కరెంటు కొనుగోళ్లకు ఓకే!

ABN , First Publish Date - 2022-08-21T08:10:10+05:30 IST

విద్యుత్‌ కొనుగోళ్లకు చెల్లింపులు చేయడం లేదనే కారణంతో తెలంగాణపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది.

కరెంటు కొనుగోళ్లకు ఓకే!

తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలపై కరెంట్‌ ఆంక్షలు ఎత్తివేత

6 రాష్ట్రాలపై కొనసాగుతున్న ఆంక్షలు

ధిక్కార కేసుపై డిస్కమ్‌లు వెనక్కి


హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ కొనుగోళ్లకు చెల్లింపులు చేయడం లేదనే కారణంతో తెలంగాణపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. వివిధ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు రూ.1380 కోట్ల మేర తెలంగాణ బాకీ పడిందని గుర్తించి నిబంధనల ప్రకారం తెలంగాణ సహా 13 రాష్ట్రాలకు బహిరంగ విపణిలో విద్యుత్‌ విక్రయాలు, కొనుగోళ్లు జరుపకుండా శుక్రవారం నుంచి ఆంక్షలు విధించింది. బకాయిలేవీ లేవని, అన్నీ చెల్లించేశామని  ఆంక్షలు విఽధించిన రోజు నుంచే తెలంగాణ చెబుతూ వస్తోంది.


శనివారం రూ.52.80 కోట్లను డిస్కమ్‌లు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు చెల్లించడంతో తెలంగాణ బకాయిలన్నీ సున్నా అయ్యాయి. దాంతో ఆంక్షలన్నీ ఎత్తేశారు. 19 నాటికి 13 రాష్ట్రాల మీద ఆంక్షలుండగా, శనివారం అవి ఆరుకు తగ్గాయి. తెలంగాణ డిమాండ్‌ను బట్టి రోజుకు 20-30 మిలియన్‌ యూనిట్ల దాకా కొంటోంది. కేంద్రం ఆంక్షల ఫలితంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1000-1500 మెగావాట్ల మేర కరెంట్‌ డిమాండ్‌ను డిస్కమ్‌లు విద్యుత్‌ కోతలతో కుదించాయి. ఆర్నెల్లుగా వ్యవసాయ రంగానికి క్రమంగా విద్యుత్‌ సరఫరాను కుదిస్తూ వస్తున్నారు. 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా విభాగం నుంచి వ్యవసాయ రంగాన్ని తీసేశారు.7-12 గంటల పాటు సరఫరా చేస్తున్నారు. పూర్తిగా విద్యుత్‌ కోతలు అమలు చేయకుండా త్రీఫేజ్‌ కరెంట్‌ సరఫరాను తొలగించి... సింగిల్‌ ఫేజ్‌కు పరిమితం చేస్తున్నారు.ఆంక్షలను ఎత్తేయడంతో కేంద్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసును వేయాలనే నిర్ణయాన్ని డిస్కమ్‌లు వెనక్కి తీసుకున్నాయి.

Read more