బోధనేతర బరువు!

ABN , First Publish Date - 2022-07-31T08:33:02+05:30 IST

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): గురుకులంలో ఉపాధ్యాయుల పని.. పిల్లల హాజరు చూసుకొని వారికి పాఠాలు చెప్పడం, అభ్యసన సామర్థ్యాలను పరిశీలించడం,

బోధనేతర బరువు!

గురుకుల ఉపాధ్యాయులపై అదనపు పనిభారం..

వార్డెన్‌ లేకపోవడంతో ఆ బాధ్యతలన్నీ టీచర్లపైనే 

కూరగాయలు, పప్పు, వంట సామగ్రిని చూసుకోవాలి..

విద్యార్థికి ఆరోగ్య సమస్యలు వస్తే ఆస్పత్రికి తీసుకెళ్లాలి

మరుగుదొడ్లు క్లీన్‌ చేయించాలి.. ఏ మాత్రం తేడా వచ్చినా టీచర్లపైనే చర్యలు

చేయవల్సిన పని ఏమిటి? చేస్తున్నది ఏమిటి?

అని తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): గురుకులంలో ఉపాధ్యాయుల పని.. పిల్లల హాజరు  చూసుకొని వారికి పాఠాలు  చెప్పడం, అభ్యసన సామర్థ్యాలను పరిశీలించడం, వారు చేసిన హోంవర్కు చూడటం, మరుసటి రోజు కోసం హోంవర్కు ఇవ్వడం వంటివి అవునా? ఈ పనులు కాకుండా వారి భోజనానికి వంటను సిద్ధం చేయించేందుకు పప్పులు, కూరగాయలు, వంట సామగ్రిని చూసుకోవడంతో పాటు బాత్రూంలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా లేదా? అన్నది చూసుకోవడం వంటివి ఉపాధ్యాయులు చేయాల్సి వస్తే? ఇప్పుడు.. తమ ‘గురు’తర బాధ్యతను నిర్వర్తించాల్సిన ఉపాధ్యాయులు ప్రస్తుతం ఇలా బోధనేతర పనులతో తలమునకలవుతున్నారు. కేజీ టు పీజీ విద్యా మిషన్‌లో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాల్లోని ఉపాధ్యాయులంతా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము చేయాల్సిన పని ఏమిటి? చేస్తున్నదేమిటి? అని ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యసన సామర్థ్యాలపై అడిగితే పర్వాలేదని.. అయితే తమ వాడికి భోజనం సరిగా పెట్టలేదంటూ కొందరు, మరుగుదొడ్డి శుభ్రంగా లేదంటూ ఇంకొందరు తమను ప్రశ్నిస్తున్నారని ఇది తమనెంతో ఇబ్బందిపెడుతోందని చెబుతున్నారు. రాష్ట్రంలో వందల సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వార్డెన్‌ పోస్టు ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యార్ధుల బాగోగులు చూసుకునే బాధ్యతలను వంతుల వారీగా ఉపాధ్యాయులకే అప్పగిస్తున్నారు. ఓ వైపు పాఠాలు చెబుతూనే మరోవైపు అదనపు పనులు నిర్వహిస్తున్నారు గురుకుల ఉపాధ్యాయులు. హౌస్‌ మాస్టర్‌ డ్యూటీ, డైనింగ్‌ హాల్‌, హాలీడే డ్యూటీ, పర్సన ల్‌ మాస్టర్‌ రిజిస్టర్‌ ఇలా వరుస పనులు నిర్వహించా ల్సి వస్తోంది. కేర్‌టేకర్‌ డ్యూటీ ఉంటే అవసరమనుకుంటే బయటకు వెళ్లి రేషన్‌ దుకాణం నుంచి బియ్యం తీసుకురావాల్సిందే. కూరలు సరిగా వస్తున్నాయా లేదా చూసుకోవాలి. కేర్‌ టేకర్‌ విధులు నిర్వహించే ఉపాధ్యాయులు తరగతులతోపాటు వంట వార్పు చూసుకోవాల్సిందే. విద్యార్థి ఏయే సబ్జెక్టుల్లో వెనుకడి ఉన్నాడు? ఎందులో ప్రతిభ కనబరుస్తున్నాడు? వెనుకబాటుకు కారణం ఏమిటనే వివరాలను పర్సనల్‌ మాస్టర్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాలి. హౌస్‌ మాస్టర్‌ రిజిస్టర్‌లో వి ద్యార్థికి సంబంధించిన మొత్తం వివరాలు క్లాస్‌ టీచర్‌ నమోదు చేసుకోవాలి. విద్యార్థికి ఆరోగ్యసమస్య తలెత్తితే హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఉన్నా టీచరే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఆటల పోటీలు, ఇతర అంశాల్లో నైపుణ్యం ఉన్న విద్యార్ధులు ఇతర ప్రాంతాల్లో పోటీలకు వెళితే వారికి తోడుగా ఉపాధ్యాయుడు వెళ్లాల్సిందే. కొన్ని సందర్భాల్లో  ఔట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయుల్ని వెంట పంపితే వారు సొంత డబ్బులే ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి. బిల్లు పెడితే ఎప్పుడు తిరిగి వస్తాయో తెలియదు. నాన్‌ టీ చింగ్‌ అంశాలపై దృష్టి సారించాల్సి వస్తుండటంతో విద్యా బోధన, అభ్యసన గాడితప్పుతోంద ని గురుకుల ఉపాధ్యాయులు గోడు వెల్లబోసుకుంటు్నారు.


