రైతులు బాగుపడడం ప్రతిపక్షాలకు ఇష్టంలేదు

ABN , First Publish Date - 2022-06-16T09:56:16+05:30 IST

సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీంతో లక్ష కుటుంబాలు బాగుపడతాయని మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.

రైతులు బాగుపడడం ప్రతిపక్షాలకు ఇష్టంలేదు

  • మాయమాటలతో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయి.. 
  • నిర్వాసితులందరికీ చట్ట ప్రకారం పరిహారం: హరీశ్‌


సిద్దిపేట టౌన్‌/చిన్నకోడూరు, జూన్‌ 15: సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీంతో లక్ష కుటుంబాలు బాగుపడతాయని మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కానీ, రైతులు బాగుపడడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని, అందుకే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బుధవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవెల్లి రిజర్వాయర్‌ సంఘటనపై మంత్రి స్పందించారు ప్రాజెక్టులో భాగంగా ఇంజనీర్లు తమ పని చేసుకుంటుంటే బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు రైతులకు మాయమాటలు చెప్పి అడ్డుకున్నారని తెలిపారు. ఇంజనీర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు వారికి రక్షణ కల్పించారని, అందులో భాగంగానే అనుకోని సంఘటన జరిగిందని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నాయని ఆరోపించారు. రైతులు వారి మాటలను నమ్మొద్దని, వారి వలలో పడొద్దని సూచించారు. భూ నిర్వాసితుల సమస్యలపై ఎన్నిసార్లయినా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 


ప్రతి నిర్వాసితుడికీ న్యాయం..

భూసేకరణ చట్టం 2013 ప్రకారం ప్రతి నిర్వాసితుడికీ న్యాయం జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం 3,816 ఎకరాల మేర భూ సేకరణ చేయగా కేవలం 84 ఎకరాల భూమి సేకరణ మాత్రమే జరగలేదన్నారు. వారు కోర్టును ఆశ్రయించడంతోనే పరిహారం చెల్లించలేదని తెలిపారు. ఇప్పటికే 97.82 శాతానికి రూ.200 కోట్లు చెల్లించామని, 84 ఎకరాల నిర్వాసితులు తీసుకోలేదని వెల్లడించారు. వీటితోపాటు 693 ఇళ్లు ఉన్నాయని, 2015లో 683 ఇళ్లకుగాను 98.58 శాతంగా రూ.83 కోట్లు చెల్లించామని, ఇంకా 1.45 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉందని వివరించారు. 10 కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయని, కోర్టు ఆదేశాల మేరకు వారికి కూడా డబ్బు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కాగా, సిద్దిపేట జిల్లా మెట్టుబండల వద్ద బుధవారం మంత్రి హరీశ్‌ను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, గౌరవెల్లి భూనిర్వాసితులు కలిశారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు న్యాయం చేసేందుకు కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 18ఏళ్లు నిండిన వారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని, ఇల్లు వద్దనుకునే వారికి ప్లాటు, రూ.3 లక్షల నగదు ఇస్తామని తెలిపారు. 

Read more