జరిగిన తొలినాళ్లలో పునర్‌వ్యవస్థీకరణ వివాదాలను తేల్చడానికి నీరజా మాథూర్‌ కమిటీని వేయగా.. ఆ కమిటీ ఏ నిర్ణయం తీసుకోకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ కూడా చొరవ తీసుకొని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు పెట్టించినా వివాదం తేలలేదు. ఇక 2019 సెప్టెంబరు 23న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రగతిభవన్‌లో సమావేశమైనప్పుడు కూడా దీనిపై చర్చ జరిగింది. అయినా ఫలితం రాలేదు. 2019 ఆగస్టు 19న విద్యుత్తు సౌధలో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్‌, తెలంగాణ ట్రాన్స్‌కో/జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావులు సమావేశమై 28 అంశాలకు గాను 26 అంశాలను పరిష్కరించుకోవడానికి నిర్ణయం తీసుకుంటూ బకాయిల వివాదాన్ని కాగ్‌కు అప్పగించాలని తీర్మానించారు. ఆ తర్వాత కొద్ది నెలలకే పరస్పర అంగీకారంతో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఏజీ కార్యాలయం సమాచారం ఇచ్చి.. చేతులెత్తేసింది. దీనికన్నా ముందు 2018 జూన్‌లోనే తెలంగాణ డిస్కమ్‌లను దివాలా తీసినట్లుగా ప్రకటించి, వాటి ఆస్తులను విక్రయించి తమ బకాయిలు ఇప్పించాలని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో తుది తీర్పునకు ముందే ఏపీ కేసును వెనక్కి తీసుకొని.. మళ్లీ హైకోర్టులో కేసు వేసి, దాన్ని కూడా వెనక్కి తీసుకుంది. విభజన వివాదాలపై వరసగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఉప కార్యదర్శుల స్థాయిలో పలు దఫాలుగా సమావేశాలు జరిగాయి. తాజాగా తెలంగాణతో ఉన్న వివాదాన్ని సాకుగా చేసుకొని ఏపీ కేంద్రం లో పావులు కదపగా.. ఏపీ వైపు నిలబడుతూ కేం ద్రం ఆదేశాలిచ్చిందని తెలంగాణ మండిపడుతోంది. 


డిస్కమ్‌లకు రూ.10 వేల కోట్లు

సోలార్‌ డెవలపర్లు, సెమ్‌కార్బ్‌, సింగరేణితో పాటు ఛత్తీ్‌సగఢ్‌ నుంచి తీసుకున్న కరెంట్‌కు గాను బకాయిలు చెల్లించడానికి బ్యాంకులు లేదా ఇతర సంస్థల నుంచి రూ.10 వేల కోట్ల రుణం తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం డిస్కమ్‌లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రూ.10 వేల కోట్ల రుణానికి పూచీకత్తు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ ఉత్తర్వు లు జారీ చేశారు. విద్యుత్తు బకాయిలు చెల్లించడానికి ఆలస్య రుసుము సర్‌ఛార్జి (లేట్‌ పేమెంట్‌ సర్‌ఛార్జి) రూల్స్‌ను ఇటీవలే తెచ్చిన కేంద్రం, బకాయిలు చెల్లిస్తే ఆలస్య రుసుము నుంచి మినహాయింపునిస్తున్నట్లు ప్రకటించింది. డిస్కమ్‌లు జెన్‌కో బకాయిలు చె ల్లిస్తే.. సర్‌ఛార్జి అంతా మాఫీ అవుతుందని ఆఫర్‌ ఇచ్చింది. ఇందులో చేరడానికి తెలంగాణ అంగీకారం తెలుపుతూ రూ.10 వేల కోట్లను అప్పుగా తీసుకొని, బాకీలు చెల్లించడానికి డిస్కమ్‌లకు అవకాశం ఇచ్చింది. 


రుణమంతా బకాయిల్లోనే జమ

బ్యాంకులు/ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణం రూ.10 వేల కోట్లలో ఒక్క రూపాయి కూడా తెలంగాణ డిస్కమ్‌ల ఖాతాల్లోకి చేరదు. ఆ డబ్బులన్నీ నేరుగా సెమ్‌కార్బ్‌, సింగరేణి థర్మల్‌, సోలార్‌ డెవలపర్లు, ఛత్తీ్‌సగఢ్‌ ఖాతాలో జమకానున్నాయి. దాంతో బకాయిలు క్రమంగా తగ్గుముఖం పడతాయని డిస్కమ్‌లు యోచిస్తున్నాయి. సోలార్‌ డెవలపర్లకు రూ. 3700 కోట్ల దాకా చెల్లించాల్సి ఉండగా.. సెమ్‌కార్బ్‌కు రూ.2300 కోట్లు, సింగరేణికి రూ.14500 కోట్లు, ఛత్తీ్‌సగఢ్‌కు రూ.1500 కోట్లు కలుపుకొని రూ.22వేల కోట్ల దాకా డిస్కమ్‌లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. తాజా నిర్ణయంతో రూ.10వేల కోట్ల బకాయి లు చెల్లించాక లేట్‌ పేమెంట్‌ సర్‌ఛార్జి వాటా కూడా తీసేస్తే.. బకాయిలు మరో రూ.6 వేల కోట్ల దాకా ఉంటాయని సమాచారం. 


వివాదాల పరిష్కారం  విద్యుత్తు శాఖ పని కాదు: వినోద్‌కుమార్‌ 

విద్యుత్తు బకాయిల విషయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని పరిష్కరించాలి తప్ప, కేంద్ర విద్యుత్తు శాఖ కాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌  చైౖర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తితే  కేంద్ర హోంశాఖ చొరవ తీసుకుని పరిష్కరించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. విద్యుత్తు బకాయిల విషయంలో కేంద్ర విద్యుత్తు శాఖ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం సహేతుకం కాదని ఆక్షేపించారు. కనీసం రెండు వైపులా వాదనలు కూడా వినలేదని తెలిపారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌ వాదనలను మాత్రమే సమర్థించి నెల రోజుల్లోగా విద్యుత్తు బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించడం సమర్థనీయం కాదని చెప్పారు. ఇది ముమ్మాటికీ తప్పదమే అవుతుందన్నారు. తెలంగాణ విద్యుత్తు సంస్థలకు ఏపీ రూ.12,940 కోట్లు బకాయి పడినట్లు లెక్కలుండగా...వాటిని కేంద్ర విద్యుత్తు శాఖ పట్టించుకోకపోవడం, కేవలం ఆంధ్రప్రదేశ్‌ వాదనలను మాత్రమే వినడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.

Read more