రాత్రి పది తర్వాత పబ్‌ సౌండ్‌ రావొద్దు

ABN , First Publish Date - 2022-09-13T09:53:28+05:30 IST

రాజధానిలో శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న పబ్బులు, బార్లపై ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారో వివరణ ఇవ్వాలని రాచకొండ, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

రాత్రి పది తర్వాత పబ్‌ సౌండ్‌ రావొద్దు

పాటించని పబ్బులు, బార్లను మూసేయండి

సుప్రీం ఆదేశాలు వెంటనే అమలు చేయండి

పబ్‌ల శబ్ద కాలుష్యంపై ఎన్ని కేసులు పెట్టారు?

ఏ ప్రాతిపదికన వాటికి అనుమతులిస్తున్నారు?

ప్రభుత్వ విభాగాలను నిలదీసిన హైకోర్టు

కమిషనరేట్లు, జీహెచ్‌ఎంసీ, ఎక్సైజ్‌కు నోటీసులు


హైదరాబాద్‌, సెప్టెంబరు12 (ఆంధ్రజ్యోతి): రాజధానిలో శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న పబ్బులు, బార్లపై ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారో వివరణ ఇవ్వాలని రాచకొండ, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఏయే అంశాలను ఆధారంగా చేసుకొని పబ్బులు, బార్లకు వాణిజ్య లైసెన్సులు, ఇతర అనుమతులు జారీ చేస్తున్నారో చెప్పాలని ఎక్సైజ్‌ శాఖ, జీహెచ్‌ఎంసీలను కోరింది. ఈ మేరకు సోమవారం ఆయా ప్రభుత్వ విభాగాలకు నోటీసులు జారీ చేసింది. రాత్రి పది గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు శబ్ద కాలుష్యం కలిగించే విధంగా లౌడ్‌ స్పీకర్లు వాడరాదని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో పబ్బు, బార్లు విషయంలోనూ తక్షణమే వాటిని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు నిబంధనలు పాటించని పబ్స్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జూబ్లీహిల్స్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ జూబ్లీహిల్స్‌ రెసిడెంట్స్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ అసోసియేషన్‌తో పాటు పలు సంస్థల ప్రతినిధులు హైకోర్టులో గత ఏడాది పిటిషన్లు వేశారు.


రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌తోపాటు 800 జూబ్లీ, ఫర్జీ కేఫ్‌, ఆమ్నేసియా లాంజ్‌ బార్‌, హైలైఫ్‌ బ్రూయింగ్‌ కంపెనీ, డైలీ డోస్‌ బార్‌ హబ్‌, డర్టీ మార్టినీ కిచెన్‌ అండ్‌ కాక్‌టైల్‌ బార్‌, బ్రాడ్‌వే ది బ్రూవరీ, మాకో బ్ర్యూ వరల్డ్‌ కాఫీ, హార్ట్‌ కప్‌ కాఫీ తదితర పబ్‌లు/బార్లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ కె.లలిత ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.ఎ్‌స.రాజశేఖర్‌ వాదనలు వినిపించారు. అనుమతికి మించిన డెసిబుల్స్‌లో శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తున్న పబ్బులు, బార్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. నివాస ప్రాంతాల్లో పరిమితికి మించిన శబ్దం చేస్తూ శాంతియుతంగా జీవించే హక్కుకు భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు-2000, పర్యావరణ శాఖ జీవోల ప్రకారం పబ్బులు, బార్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. నివాస ప్రాంతాలు, పరిశ్రమలు, వాణిజ్య ప్రాంతాలు, సైలెంట్‌ జోన్లలో ధ్వని కాలుష్యంపై పరిమితులు విధిస్తూ 2010లో అప్పటి ప్రభుత్వం జీవో 172 జారీ చేసిందని పిటిషన్ల తరఫు న్యాయవాది తెలిపారు. జూబ్లీహిల్స్‌ ప్రాంతంలోని పబ్బులు, హోటళ్ల వల్ల పరిమితికి మించి ధ్వని కాలుష్యం ఏర్పడుతోందని తెలిపారు. ప్రభుత్వ జీవో ప్రకారం ఽధ్వని కాలుష్య నియంత్రణను అమలు చేసే అధికారం కలిగిన హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు పబ్బులపై పలుమార్లు ఫిర్యాదు చేశామని చెప్పారు. 


తమ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పబ్బులు నిబంధనలను పాటించేలా కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. మూడు కమిషనరేట్‌ల పరిధిలో శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న పబ్బులు, బార్లపై ఎన్ని కేసులు నమోదు చేశారు? అసలు నివాస ప్రాంతాల్లో మొత్తం ఎన్ని పబ్బులు ఉన్నాయి? ఎన్నింటికి మ్యూజిక్‌ ప్లే చేయడానికి అనుమతి ఉంది? బార్లు, పబ్బులకు ట్రేడ్‌ లైసెన్స్‌ ఇవ్వడానికి జీహెచ్‌ఎంసీ ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది? అనే అంశాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రాత్రి 10 గంటల తర్వాత శబ్ద కాలుష్యం చేసే పబ్స్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఎక్సైజ్‌ చట్టం ప్రకారం కేవలం మద్యం అమ్మకానికి, తాగడానికి మాత్రమే అనుమతి ఉండగా.. లౌడ్‌ స్పీకర్లు, డీజేలు ఎవరి వద్ద అనుమతి తీసుకుని పెడుతున్నారని ప్రశ్నించింది. డీజేలు పెట్టడానికి ఆయా పబ్స్‌కు అనుమతులు ఉన్నాయా? ఇందుకు సంబంధించి ఎలాంటి నిబంధనలు అమలు చేస్తున్నారో వివరించాలని ఆదేశించింది. ఈ మేరకు మూడు కమిషనరేట్లకు, జీహెచ్‌ఎంసీకి, ఎక్సైజ్‌ శాఖకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. 

Updated Date - 2022-09-13T09:53:28+05:30 IST