‘బఫర్‌’ లేదు.. ఏమీ లేదు

ABN , First Publish Date - 2022-09-28T08:20:02+05:30 IST

‘‘ఇక్కడ బఫర్‌ లేదు.. ఏమీ లేదు.. యథేచ్ఛగా ఇళ్లు కట్టుకోండి అని ఘట్‌కేసర్‌ పరిధిలో ఇళ్ల నిర్మాణదారులకు రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి సూచించారు.

‘బఫర్‌’ లేదు.. ఏమీ లేదు

  • యథేచ్ఛగా ఇళ్లు కట్టుకోండి
  • అధికారులెవరూ రారు.. 
  • కౌన్సిలర్‌ వస్తే పాతేయండి
  • ఘట్‌కేసర్‌ ప్రజలతో మంత్రి మల్లారెడ్డి  

ఘట్‌కేసర్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇక్కడ బఫర్‌ లేదు.. ఏమీ లేదు.. యథేచ్ఛగా ఇళ్లు కట్టుకోండి అని ఘట్‌కేసర్‌ పరిధిలో ఇళ్ల నిర్మాణదారులకు రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి సూచించారు. అంతేనా.. ‘‘స్థానిక కౌన్సిలర్‌ ఇటువైపు వస్తే పాతిపెట్టండి’’ అని పిలుపునిచ్చారు. అక్కడితో ఆగకుండా.. ‘‘వాని జాగీరా? వసూళ్ల కోసం మనుషులను పెట్టిండా? ఇది వాని చెక్‌పోస్టా?’’ అని రాయలేని భాషలో బూతులు తిట్టారు. అనంతరం బఫర్‌ జోన్‌లో ఇళ్లు నిర్మించుకుంటున్న వారి జోలికెవరూ వెళ్లొద్దని ఆయా శాఖల అధికారులకు గట్టిగా చెప్పారు. ఇలా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మునిసిపాలిటీ పరిధిలోని మూడవ వార్డు పరమేశ్వరీనగర్‌ వాసులకు మల్లారెడ్డి  మద్దతుగా మాట్లాడారు. అక్కడ అధికారులు ఇటీవల కూల్చివేసిన ఓ అక్రమ నిర్మాణాన్ని మంగళవారం మంత్రి పరిశీలించారు. 


ఈ సందర్భంగా స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుడు, ఘట్‌కేసర్‌ మునిసిపాలిటీ మూడవ వార్డు కౌన్సిలర్‌ భర్త ప్రభాకర్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి సమక్షంలోనే అధికారులకు ఫోన్లు చేసి.. ‘‘ఇక్కడ మా కౌన్సిలర్‌ నిర్మాణదారుల నుంచి మూడు, నాలుగు లక్షల లంచం డిమాండ్‌ చేస్తున్నాడు’’ అని చెప్పారు.  అనంతరం ఎవరైనా సరే డబ్బులడిగినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్మాణదారులకు సూచించారు. ఈ మేరకు అక్కడే ఉన్న సీఐకి ఫిర్యాదులు తీసుకోవాలని చెప్పారు.  పరమేశ్వరీనగర్‌లో పేదలు 30 ఏళ్లక్రితం ప్లాట్లు కొనుక్కున్నారని, ఎన్‌వోసీలు కూడా ఉన్నాయని, వారి తెరువుకు ఎవరూ రావొద్దని అధికారులకు గట్టిగా చెప్పారు.  ఎక్కడో చెరువుంటే ఇక్కడ బఫర్‌ జోన్‌ పేరుతో నిర్మాణాలు ఆపడం సరికాదన్నారు. కాగా కౌన్సిలర్‌ భర్త ప్రభాకర్‌రెడ్డి తనను ఇబ్బందుకు గురి చేస్తున్నాడని వెంకటేశ్‌ అనే వ్యక్తి చెప్పగా అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేస్తే ఆయనపై పీడీ యాక్టు కింద కేసు పెట్టించి జైలుకు పంపేలా చేస్తానని మాటిచ్చారు.  

Read more