విహార నౌకకు నో ఎంట్రీ

ABN , First Publish Date - 2022-06-11T09:10:22+05:30 IST

సాగర విహార నౌక ఎంవీ ఎంప్రె్‌సకు ఆదిలోనే అవాంతరం ఎదురైంది.

విహార నౌకకు నో ఎంట్రీ

క్రూయిజ్‌ షిప్‌కు పుదుచ్చేరిలో చుక్కెదురు

పోర్టులోకి అనుమతించని గవర్నర్‌ తమిళిసై

విశాఖపట్నం, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): సాగర విహార నౌక ఎంవీ ఎంప్రె్‌సకు ఆదిలోనే అవాంతరం ఎదురైంది. ముందుగా అనుమతులు తీసుకోనందున ఈ నౌకను పుదుచ్చేరి పోర్టులోకి అనుమతించలేదు. కార్డోలియో క్రూయిజ్‌ లైన్స్‌కు చెందిన ఈ నౌకను ఈ నెల 6న తమిళనాడు సీఎం స్టాలిన్‌ చెన్నైలో జెండా ఊపి ప్రారంభించారు. రెండు రోజుల ప్రయాణం అనంతరం 8న నౌక విశాఖపట్నం చేరుకుంది. ఏపీ పర్యాటక శాఖా మంత్రి రోజా నౌక మొత్తం కలియదిరిగి.. ప్రయాణికులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ నౌక చెన్నైలో బయల్దేరి విశాఖపట్నం, పుదుచ్చేరిల మీదుగా తిరిగి శనివారం చెన్నై చేరుకోవాలి. షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం ఉదయం పుదుచ్చేరి పోర్టుకు వెళ్లాలి. అయితే ముందుగా అనుమతులు తీసుకోనుందున ఈ నౌకను పోర్టులోకి అనుమతించబోమని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై స్పష్టం చేశారు. క్రూయిజ్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం, కేసినోలు ఉన్నందున, వాటికి కేంద్ర పాలిత ప్రాంతంలోకి అనుమతి లేదని, వెనక్కి వెళ్లిపోవాలని తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకే పుదుచ్చేరి సముద్ర జలాల్లోకి ప్రవేశించిన క్రూయిజ్‌ అనుమతి కోసం ఎదురుచూసి ప్రయత్నాలు ఫలించక తమిళనాడుకు చెందిన కడలూరు పోర్టులో యాంకరింగ్‌ కోసం ప్రయత్నింది. అయితే షెడ్యూల్‌ ప్రకారం శనివారం ఉదయానికల్లా చెన్నై చేరాల్సి ఉండడంతో అటు నుంచి అటే బయలుదేరినట్టు విశాఖలోని ట్రావెల్స్‌ వర్గాలు తెలిపాయి. 

Read more