ఆహారం ఎలా ఉందంటూ ఫోన్‌ 

గురుకులాల్లో కలుషిత ఆహార ఘటనలు వెలుగులో కి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు ఫోన్లు చేసి ఆ హారం గురించి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవడం ప్రారంభించా రు. ఒకవేళ ఆహారం బాగుందని చెబితే.. ఉన్నతాధికారులు ఆకస్మికంగా తనిఖీకి వచ్చి ఏదైనా లోపం ఉన్న ట్లు తేలితే ఇబ్బంది తప్పదు. ఆహారం బాగోలేదని చెబి తే ప్రిన్సిపల్‌ నుంచి వేధింపులు తప్పవు. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్న చం దంగా రెండు వైపుల నుంచి తమకే ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తలపట్టుకుంటున్నారు. ఆహార నాణ్యతకు విద్యార్థులు లేదా ప్రిన్సిపల్‌, ప్రత్యేక బృం దంతో ఆకస్మిక తనిఖీలు చేపడితే ఉపాధ్యాయులకు ఇబ్బందికర పరిస్థితి తప్పడంతోపాటు నాణ్యత ప్రమాణాలు పక్కాగా అమలవుతాయని చెబుతున్నారు.


బోధనా పరమైన పనులే ఎన్నో 

 బోధనేతర అంశాలను ఎన్నో పర్యవేక్షిస్తున్నా పా ఠ్యాంశాల బోధన పరంగా ఉపాధ్యాయులు తమ పూర్తి బాధ్యతను నిర్వర్తించాల్సిందే. అదనపు పనులను చూ సుకుంటున్నా సమయానికి సిలబస్‌ పూర్తి చేయాల్సిం దే. ఎప్పటికప్పుడు పరీక్షలు పెట్టాలి. వెనుకబడి ఉన్న విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 


పరీక్షల సమయంలో తక్కువ అభ్యసనా స్థాయిలున్నవారిని మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది రికార్డుల్లో నమోదు చేయాలి. విద్యార్థుల్లో ఎవరికైనా మార్కులు సరిగా రాకపోయినా, విద్య లో వెనుకబడి ఉన్నా ఉపాధ్యాయుడినే బాద్యుడిని చే స్తుండటంతో తాము తరగతి గదుల్లో పాఠాలు చెప్పా లో.. లేక గురుకులంలో పనులు చక్కబెట్టాలో తెలియక తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నామని వాపోతున్నారు. ఇవి సరిపోదన్నట్లు బయట సమావేశాలు, ఇతర పనులు ఉంటున్నాయని వాపోతున్నారు.అదనపు పనులు లేకపోతే బోధణకు  ప్రాధాన్యమిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని గురుకుల ఉపాధ్యాయులు చెబుతున్నారు.


మరుగుదొడ్ల ఫోటోలు తీయాలి 

గురుకుల విద్యార్ధులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో మరుగుదొడ్ల సమస్య ఒకటి. అద్దె భవనాల్లో గురుకులాలు కొనసాగుతుండటంతో విద్యార్ధుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు ఎక్కడా లేవు. అయితే మరుగుదొడ్లు, డార్మెటరీలు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు విజిట్‌ చేసి శుభ్రం చేయించడంతోపాటు వాటి ఫోటోలు తీసి ప్రిన్సిపాల్‌కు, గురుకుల వాట్సాప్‌ గ్రూప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. గురువుగా పాఠాలు చెప్పాల్సిన చోట మరుగుదొడ్ల ఫొటోలు తీయడం తమకు తీవ్ర ఇబ్బందికరంగా ఉంటోందని గురుకుల ఉపాధ్యాయులు వాపోతున్నారు.


నియామకమే పరిష్కారం

గురుకులాల్లో అసిస్టెంట్‌ కేర్‌ టేకర్‌ ఉద్యోగులున్నా వార్డన్‌ బాధ్యతలను నిర్వహించడం లేదు. ఆ పనులను ఉపాధ్యాయులే వంతుల వారీగా చేస్తున్నారు. ఫుడ్‌ సెక్షన్‌కు ప్రత్యేకంగా వార్డెన్‌ను నియమించడం ద్వారా బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను వేరు చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్ధులకు ఎప్పటికప్పుడు మరింత నైపుణ్యంతో బోధన అందించేందుకు అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా నైట్‌ స్టడీ ట్యూటర్‌ కం నైట్‌ కేర్‌ టేకర్‌ నియామకంతో ఉపాధ్యాయులపై పనిభారం తగ్గుతుంది.  ఈ విషయంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని గురుకుల ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Read more