కేఆర్‌ఎంబీలో పైసల్లేవు

ABN , First Publish Date - 2022-03-18T08:52:40+05:30 IST

శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ లాగే కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు(కేఆర్‌ఎంబీ)ల్లో ఖాతాల్లో నిధులు అడుగంటి పోయాయి.

కేఆర్‌ఎంబీలో పైసల్లేవు

నిధులు విడుదల చేయని తెలుగు రాష్ట్రాలు

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ లాగే కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు(కేఆర్‌ఎంబీ)ల్లో ఖాతాల్లో నిధులు అడుగంటి పోయాయి. గడచిన 8 ఏళ్లలో మొదటి నాలుగేళ్ల పాటు తెలంగాణ, గత మూడేళ్లుగా ఏపీ ఒక్క రూపాయి కూడా బోర్డుకు ఇవ్వలేదు. కృష్ణా నదిపై నీళ్ల లెక్కలు తేల్చాలన్నా... నీటి కేటాయింపులు ఒప్పందాల మేరకు పంచాలన్నా బోర్డే చేయాలి. నిధుల కొరతతో అల్లాడుతున్న బోర్డు తెలుగు రాష్ట్రాల వైపు ఆశగా ఎదురుచూస్తోంది. బోర్డులో ఛైర్మన్‌, మెంబర్‌లు తప్ప మిగిలిన వారంతా తెలుగు రాష్ట్రాల ఉద్యోగులే. తాజా బడ్జెట్లో బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం రూ.11 కోట్లు కేటాయింపులు చేసింది. ఏపీ బడ్జెట్‌లో నిధులే కేటాయించలేదు.


ఇదేంటీ అని బోర్డు ఆరా తీయగా... సవరణ బడ్జెట్లో పెడతామని ఏపీ చెప్పింది. గత మూడు బడ్జెట్లలోనూ ఒక్క పైసా ఇవ్వలేదు. ఓ దశలో జీతాలకు డబ్బుల్లేని పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తొలి నాలుగేళ్లు తెలంగాణ కూడా ఒక్క పైసా కేటాయించలేదు. గెజిట్‌ రాకతో బోర్డు బరువు, బాధ్యతలు కూడా పెరిగాయి. ప్రాజెక్టులను స్వాఽధీనానికి గతేడాది జూలై 15వ తేదీన గెజిట్‌ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం... బోర్డుల నిర్వహణకు చెరో రూ.200 కోట్లను 60 రోజుల్లోగా(సెప్టెంబరు 14లోగా) ఇవ్వాలని స్పష్టం చేయగా... ఒక్కపైసా కూడా తెలుగు రాష్ట్రాల నుంచి బోర్డుకు విడుదల కాలేదు.

Read more