టీఆర్‌ఎస్‌కు ఇక వీఆర్‌ఎస్సే

ABN , First Publish Date - 2022-06-12T09:14:01+05:30 IST

టైంపాస్‌ రాజకీయాలు చేయడంలో సీఎం కేసీఆర్‌ దిట్ట అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. తెలంగాణలో ఔటయిపోయానన్న నిర్ణయానికి వచ్చి దేశాన్ని ఏలాలని కలలు

టీఆర్‌ఎస్‌కు ఇక వీఆర్‌ఎస్సే

రాష్ట్రాన్ని దోచుకున్నది చాలక దేశ రాజకీయాల్లోకా?: బండి సంజయ్‌

కేసీఆర్‌వి పగటి కలలు: తరుణ్‌ చుగ్‌


హైదరాబాద్‌/న్యూఢిల్లీ, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): టైంపాస్‌ రాజకీయాలు చేయడంలో సీఎం కేసీఆర్‌ దిట్ట అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. తెలంగాణలో ఔటయిపోయానన్న నిర్ణయానికి వచ్చి దేశాన్ని ఏలాలని కలలు కంటున్నారన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని దోచుకోవటం అయిపోయింది... ఇక దేశాన్ని దోచుకునేందుకు జాతీయ పార్టీనా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎ్‌స(భారతీయ రాష్ట్ర సమితి) లేదు.. టీఆర్‌ఎస్‌ లేదు.. వాళ్లకు వీఆర్‌ఎస్సే అని జోస్యం చెప్పారు. జాతీయ పార్టీ పెట్టేముందు రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎనిమిదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? అని సవాల్‌ చేశారు. దేశాన్ని బీజేపీ ఎక్కడ విచ్ఛిన్నం చేసిందో చెప్పాలని ఆయన సీఎంను నిలదీశారు. కులాలు, వర్గాల పేరుతో తెలంగాణను కేసీఆర్‌ విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు చేస్తున్నారా? అంటూ టీఆర్‌ఎస్‌ చేసిన ప్రకటనపై చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధుకు, ఫీజు రీఇంబర్స్‌మెంటుకు, ఆరోగ్యశ్రీకి నిధులెందుకు ఇస్తలేరని ప్రశ్నించారు.


డబుల్‌బెడ్‌రూంలు ఎందుకు పంపిణీ చేయటం లేదని, ధనిక రాష్ట్రంలో జీతాలు, పింఛన్లు సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు? పుట్టబోయే బిడ్డ మీద కూడా లక్షా 20వేల అప్పు ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద కేంద్రం బియ్యం ఇస్తే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటినీ అమ్ముకుంటోందని ఆరోపించారు. కేంద్ర పథకాలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారో సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు, మైనార్టీ విద్యాసంస్థల్లో ఫీజుల పెంపును నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌లో ఉండి పగటి కలలు కంటున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ విమర్శించారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కొత్త పార్టీని స్థాపించటానికి కేసీఆర్‌ను సాగ్వతిస్తున్నామని తెలిపారు. అయితే బంగారు తెలంగాణ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. 8 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై ప్రగతి పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  రాష్ట్రంలో నేరాలు, బాలికలపై అత్యాచారాలను కట్టడి చేయకుండా రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ వాహనంలో రేప్‌ జరిగినా సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తెలంగాణాలో ఒరగబెట్టింది ఏమీ లేక, ఇక దేశ రాజకీయాలంటూ సీఎం కేసీఆర్‌ కొత్త పల్లవి ఎత్తుకున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు.


తెలంగాణ ప్రజలు వీఆర్‌ఎస్‌ ఇస్తుంటే, కేసీఆర్‌ మాత్రం బీఆర్‌ఎస్‌ అంటున్నారని మండిపడ్డారు. అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారుగాజులు తొడుగుతా అన్నట్లుగా కేసీఆర్‌ వైఖరి ఉందని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎంబీసీల సదస్సులో మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణాలో ఎంబీసీల బతుకులు ఆగమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

Read more