అధికారికంగా విమోచన ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-09-17T08:53:34+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా హైదరాబాద్‌ విమోచన దినోత్సవాలను కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.

అధికారికంగా విమోచన ఉత్సవాలు

ముఖ్య అతిథిగా అమిత్‌ షా: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌/సికింద్రాబాద్‌, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా హైదరాబాద్‌ విమోచన దినోత్సవాలను కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్రలలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే విమోచన దినోత్సవాలు అధికారికంగా జరుపుతున్నారని, తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ నిర్వహించలేదని చెప్పారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఫొటో, ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను కిషన్‌రెడ్డి తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించే హైదరాబాద్‌ విమోచన వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. 


కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై, మహారాష్ట్ర సీఎం షిండే కూడా ఉత్సవాల్లో పాల్గొంటారని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించామని వెల్లడించారు. కాగా, శుక్రవారం పరేడ్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను ఎంపీ అర్వింద్‌, కె.లక్ష్మణ్‌, నేతలు విజయశాంతి, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు వేర్వేరుగా పరిశీలించారు. కాగా, ఈటల తండ్రి మల్లయ్య ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజేందర్‌ను పరామర్శించేందుకు అమిత్‌ షా శనివారం ఉదయం శామీర్‌పేట మండలం పూడూరులోని ఈటల నివాసానికి వెళ్లనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా అమిత్‌షాతో వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రకు శనివారం బ్రేక్‌ పడనుంది. పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ సభతో పాటు, బేగంపేట టూరిజం ప్లాజాలో జరిగే కోర్‌కమిటీ  సమావేశం, క్లాసిక్‌ గార్డెన్స్‌లో నిర్వహించే ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో పాల్గొంటారు.

Read more