అరుదైన వ్యాధికి రూ.16 కోట్ల ఇంజక్షన్‌!

ABN , First Publish Date - 2022-08-07T07:17:28+05:30 IST

ఆ చిన్నారి పేరు ఎలెన్‌. వయసు రెండేళ్లు. ముద్దు ముద్దు మాటలతో.. ముచ్చటగా పెరగాల్సిన ఆ పాప గడచిన ఏడాది కాలంగా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోంది.

అరుదైన వ్యాధికి రూ.16 కోట్ల ఇంజక్షన్‌!

ఉచితంగా అందించి రెండేళ్ల చిన్నారికి జీవం పోసిన నొవార్టిస్‌ ఫార్మా


దుమ్ముగూడెం ఆగస్టు 6: ఆ చిన్నారి పేరు ఎలెన్‌. వయసు రెండేళ్లు. ముద్దు ముద్దు మాటలతో.. ముచ్చటగా పెరగాల్సిన ఆ పాప గడచిన ఏడాది కాలంగా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ’స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రాఫీ టైప్‌-2’.. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధి. మెడ నిలబడకపోవడమే ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ఈ వ్యాధిని నయం చేయాలంటే రూ.16 కోట్లు ఖరీదు చేసే నొవార్టిస్‌ ఫార్మా తయారు చేసిన జొల్జెన్‌స్మా ఇంజక్షన్‌ వేయడం ఒక్కటే మార్గమని వైద్యులు తేల్చేశారు. స్విట్జర్లాండ్‌ నుంచి ఆ ఇంజక్షన్‌ తెప్పించి వేస్తే గానీ పాప బతకదని చెప్పారు. కానీ, ఆ పాప తల్లిదండ్రులు సామాన్యులు. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లికి చెందిన తండ్రి ప్రవీణ్‌ మెడికల్‌ రిప్రెజెంటేటివ్‌ కాగా తల్లి స్టెల్లా గృహిణి. అయినా ఆశ చావని వాళ్లు సొంత డబ్బు కొంత విరాళాలు సేకరించగా వచ్చిన డబ్బుతో కలిపి దాదాపు రూ.10 లక్షలతో చికిత్స చేయిస్తున్నారు. కాగా, నొవార్టిస్‌ ఫార్మా సంస్థ తమసామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఇంజక్షన్‌ను నెలకో దేశానికి ఉచితంగా అందజేస్తుంది.


ఈ విషయం తెలుసుకున్న పాప తల్లిదండ్రులు ఇందుకోసం ఈ సంస్థ వద్ద రిజిస్టర్‌ చేసుకున్నారు. అయినా తమకు ఈ ఇంజక్షన్‌ వస్తుందో రాదో అన్న అనుమానం. ఈ నేపథ్యంలో శనివారం వారి నిరీక్షణ ఫలించింది. ఈ నెలలో ఆ రూ.16 కోట్ల ఇంజక్షన్‌.. ఈ కుటుంబాన్ని వరించింది. సికింద్రాబాద్‌ రెయిన్‌బో చిల్డ్రన్‌ ఆస్పత్రిలో వైద్యులు చిన్నారికి ఇంజక్షన్‌ వేశారు. దీంతో ఇంతకాలం వేదన అనుభవించిన ఆ తల్లిదండ్రులకు సంతోషం కట్టలు తెంచుకుంది. ఇంత ఖరీదైన ఇంజక్షన్‌ను ఉచితంగా అందించిన నొవార్టిస్‌ కంపెనీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆ చిన్నారి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. 

Read more