అనుసంధానంపై పాత పాటే

ABN , First Publish Date - 2022-02-19T07:23:46+05:30 IST

గోదావరి - కావేరి నదుల అనుసంధానంపై అన్ని రాష్ట్రాలూ పాత

అనుసంధానంపై పాత పాటే

  • గోదావరి-కావేరి అనుసంధానంపై మళ్లీ అవే వాదనలు..
  • గోదావరిలో నీటి లభ్యత తేల్చాల్సిందే: తెలంగాణ
  • మిగులు జలాలను తీసుకెళ్తే అభ్యంతరం లేదు: ఏపీ 
  • జాతీయ జల అభివృద్ధి సంస్థ నేతృత్వంలో భేటీ
  • ఏకాభిప్రాయంతోనే నదుల అనుసంధానం
  • జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ వెల్లడి


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): గోదావరి - కావేరి నదుల అనుసంధానంపై అన్ని రాష్ట్రాలూ పాత వాదనలే వినిపించాయి. గతంలో తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కట్టుబడి ఉన్నామని, అంతకు మించి చెప్పేదేమీ లేదని అన్నట్లు తెలిసింది. గోదావరి, కావేరి అనుసంధానంపై జాతీయ జల అభివృద్ధి సంస్థ ఆఽధ్వర్యంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ అధ్యక్షతన కర్ణాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చెరి అధికారులతో శుక్రవారం సమావేశం జరిగింది.


ఇందులో ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌ రెడ్డి, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణ రెడ్డి, తెలంగాణ నుంచి ఇరిగేషన్‌ శాఖ అంతర్‌రాష్ట్ర చీఫ్‌ ఇంజనీర్‌ మోహన్‌ కుమార్‌, ఈఈ సుబ్రమణ్య ప్రసాద్‌ హాజరయ్యారు. జలశక్తి శాఖ అధికారులు గోదావరి - కావేరి అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను కూడా రాష్ట్రాలు సూచించవచ్చని పంకజ్‌ కుమార్‌ చెప్పా రు. ఏకాభిప్రాయంతోనే నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే అమల్లో ఉన్న కేటాయింపులను పరిగణనలోకి తీసుకుంటామని, రాష్ట్రాల వాటాను నిర్ణయించడంలో నీటి దౌత్యాన్ని పాటిస్తామని హామీ ఇచ్చారు.


అలాగే, నదుల అనుసంధానం పట్ల సానుకూలంగా ముందుకురావాలని జలశక్తి శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. అయితే, గోదావరిలో నీటి లభ్యతపై మళ్లీ మదింపు చేపట్టాలని, ముందు నీటి లభ్యత తేల్చాలని తెలంగాణ అధికారులు అన్నట్లు సమాచారం. హైడ్రాలజీ పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదించారు. 1980ల్లో చివరిగా నీటి లభ్యతను తేల్చి ఉమ్మడి రాష్ట్రానికి 1400పైగా టీఎంసీలను బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిందని గుర్తు చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత కాలంలో నీటి లభ్యతను మదింపు చేయలేదని, కాబట్టి ముందు నీటి లభ్యతను తేల్చి రాష్ట్రాలకు కేటాయింపులు తేల్చాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


శాస్త్రీయ అంచనాలు లేకుండా నదుల అనుసంధానం చేస్తే నష్టపోతామని వాదించినట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిలో తెలంగాణకు 968 టీఎంసీల వాటా ఉందని, వాటిని వినియోగించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఏడు డీపీఆర్‌లకు సత్వరమే అనుమతులు ఇవ్వాలని కోరారు. ఇక గోదావరి - కావేరి నదుల అనుసంధానాన్ని పోలవరం ప్రాజెక్టు ద్వారా చేయాలని ఏపీ అధికారులు కోరారు. అయితే, నదుల అనుసంధానంలో భాగంగా మిగులు జలాలను మళ్లిస్తే తమకు అభ్యంతరం కాలేదని, గోదావరి నదిలో దిగువ రాష్టమైన తమ హక్కులకు భంగం కలిగించవద్దని స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా, గోదావరి - కావేరి అనుసంధానం ద్వారా కర్ణాటకపై ప్రభావం తక్కువ. దాంతో ఈ అనుసంధానం ద్వారా తమకు నేరుగా ప్రయోజనాలు కలిగేలా ఉండాలని, దాని ప్రకారం ప్రణాళిక రూపొందించాలని కర్ణాటక అధికారులు వాదించారు.  



ఛత్తీ్‌సగఢ్‌ అనుమతి అవసరం...

నీటి లభ్యతపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో ప్రస్తుతానికి ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం వినియోగించుకోని 487 టీఎంసీల నీటినే  నదుల అనుసంధానంలో భాగంగా మళ్లిస్తామని కేంద్ర జలసంఘం చైర్మన్‌ అన్నారు. అయితే, అందుకు ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు.


కాగా, ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాలు పాత అభిప్రాయాలే వ్యక్తం చేశాయని, కొత్తగా ఏమీ చెప్పలేదని జలశక్తి శాఖ అధికారులు తెలిపారు. ఇటీవలీ బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ అంశాన్ని ప్రస్తావించిన జరిగిన తొలి సమావేశంలో రాష్ట్రాలు కొత్త ప్రతిపాదనలు తెర మీదికి తీసుకొస్తాయని ఆశించామని, కానీ అలా జరగలేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నదులు అనుసంధానాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్నదని, కాబట్టి మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.


Updated Date - 2022-02-19T07:23:46+05:30 IST