ఆన్‌లైన్‌లో పాత ఫీజులు.. కాలేజీలో కొత్త ఫీజులు

ABN , First Publish Date - 2022-09-19T08:03:04+05:30 IST

ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారు ప్రక్రియలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించారు.

ఆన్‌లైన్‌లో పాత ఫీజులు.. కాలేజీలో కొత్త ఫీజులు

  • ఇంజనీరింగ్‌ ఫీజులపై కొనసాగుతున్న గందరగోళం
  • ఫీజులపై నేడు, రేపు చర్చించనున్న ఏఎఫ్‌ఆర్‌సీ 

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారు ప్రక్రియలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించారు. అయితే ఆ విద్యార్థులు కాలేజీల్లో చేరాలంటే మాత్రం పెరిగిన ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫీజుల ఖరారుకు సంబంధించి కాలేజీలతో మళ్లీ సంప్రదింపులను ప్రారంభించాలని తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎ్‌ఫఆర్‌సీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమ, మంగళవారాల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహించనుంది. మరోవైపు ఈ అంశంపై అధికారికంగా ఉత్తర్వులను జారీచేయాల్సిన ప్రభుత్వం... పట్టించుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి మూడేళ్లకు ఒకసారి ఇంజనీరింగ్‌ ఫీజులను ఖరారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా గతంలో ఖరారు చేసిన ఫీజుల గడువు 2021-22తో ముగిసింది. దాంతో వచ్చే మూడేళ్ల (2022-23, 2023-24, 2024-25) కోసం ఈ ఏడాది కొత్త ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది.


 దీని కోసం టీఏఎ్‌ఫఆర్‌సీ గతంలోనే పలుమార్లు సమావేశాలను నిర్వహించి, కాలేజీలు అడిగిన ఫీజు ప్రతిపాదనలను పరిశీలించి... వాటి ఆదాయ, వ్యయాలకు అనుగుణంగా ఫీజులను ఏ మేరకు ఖరారుచేయవచ్చనే అంశంపై కసరత్తును పూర్తిచేసింది. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో కనీస ఫీజును రూ.35వేల నుంచి రూ.45వేలకు, గరిష్ఠ ఫీజును రూ.1.34 లక్షల నుంచి రూ.1.73 లక్షల వరకు పెంచాలని ప్రతిపాదించింది. అయితే... ఆగస్టు 1న ప్రత్యేకంగా సమావేశమై ఈ ఏడాది ఫీజులను పెంచకూడదని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను కూడా సమర్పించింది. ఈ విషయం తెలుసుకున్న పలు కాలేజీలు కోర్టును ఆశ్రయించి తాము ప్రతిపాదించిన కొత్త ఫీజులను అమలు చేయడానికి వీలుగా అనుమతిని పొందాయి. అయితే ప్రభుత్వం కోర్టు ఆదేశాలకనుగుణంగా ఇంకా ఉత్తర్వులను జారీ చేయలేదు.


ఆన్‌లైన్‌లో పాత ఫీజులే...

ఈ నేపథ్యంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ మొదటి దశలో భాగంగా ఈ నెల 6న విద్యార్థులకు సీట్లను కేటాయించారు. అనంతరం విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫీజులను కూడా చెల్లించారు. పెంచిన ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయకపోవడంతో... ఆన్‌లైన్‌లో పాత ఫీజులనే చెల్లించారు.  ఈ నెల 28 నుంచి రెండో దశ కౌన్సెలింగ్‌ కూడా మొదలుకానుంది. ఆ తర్వాత మిగి లే సీట్లకు మూడో దశ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్‌ అనంతరం విద్యార్థులు ఆయా కాలేజీల్లో నేరుగా చేరాలి. ఒకవేళ అప్పటికీ కూడా ఫీజుల ఖరారుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోతే... కోర్టు ద్వారా కాలేజీలు అనుమతి పొంది పెంచిన ఫీజులను విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. అంటే... ఇప్పటికే పాత ఫీజులను చెల్లించిన విద్యార్థులు, పెరిగిన మేరకు అదనపు ఫీజును కాలేజీల్లో నేరుగా చెల్లించాలి. ఇప్పటివరకు సుమారు 100 కాలేజీలు కోర్టు ద్వారా ఫీజులను పెంచుకోవడానికి అనుమతిని పొందినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీఏఎ్‌ఫఆర్‌సీ సోమవారం నుంచి మళ్లీ ఆయా కాలేజీలతో సంప్రదింపులను జరపనుంది. టీఏఎ్‌ఫఆర్‌సీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే వీలుంది.

Updated Date - 2022-09-19T08:03:04+05:30 IST